ఐదేళ్లకుపైగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించాలి | Cases pending for over five years must be resolved | Sakshi
Sakshi News home page

ఐదేళ్లకుపైగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించాలి

Mar 23 2026 4:49 AM | Updated on Mar 23 2026 4:49 AM

Cases pending for over five years must be resolved

హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్‌ రాజశేఖరరావు 

శృంగవరపుకోట: కోర్టుల్లో ఐదేళ్లకుపైబడి పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని న్యాయమూర్తులు పని చేయాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్‌ తర్లాడ రాజశేఖరరావు చెప్పారు.  విజయనగరం జిల్లా ఎస్‌.కోటలో రూ.8.5 కోట్లతో నిరి్మంచనున్న సింగిల్‌ కోర్టు కాంప్లెక్స్‌ భవన శంకుస్థాపన కార్యక్రమంలో న్యాయమూర్తులు పాల్గొన్నారు. ముందుగా భవన నిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 

అనంతరం ఎస్‌.కోట బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గోగాడ సూరిదేముడు నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ మాట్లాడుతూ ఎస్‌.కోటలో కోర్టు భవనానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోర్టు భవనాలన్నీ ఒకేలా ఉండేలా డిజైన్‌ చేశారని, మరో పాతికేళ్ల తర్వాత అవసరాలకు తగ్గట్టుగా కోర్టు భవనాల నిర్మాణం చేస్తున్నట్టు చెప్పారు. కోర్టు బెంచ్‌–బార్‌ సమన్వయంతో కలిసి పనిచేస్తేనే నాణ్యమైన మంచి తీర్పులు వస్తాయన్నారు.  

కొన్ని సివిల్‌ తగాదాలు 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నట్టు  గమనించామని, జ్యుడీషియల్‌ వ్యవస్థపై  కోర్టులకు వెళ్తే తరాలు మారినా న్యాయం జరగదని, ఫలితం రాదన్న అపవాదు ఉందని, దాన్ని దూరం చేసేందుకు ప్రతి ఒక్కరూ పని చేయాలని సూచించారు. మెగా లోక్‌ అదాలత్‌లో తొలి విడతలో 3 లక్షలు, రెండవ విడతలో 3 లక్షలకుపైగా కేసులు పరిష్కారమయ్యాయని, ఈ విషయంలో గుంటూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు.  

న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ కృషితో నిధులు  
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ జడ్జి జస్టిస్‌ టి.రాజశేఖరరావు మాట్లాడుతూ  కేసుల జడ్జిమెంట్‌ సరిగా లేకుంటే మళ్లీ కేసులు పడే ఆస్కారం ఉందని పేర్కొన్నారు. ఎస్‌.కోట కోర్టు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ క్రెడిట్‌ని తన ఖాతాలో వేశారని పేర్కొన్నారు. 

తనకు జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ మంచి స్నేహితుడు, మార్గదర్శకులు అని చెప్పారు. జిల్లా న్యాయమూర్తి బి.బబిత,  గుంటూరు జిల్లా న్యాయమూర్తి సాయికళ్యాణ్‌ చక్రవర్తి, కలెక్టర్‌ రాంసుందర్‌రెడ్డి,  విజయనగరం ఎస్పీ ఎ.ఆర్‌.దామోదర్, పార్వతీపురం మన్యం జిల్లాల ఎస్పీ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement