నా పాల వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నారు

Chandrababu Comments On YSRCP Govt In Tirupati - Sakshi

‘వకీల్‌సాబ్‌’పైనా సర్కారు వేధింపులు

వడ్డీతో సహా కక్ష తీర్చుకుంటాం

వలంటీర్లు వెంట్రుక కూడా పీకలేరు

ఉద్యోగుల తోకలు కట్‌చేస్తా

పొదలకూరు, తిరుపతిలో చంద్రబాబు

సాక్షి, పొదలకూరు/తిరుపతి: ముప్పై ఏళ్లుగా తాను పాల వ్యాపారం చేస్తుంటే దానిని దెబ్బతీయాలని గుజరాత్‌ నుంచి ఒకడిని (అమూల్‌) పట్టుకొచ్చారని.. వాడికి బలవంతంగా పాలు పోయమంటున్నారని.. ఇది కక్షసాధింపు కాదా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. మీరు ఈ రాష్ట్రంలో ఉంటారు, ఎక్కడికి వెళ్లిపోరు.. అసలు, వడ్డీతో సహా మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి అని వైఎస్సార్‌సీపీ నేతలనుద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. పవన్‌ను, తనను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం చంద్రబాబు నెల్లూరు జిల్లా పొదలకూరులో పర్యటించారు. సభలో ఆయన మాట్లాడుతూ.. వకీల్‌సాబ్‌ సినిమా స్పెషల్‌ షోలకు ఏపీలో అనుమతులివ్వలేదని, పవన్‌పై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆరోపించారు. తాను తలుచుకుంటే ఒక్కరు కూడా మిగలరు.. ఖబడ్దార్‌ అంటూ వైఎస్సార్‌సీపీ నేతలను ఉద్దేశించి హెచ్చరించారు. అలాగే, విశాఖలో ఆంధ్రజ్యోతి పత్రికకు సంబంధించిన గోడౌన్‌కు అన్ని అనుమతులున్నా ఆక్రమించారంటూ కూల్చివేశారని ఆరోపించారు.

అధికారంలోకి వస్తేకార్యకర్తలకు ఫుల్‌ పవర్స్‌
అంతకుముందు.. శ్రీకాళహస్తిలో జరిగిన కార్యకర్తల సమావేశంలోనూ చంద్రబాబు మాట్లాడారు. పార్టీ కోసం టీడీపీ కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేశారని.. అయితే వారికి న్యాయం చేయలేకపోయానన్నారు. న్యాయం చేయలేదని మనస్సులో పెట్టుకోవద్దని, ఎనిమిది రోజులపాటు అన్ని పనులు వదిలిపెట్టి పార్టీ సత్తాచాటాలని కోరారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసుధన్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ బొజ్జల సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘మీరు సీఎం అయితే మేం ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా.. జరగాల. ఇప్పుడున్న పోలీసులు, రెవెన్యూ వారిపై కక్ష తీర్చుకోవాలి’.. అని కోరగా, చంద్రబాబు స్పందిస్తూ.. ప్రభుత్వం వచ్చాక కార్యకర్తలకు ఫుల్‌ పవర్స్‌ ఇచ్చి వడ్డీతో సహా కక్ష తీర్చుకునేలా అవకాశం కల్పిస్తామన్నారు. వలంటీర్లు వెంట్రుకలు కూడా పీకలేరని మండిపడ్డారు. ఉద్యోగులు తోక తిప్పితే కట్‌ చేస్తానని హెచ్చరించారు.
నిలిచిపోయిన 108 అంబులెన్స్‌ 

అంబులెన్స్‌కు దారివ్వని తమ్ముళ్లు
పొదలకూరు: నెల్లూరు జిల్లా పొదలకూరులో టీడీపీ కార్యకర్తలు మానవత్వం లేకుండా వ్యవహరించారు. ‘108’ అంబులెన్స్‌కు వారు దారి ఇవ్వలేదు. పట్టణంలో శుక్రవారం చంద్రబాబు రోడ్‌షో, బహిరంగసభ కోసం గేటు సెంటరుకు ఆ పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. ఇంతలో.. గుండెనొప్పితో బాధపడుతున్న పొదలకూరు మండలానికి చెందిన మహిళను 108లో నెల్లూరు ఆస్పత్రికి తరలిస్తున్నారు. అంబులెన్స్‌ గేటు సెంటర్‌కు చేరుకుంది. అయితే, టీడీపీ తమ్ముళ్లు సుమారు 30 నిమిషాలపాటు దాన్నిపట్టించుకోలేదు. దారి ఇవ్వమని 108 టెక్నీషియన్‌ (డ్రైవర్‌)తో పాటు బాధితురాలి కుటుంబ సభ్యులు ఎంత బతిమాలినా కనికరించలేదు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top