
సాక్షి, విజయవాడ: ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేదొకటి.. చేసేదొకటి అని ఎవరికి అడిగినా చెబుతారు. ఆయన మాటలకు చేతలకు అసలు పొంతనే ఉండదు. ఇది ఇప్పటికే ఎన్నోసారు నిరూపితమైంది. ఇక, తాజాగా మరోసారి చంద్రబాబు మాటల్లో మోసం రుజువైంది. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని కల్లబొల్లి కబుర్లు చెప్పిన బాబు.. దీనికోసం ఇప్పటికే వేల కోట్ల అప్పులు తీసుకురాగా.. మళ్లీ చందాల సేకరణకు నడుం బిగించారు.
చంద్రబాబు సర్కార్ అమరావతి కోసం మళ్ళీ చందాలు అనే ప్లాన్ ముందుకు తీసుకువచ్చింది. ఏకంగా క్యూఆర్ కోడ్ ద్వారా విరాళాల సేకరణ చేపట్టింది. అమరావతి నిర్మాణంలో భాగస్వాములవ్వాలంటూ చందాలు సేకరణ ప్రారంభించింది. విరాళాలు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. సీఆర్‌డీఏ వెబ్‌సైట్ crda.ap.gov.in లో ఇందుకు ప్రత్యేకంగా ‘డొనేట్ ఫర్ అమరావతి’ అనే ఆప్షన్ ఇచ్చారు.
ఇక, 2015లో కూడా రాజధాని నిర్మాణం కోసం ‘మై బ్రిక్..మై అమరావతి’ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం విరాళాలు సేకరణ చేసిన విషయం తెలిసిందే. ఒక్కో ఈ-ఇటుకను రూ.10 పేరుతో విరాళాల సేకరించారు. అప్పటి విరాళాలు ఏమయ్యాయో లెక్కను మాత్రం సీఆర్‌డీఏ ఇప్పటి వరకు చెప్పకపోవడం విశేషం. మళ్ళీ ఇప్పుడు విరాళాల సేకరణకు కూటమి సర్కార్ శ్రీకారం చుట్టింది. కాగా, అమరావతికి అప్పులు పుట్టక చంద్రబాబు ప్రభుత్వం విరాళాలు సేకరణ చేపడుతున్నట్టు పలువురు చెప్పుకుంటున్నారు. మరోవైపు.. చంద్రబాబు ఇప్పటికే అమరావతి కోసం 31 వేల కోట్లు అప్పులు చేశారు. మరో 70వేల కోట్ల అప్పులు కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

రైతులతో మంత్రి భేటీ..
ఇదిలా ఉండగా.. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు అమరావతి రైతు జేఏసీ నాయకులతో మంత్రి నారాయణ సమావేశం కానున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కనీసం అమరావతి రైతులకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని జేఏసీ నేతలు బహిరంగ విమర్శలు చేసిన తర్వాత సమావేశం అవుతున్నారు. అమరావతిలో రైతులు కేటాయించిన ప్లాట్లు డెవలప్ చేయట్లేదని, భూముచ్చిన రైతుల్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదని నాలుగు రోజుల ముందు అమరావతి జేఏసీ నాయకులు సమావేశం నిర్వహించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా అమరావతి రైతులు.. సీఆర్‌డీఏ కార్యాలయాల్లో రైతులను అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారని, పనిచేయాలంటే లంచాలు అడుగుతున్నారని బహిరంగ విమర్శ చేశారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు.
