వర్సిటీ కొలువుల భర్తీలో గందరగోళం | Candidates are extremely dissatisfied with the application process | Sakshi
Sakshi News home page

వర్సిటీ కొలువుల భర్తీలో గందరగోళం

Jun 12 2026 5:05 AM | Updated on Jun 12 2026 5:05 AM

Candidates are extremely dissatisfied with the application process

దరఖాస్తు విధానంపై అభ్యర్థుల తీవ్ర అసంతృప్తి 

బ్యాక్‌లాగ్, రెగ్యులర్‌ పోస్టులకు ఒకే దరఖాస్తు 

అప్లికేషన్‌లో ఏ పోస్టుకు దరఖాస్తు చేశారో తెలపని వైనం 

అభ్యర్థులు దరఖాస్తు చేసిన పోస్టుల విభజనను ఎలా చేస్తారంటూ ప్రశ్న 

ఆర్జీయూకేటీలో కాంట్రాక్టు ఉద్యోగులతో దరఖాస్తుల డేటా ప్రాసెసింగ్‌ 

నోడల్‌ ఆఫీసర్‌గా నియమితులైన ఓ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ చేతుల్లో నియామక ప్రక్రియ  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 1,523 అధ్యాపక పోస్టుల (ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌) భర్తీ ప్రక్రియ తీవ్ర గందరగోళంగా మారింది. ఆన్‌లైన్‌ దరఖాస్తు విధానంలో నెలకొన్న సాంకేతిక సమస్యలు, అస్పష్టమైన నిబంధనలు దశాబ్దాల అనుభవం ఉన్న బోధనా సిబ్బందిని, పీజీ, పీహెచ్‌డీ అభ్యర్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఒక అప్లికేషన్‌ను పూర్తి చేయడానికి అభ్యర్థులు గంటల తరబడి కంప్యూటర్ల ముందు పడిగాపులు కాయాల్సి వస్తోంది.  

ఒక్కటే దరఖాస్తు.. అంతుచిక్కని ప్రశ్నలు 
ఒక విశ్వవిద్యాలయంలోని బ్యాక్‌లాగ్, రెగ్యులర్, రిజర్వేషన్‌ కేటగిరీ పోస్టులకు విడివిడిగా కాకుండా.. అన్నింటికీ కలిపి ఒకే అప్లికేషన్‌గా పరిగణించడం పలు అనుమానాలకు తావిస్తోంది. అభ్యర్థి దరఖాస్తు సమర్పించిన తర్వాత వచ్చే ఫారంలో ఎక్కడా ఏ నోటిఫికేషన్‌ ప్రకారం, ఏ కేటగిరీ పోస్టుకు దరఖాస్తు చేశారనే స్పష్టత లేదు. బ్యాక్‌లాగ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 12 కంటే తక్కువ దరఖాస్తులు వస్తే రాత పరీక్ష (స్క్రీనింగ్‌ టెస్టు) ఉండదని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, తాము అసలు బ్యాక్‌లాగ్‌ పోస్టుకే దరఖాస్తు చేశామా లేదా అనేది తెలుసుకునే మార్గం లేకపోవడంతో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు.  

యూజీసీ నిబంధనలకు పాతర? 
నియామకాల్లో యూజీసీ నిబంధనలను తుంగలో తొక్కారనే విమర్శలు విద్యావేత్తల నుంచి వ్యక్తమవుతున్నాయి. పరిశోధన పత్రాల వివరాల్లో ‘యూజీసీ అప్రూవ్డ్‌ జర్నల్స్‌’ ఆప్షన్‌ను తొలగించి, కేవలం ’పీర్‌ రివ్యూడ్‌’ ఆప్షన్‌ మాత్రమే ఇచ్చారు. తమకు కావలసిన వారికి అక్రమంగా లబ్ధి చేకూర్చేందుకే ఈ విధమైన కుట్రకు తెరలేపారనే ఆందోళన అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది. కాగా, ఆన్‌లైన్‌ దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 15ను చివరి తేదీగా నిర్ణయించగా, హార్డ్‌ కాపీలను వర్సిటీలకు పంపేందుకు ఈ నెల 22 వరకు గడువుపొడిగించారు.  

ఆర్జీయూకేటీలో వింత పరిస్థితి 
రాజీవ్‌ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయంలో దరఖాస్తుల పరిశీలన వ్యవహారం మరీ విచిత్రంగా తయారైంది. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన అభ్యర్థుల డేటా నమోదు ప్రక్రియను తీవ్ర నిర్లక్ష్యంగా నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు పంపిన దరఖాస్తుల ఫిజికల్‌ కాపీలను కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న డిప్లొమో అర్హత గల ల్యాబ్‌ స్టాఫ్‌తో కంప్యూటర్లలో నమోదు చేయిస్తున్నారు. పీజీ, పీహెచ్‌డీ చేసిన ఉన్నత విద్యావంతుల దరఖాస్తులను డిప్లొమా సిబ్బందితో ప్రాసెస్‌ చేయించడం ఎంతవరకు సమంజసమని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.  

నోడల్‌ ఆఫీసర్‌ నియామకంలోనూ వివాదాలు 
ఇటీవల పీహెచ్‌డీ పూర్తి చేసిన ఒక అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు వర్సిటీ నియామక నోడల్‌ ఆఫీసర్‌ బాధ్యతలు అప్పగించడం వివాదాస్పదమైంది. త్వరలో చేపట్టే అసోసియేట్‌ ప్రొఫెసర్ల ఎంపికలో ఈయనే కీలకం కానున్నట్లు తెలుస్తోంది. ప్రమోషన్ల ద్వారా అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు దక్కించుకునేలా లబ్ధి చేకూర్చేందుకు, ఈ నోటిఫికేషన్‌లో ఒక్క రెగ్యులర్‌ అసిస్టెంట్, ప్రొఫెసర్‌ పోస్టు కూడా లేకుండా చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement