జీఎస్టీ ఎగవేతదారులను పట్టేద్దాం

Central and state GST officials have focused on raising revenue - Sakshi

చేతులు కలిపిన కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ విభాగాలు 

పన్ను ఎగవేతదారుల గుర్తింపునకు ప్రత్యేక విభాగాల ఏర్పాటు  

రాష్ట్ర అధికారులతో కేంద్ర అధికారుల భేటీలో నిర్ణయం

సాక్షి, అమరావతి: కరోనా కారణంగా తగ్గుతున్న ఆదాయాన్ని పెంచుకోవడంపై కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ అధికారులు దృష్టిసారించారు. సమాచార మార్పిడి ద్వారా పన్ను ఎగవేతదారులను గుర్తించి, ఆదాయ నష్టానికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. ఇందుకోసం గురువారం రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ(వాణిజ్యం, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్స్‌) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ నేతృత్వంలోని రాష్ట్ర అధికారులు, విశాఖ జోన్‌ కస్టమ్స్‌ అండ్‌ ఎక్సైజ్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌ నరేష్‌ నేతృత్వంలోని కేంద్ర అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు.

కేంద్ర, రాష్ట్ర అధికారులు తరుచూ సమావేశమవుతూ సమాచారం మార్పిడి ద్వారా పన్ను ఎగవేతదారులను గుర్తించాలని నిర్ణయం తీసుకున్నట్టు రజత్‌భార్గవ చెప్పారు. ఇరు విభాగాల్లో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా జీఎస్టీ ఆదాయానికి నకిలీ ఇన్‌వాయిస్‌లతో భారీగా గండి కొడుతున్న ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ క్లయిమ్‌లకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంస్థలు డీజీజీఐ, ఏపీఎస్‌డీఆర్‌ఐ వంటి వాటి సహకారంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమాచారం తీసుకుని విశ్లేషించనున్నారు. సమావేశంలో రాష్ట్ర పన్నుల చీఫ్‌ కమిషనర్‌ పీయూష్‌ కుమార్, వైజాగ్‌ కమిషనరేట్‌ ప్రిన్సిపల్‌ కమిషనర్‌ ఫాహీమ్‌ అహ్మద్‌ పాల్గొన్నారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top