బాబు ష్యూరిటీ.. 'గూండాయిజం' గ్యారెంటీ! | Chandrababu Naidu Govt Redbook Rule in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

బాబు ష్యూరిటీ.. 'గూండాయిజం' గ్యారెంటీ!

Jul 15 2025 5:00 AM | Updated on Jul 15 2025 7:37 AM

Chandrababu Naidu Govt Redbook Rule in Andhra Pradesh

అసమర్థ పాలన, హామీల ఎగవేతపై ప్రజలు నిలదీస్తుండటంతో గంగవెర్రులు 

పచ్చ ముఠాలను విధ్వంసాలకు ప్రేరేపిస్తున్న ప్రభుత్వ పెద్దలు

శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు కుయుక్తులు   

‘రీ కాలింగ్‌ చంద్రబాబు మేనిఫెస్టో..’ కార్యక్రమాన్ని అడ్డుకుంటూ కుతంత్రాలు.. పల్నాడు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ నేతలు, శ్రేణులపై దాడులు 

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటనల్లో చొరబడి టీడీపీ గూండాల దాష్టీకం.. సహకరిస్తున్న పోలీసులు 

గుంటూరు మిర్చి యార్డు.. ‘ప్రకాశం’ పొగాకు.. బంగారుపాళ్యం మామిడి యార్డు వద్ద అవే దృశ్యాలు  

సాక్షి, అమరావతి: సూపర్‌ సిక్స్‌ సహా ఎన్నికల హామీల అమలు, పాలనలో పూర్తిగా విఫలమై ప్రజాస్వామ్యం పీక నులుముతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. బాబు ష్యూరిటీ అంటే మోసాలే కాదు.. గూండాయిజం గ్యారెంటీ!’’ అన్నట్లు అరాచకంగా వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు, పరిశీలకులు వ్యాఖ్యాని­స్తున్నారు! ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా పదేపదే దాడులకు పచ్చ మూకలను ఉసిగొల్పుతుండటాన్ని, పోలీసులను ప్రయోగిస్తుండటాన్ని గుర్తు చేస్తున్నారు. 

హామీలను నెరవేర్చలేని తన అసమర్థత, పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు.. దీనిపై చర్చ జరగకుండా ఉండేందుకే రాష్ట్రంలో ధ్వంస రచనకు తెగిస్తున్నారని పేర్కొంటున్నారు. పక్కా కుతంత్రంతో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని హత్యాయత్నాలు, దాడులకు ప్రభుత్వ పెద్దలే పురిగొల్పడం విభ్రాంతి కలిగిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటనలను అడ్డుకుని అలజడి రేకెత్తించడమే లక్ష్యంగా ముందస్తు కుట్రతో రౌడీ మూకలను టీడీపీ మోహరిస్తోంది. 

పర్యట­నల్లో శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు యత్నిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టో అమలులో చంద్రబాబు సర్కారు వైఫల్యాన్ని నిలదీస్తూ వైఎస్సార్‌­సీపీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘రీ కాలింగ్‌ చంద్రబాబు మేనిఫెస్టో..’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు టీడీపీ గూండాలను రంగంలోకి దించారు. ఈ నేపథ్యంలో పలుచోట్ల వైఎస్సార్‌సీపీ నేతల నివాసాలపై దాడులకు తెగబడుతూ హత్యా­యత్నాలకు సైతం వెనుకాడటం లేదు. ఈ అరా­చకాన్ని ప్రభుత్వ పెద్దలే ప్రోత్సహిస్తుండటంతో పోలీస్‌ యంత్రాంగం కళ్లు మూసుకుని కూర్చొంది.

ప్రజల్లోకి వెళ్లకుండా వైఎస్‌ జగన్‌ను నిరోధించే కుట్ర..!
ఎన్నికల హామీలు, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ దారుణ వైఫల్యాలను ఎండగడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాల్లో పర్యటిస్తుండటం ప్రభుత్వ పెద్దలకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. దీంతో ఆయన పర్యటనలను అడ్డుకుని తీరాలని, శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు కూడా వెనుకాడవద్దని పచ్చ ముఠాలకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. 

