Rythu Bharosa: దేశమంతటా ‘ఆర్బీకే’ సేవలు!

Central Govt Focus Rythu Bharosa Centres All Over Country - Sakshi

ఏపీ ప్రభుత్వం మాదిరిగా దేశంలోని రైతులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా కేంద్రం అడుగులు

రాష్ట్ర రైతులకు రెండేళ్లుగా గ్రామస్థాయిలోనే నాణ్యమైన సేవలు

ఇప్పటికే ఏపీలో పర్యటించి ఆర్బీకేల పనితీరును ప్రశంసించిన నీతి ఆయోగ్, ఇతర కీలక సంస్థలు

దీంతో ఏపీ ఆర్బీకే వ్యవస్థపై దృష్టి సారించిన కేంద్ర వ్యవసాయ శాఖ

సంపూర్ణ అధ్యయనం కోసం నేడు రాష్ట్రానికి కేంద్ర బృందం 

సాక్షి, అమరావతి: మన రాష్ట్రంలోని రైతు భరోసా కేంద్రాల స్ఫూర్తితో దేశంలోని రైతులందరికీ ఆ తరహా సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని రైతులకు గ్రామస్థాయిలోనే సేవలందించే సంకల్పంతో రెండేళ్ల క్రితం నెలకొల్పిన ఆర్బీకే వ్యవస్థపై వివిధ రాష్ట్రాలతోపాటు ఆఫ్రికన్‌ దేశాలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. మన ఆర్బీకే వ్యవస్థను ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏవో) ప్రతిష్టాత్మక చాంపియన్‌ అవార్డుకు నామినేట్‌ చేసిన కేంద్రం.. ఈ తరహా సేవలను దేశమంతటా అమలు చేయాలని అడుగులు వేస్తోంది.

ఇందుకోసం దేశవ్యాప్తంగా ఆర్బీకే తరహాలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు దిశగా కసరత్తు చేపట్టింది. ఇప్పటికే పలు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికార బృందాలు రాష్ట్రంలో పర్యటించాయి. ఎఫ్‌ఏవో, నీతి ఆయోగ్, భారత వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఎఆర్‌), ఆర్బీఐ, కేంద్ర బృందాలు పలుమార్లు రాష్ట్రంలో పర్యటించి ఆర్బీకేల పనితీరును అధ్యయనం చేసి వెళ్లాయి. తాజాగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శి మనోజ్‌ అహూజా నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం బుధవారం రాష్ట్రంలో పర్యటించనుంది. 

కేంద్ర బృందం పర్యటన ఇలా..
రాష్ట్రంలో పర్యటించే బృందంలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సహాయ కార్యదర్శి రితీష్‌ చౌహాన్, వ్యవసాయ, కుటుంబ సంక్షేమ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కె.సునిల్, నోడల్‌ అధికారి అజయ్‌ కరణ్‌ సభ్యులుగా ఉన్నారు. బుధవారం ఉదయం 8.45 గంటలకు న్యూఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న ఈ బృందం నేరుగా గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌ను సందర్శిస్తుంది. అక్కడ సమీకృత రైతు సమాచార కేంద్రంతో పాటు ఆర్బీకే చానల్‌ ద్వారా రైతులకు అందిస్తున్న సేవలను పరిశీలిస్తుంది.

అనంతరం నేరుగా కంకిపాడు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌ను సందర్శిస్తుంది. ఈ ల్యాబ్‌ ద్వారా రైతులకు అందుతున్న సేవలను బృందం సభ్యులు పరిశీలిస్తారు. ఆ తర్వాత ఉయ్యూరు మండలం పెదఓగిరాల ఆర్బీకేను సందర్శిస్తారు. ఆర్బీకే ద్వారా రైతులకు అందుతున్న సేవలను పరిశీలించి స్థానిక రైతులతో భేటీ అవుతారు.

ఈ పంట నమోదుతో పాటు వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా అమలు తీరును పరిశీలిస్తారు. రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకం ఏ విధంగా అమలు చేస్తున్నారు? పీఎంఎఫ్‌బీవైకు ఈ పథకానికి ఉన్న వ్యత్యాసాలు ఏమిటి? కేంద్ర పథకంలో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి? ఈ పథకంలో పలు రాష్ట్రాలు చేరకపోవడానికి ప్రధాన కారణాలలేమిటి?  వంటి అంశాలను కూడా కేంద్ర బృందం అధ్యయనం చేస్తుంది. 

సీఎంతో భేటీకి ఛాన్స్‌
క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం కేంద్ర బృందంలోని సభ్యులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యే అవకాశం ఉంది. అనంతరం కేంద్రానికి నివేదిక సమర్పిస్తుంది. ఈ విషయమై వ్యవసాయ శాఖ ఇన్‌చార్జి కమిషనర్‌ డాక్టర్‌ గెడ్డం శేఖర్‌బాబు మాట్లాడుతూ.. ఆర్బీకే తరహా సేవలను జాతీయ స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం ఆలోచిస్తోందన్నారు. ఇందులో భాగంగానే కేంద్ర బృందం మన రాష్ట్రంలో పర్యటించనుందని చెప్పారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top