పోలవరం పనులపై కేంద్రం ప్రశంస

Center Govt praise Andhra Pradesh Government On Polavaram Project works - Sakshi

సకాలంలో స్పిల్‌వే పూర్తిచేయడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని

ప్రశంసించిన కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే పనులను రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూలు ప్రకారమే పూర్తిచేసిందని కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ ప్రశంసించారు. గోదావరికి వరద వచ్చేలోగా ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులను సురక్షిత స్థాయికి పూర్తిచేయాలని రాష్ట్ర జలవనరులశాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. జూలైలోగా 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని ఆదేశించారు. వచ్చే సీజన్‌లో పనులను పూర్తిచేయడానికి తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు.

2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయానికి సంబంధించి కొన్ని అంశాలపై స్పష్టత కోరామని, వాటిపై వివరణ ఇస్తే పెట్టుబడి అనుమతి (ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌) జారీచేస్తామని చెప్పారు. తాజా ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ ప్రకారం పోలవరానికి నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపుతామని, కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేస్తే 2017–18 ధరల ప్రకారం నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై గురువారం ఢిల్లీ నుంచి కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ వర్చువల్‌ విధానంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్‌ హెచ్‌.కె.హల్దార్, రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి  పాల్గొన్నారు.

41.10 శాతం పూర్తి
పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌ (జలాశయం) పనులు 73.65 శాతం, కుడి కాలువ పనులు 91.69, ఎడమ కాలువ పనులు 70.10 శాతం.. వెరసి ప్రాజెక్టు పనులు 76.29 శాతం పూర్తయ్యాయని రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు వివరించారు. భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పన పనులు 20.19 శాతం పూర్తయ్యాయని.. మొత్తం కలిపితే 41.10 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. దీనిపై కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ స్పందిస్తూ.. స్పిల్‌ వే పనులను సకాలం లో పూర్తిచేశారని ప్రశంసించారు.   ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను  జూలై ఆఖరుకు 42.5 మీటర్ల ఎత్తుకు పూర్తిచేస్తామని ఈఎన్‌సీ నారాయణరెడ్డి చెప్పా రు.  వీలైనంత తొందరగా సమగ్ర ప్రాజెక్టు నివేదక (డీపీఆర్‌) రూపొందించి టెండర్లు పిలుస్తామని వివరించారు.

పునరావాస పనులు వేగవంతం
వరద వచ్చేలోగా 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని కుటుంబాలకు పునరావాసం కల్పిం చే పనులను వేగవంతం చేశామని సహాయ, పునరావాస విభాగం కమిషనర్‌ ఒ.ఆనంద్‌ తెలిపారు. దీనిపై పంకజ్‌కుమార్‌ స్పందిస్తూ జూలైలోగా పునరావాసం కల్పించాలని ఆదేశించారు.

గడువులోగా ప్రాజెక్టు పూర్తికి చర్యలు
పోలవరం ప్రాజెక్టును 2022 నాటికి పూర్తిచేయాలని పంకజ్‌కుమార్‌ ఆదేశించారు. ఈ సీజన్‌లో చేయగా మిగిలిన పనులను వచ్చే సీజన్‌లో పూర్తి చేయడానికి సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంలో 2017– 18 ధరల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.55,548.87 కోట్లకు సీడబ్ల్యూసీ సాంకేతిక సలహా మండలి (టీఏసీ) సవరించిందని, రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ (ఆర్‌సీసీ) రూ.47,725.74 కోట్లకు ఆమోదించిందని రాష్ట్ర జలవనరులశాఖ అధికారులు చెప్పారు. ఆ మేరకు పెట్టుబడి అనుమతి ఇచ్చి, నిధులిస్తే గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవకాశం ఉం టుందన్నారు. దీనిపై పంకజ్‌కుమార్‌ సానుకూలంగా స్పందించారు.కొన్ని అంశాలపై స్పష్టత కోరామని, వాటిపై వివరణ ఇస్తే పెట్టుబడి అనుమతి ఇస్తామని చెప్పారు. 2010–11 ధరల ప్రకారం పోలవరానికి కేంద్ర కేబినెట్‌ నిధులు మంజూరు చేసిందన్నారు. 2017–18 ధరల ప్రకారం నిధులు మంజూరు చేయాలని కేంద్ర కేబినెట్‌కు ప్రతిపాదనలు పంపుతామని, ఆమోదం లభిస్తే ఆ మేరకు నిధులు మంజూరు చేస్తామని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top