గిట్టుబాటు ధరలు దక్కక తీవ్రంగా నష్టపోతున్న మిర్చి రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 19న గుంటూరు మిర్చి యార్డును సందర్శించిన సమయంలో పోలీసులు కనీస భద్రత కల్పించకపోగా టీడీపీ మూకలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. దీంతో వైఎస్సార్‌సీపీ నేతలే ఆయనకు ఇరువైపులా నిలబడి భద్రత కల్పించాల్సి వచ్చింది. 

ఇక పొగాకు రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్‌ జగన్‌ జూన్‌లో ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించినప్పుడు టీడీపీ గూండాలు మార్గమధ్యంలో మాటు వేయడం తీవ్ర ఆందోళన కలిగించింది. అనుమతి లేకపోయినా అంతమంది టీడీపీ నేతలు, గూండాలను ఆ మార్గంలోకి పోలీసులు అనుమతించడం గమనార్హం. టీడీపీ రౌడీల గుంపు వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌పై దాడికి యత్నించడంతో పరిస్థితి ఉద్రికత్తంగా మారింది. 

అదే నెలలో వైఎస్‌ జగన్‌ పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటనలోనూ అసాంఘిక శక్తులు చొరబడటం గమనార్హం. అరాచక ముఠాలు ఏకంగా వైఎస్‌ జగన్‌ వాహనం వద్దకు చొచ్చుకు వస్తున్నా పోలీసులు చోద్యం చూశారు. మామిడి రైతులను ఓదార్చేందుకు వైఎస్‌ జగన్‌ తాజాగా చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో నిర్వహించిన పర్యటనలో రభస సృష్టించేందుకు టీడీపీ యత్నించింది. గతంలోనూ ఇదే కుట్రలకు వ్యూహ రచన చేసింది. 

శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండల ఎంపీపీ ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్సార్‌ సీపీ కార్యకర్త, బీసీ సామాజిక వర్గానికి చెందిన కురుబ లింగమయ్యను మార్చి 30న దారుణంగా అంతమొందించారు. అధికార పార్టీ అరాచకాలు, అఘాయిత్యాలపై ప్రశ్నించినందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఏప్రిల్‌ 8న వైఎస్‌ జగన్‌ అక్కడికి వెళ్లగా పోలీసులు కనీస భద్రత కల్పించలేదు. 

వైఎస్‌ జగన్‌ను చూసేందుకు ప్రజలు దూసుకురావడంతో హెలికాప్టర్‌ విండ్‌షీల్డ్‌ డెబ్బతింది. దీనిపై రాప్తాడు మాజీ ఎమ్యెల్యే, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డితోపాటు 28 మందిపై అక్రమ కేసులు బనాయించారు. ఇలా వైఎస్‌ జగన్‌ పర్యటనల్లో ఘర్షణలు, ఉద్రిక్తత సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలన్నది కూటమి సర్కారు కుట్రగా స్పష్టమవుతోంది. ఆ నెపంతో వైఎస్‌ జగన్‌ పర్యటనలకు అనుమతి నిరాకరించి ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవాలన్నది ప్రభుత్వ పెద్దల ఎత్తుగడ!



నల్లపరెడ్డి ఇంటిపై దాడి.. విధ్వంసం 
ఇటీవల శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో టీడీపీ గూండాలు వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసంపై దాడి చేసి పెను విధ్వంసం సృష్టించారు. ప్రసన్న కుమార్‌రెడ్డిని హత్య చేసేందుకు పక్కా పన్నాగంతోనే ఈ దాడికి తెగబడ్డారు. 

ఆ సమయంలో ఆయన నివాసంలో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. టీడీపీ గూండాలు  ఆయన ఇంటితోపాటు ఫర్నిచర్, వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి తిరిగి ఆయనపైనే అక్రమ కేసులు నమోదు చేయడం విస్మయం కలిగిస్తోంది.  

నెల్లూరులో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి ఇంటిపై టీడీపీ గూండాలు దాడి చేసిన దృశ్యం (ఫైల్‌) 

జెడ్పీ చైర్‌ పర్సన్‌పై దుశ్చర్య
టీడీపీ రౌడీల విధ్వంసకాండ కృష్ణా జిల్లాలో మరింత పేట్రేగిపోయింది. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్, బీసీ మహిళ ఉప్పాల హారికపై పచ్చ మూకలు శనివారం దాడికి పాల్పడ్డాయి. గుడివాడ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ తలపెట్టిన రీ కాలింగ్‌ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం సన్నాహక సమావేశానికి వస్తున్న హారికను లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించారు. ఆమె వాహనంపై దాడి చేశారు. మహిళ అని కూడా చూడకుండా పరుష పదజాలంతో దూషిం­చారు. 

ఈ కార్యక్రమాల్లో పాల్గొనే వైఎస్సార్‌­సీపీ నేతలపై గూండాయిజానికి వెనుకాడబోమని చంద్రబాబు సర్కారు సంకేతాలిచ్చింది. మచిలీ­పట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని నివాసంపైనా దాడికి టీడీపీ మూకలు పన్నాగం పన్నాయి. ఆయన నివాసానికి భారీగా తరలి రావాలని టీడీపీ నేతలు తమ కార్యకర్తలు, గూండాలను ఆదేశించారు. దీంతో మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు అతి కష్టం మీద వారిని వెనక్కి పంపించారు. 

కానీ మచిలీపట్నంలో పరిస్థితి ఏ క్షణంలోనైనా అదుపు తప్పేలా ఉంది. ఇతర  జిల్లాల్లో కూడా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా టీడీపీ గూండాలు దాడులకు వ్యూహ రచన చేస్తున్నారు. ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’ కార్య­క్రమం నిర్వహించకుండా  దాడులకు తెగబడా­లని చంద్రబాబు ప్రభుత్వం అరాచక ముఠాలకు గంపగుత్తగా లైసెన్స్‌ జారీ చేసింది. రాష్ట్రంలో విధ్వంస కాండకు ప్రభుత్వమే కొమ్ము కాస్తుండటం పట్ల సర్వత్రా విభ్రాంతి వ్యక్తమవుతోంది.  

‘రీ కాలింగ్‌ చంద్రబాబు మేనిఫెస్టో’తో వణుకు 
ఎన్నికల మేనిఫెస్టో అమలులో చంద్రబాబు సర్కారు వైఫల్యంపై ప్రజలను చైతన్య పరిచేందుకు వైఎస్సార్‌సీపీ రూపొందించిన రీ కాలింగ్‌ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్ర­మం ప్రభుత్వ పెద్దలను గంగవెర్రులెత్తిస్తోంది. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా మేనిఫెస్టోను ప్రభుత్వం అమలు చేయలేకపో­యింది. ఇక ముందు అమలు చేసే ఉద్దేశం కూడా లేదన్నట్టుగా వ్యవహరిస్తోంది. 

ఈ నేపథ్యంలో ఆ మోసాలను ఎండగడుతూ వైఎస్సార్‌సీపీ ప్రజలకు వివరించేందుకు ఉప­క్రమించడం చంద్రబాబు సర్కారును బెంబేలె­త్తిస్తోంది. దీంతో ఆ కార్యక్రమాన్ని అడ్డు­కు­నేందుకు ఎంతకైనా తెగించాలని ఆదేశించారు. తత్ఫలితమే రాష్ట్రంలో వరుసగా వైఎస్సార్‌సీపీ నేతలపై జరుగుతున్న దాడులు, విధ్వంసం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement