AP: పండుగలా పింఛన్ల పంపిణీ.. ఊరూ వాడా సంబరం

Beneficiaries happy over increased Pensions In Andhra Pradesh - Sakshi

తెల్లవారుజాము నుంచే లబ్ధిదారుల ఇళ్ల వద్ద సందడి

పెరిగిన పింఛన్‌ రూ.2,750 పంపిణీ చేసిన వలంటీర్లు

సీఎం జగన్‌ చిత్రపటాలకు లబ్ధిదారుల పాలాభిషేకం

పలు చోట్ల పంపిణీలో స్వయంగా పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు

ఇంకొన్ని చోట్ల పింఛన్‌ డబ్బులతో పాటు స్వీట్‌ బాక్సులు 

పింఛన్ల పెంపుపై వివిధ రూపాల్లో లబ్ధిదారుల హర్షం 

కొత్తగా ఎంపికైన వారికి మంజూరు పత్రాల పంపిణీ  

మొదటి రోజే లబ్ధిదారులకు రూ.1,257.25 కోట్లు అందజేత 

సాక్షి, అమరావతి: అవ్వాతాతలు సహా సామాజిక పింఛన్‌ రూ.2,750కి పెంపుపై లబ్ధిదారులు ఆనందభరితులయ్యారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే వారి ఇళ్ల వద్ద సందడి నెలకొంది. పెరిగిన పింఛన్‌పై వివిధ రూపాల్లో తమ సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేశారు. పలు చోట్ల వివిధ రకాల పింఛన్‌ లబ్ధిదారులు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తూ తమ దీవెనలను వ్యక్తపరిచారు. పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం కొనసాగింది.

ఈ ప్రభుత్వం వచ్చాక చిన్న కష్టం కూడా తెలియకుండా, ప్రతి నెలా వలంటీర్లు తమ ఇంటి వద్దకే వచ్చి.. పింఛన్లు పంపిణీ చేస్తున్న తీరు పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని లబ్ధిదారులు కొని­యా­డారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్త పింఛన్‌ మంజూరుకు పడే పాట్లు, ప్రతినెలా పింఛన్‌ డబ్బుల కోసం పడిగాపులు, చాంతాడంత క్యూలో నిలుచోలేక పడిన ఇబ్బందులను గుర్తు చేసుకున్నారు.

సీఎం జగన్‌ చెప్పిన మాటను చెప్పి­నట్లు ఆచరిస్తున్నారని కొనియాడారు. పింఛన్‌ పెంపును పురస్కరించుకుని ఆయా ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారులతో ముచ్చటించా­రు. ఈ సందర్భంగా సీఎం రాసిన లేఖను లబ్ధి­దారులకు పింఛన్‌ సొమ్ముతో పాటు అందజేశారు.
 
అవ్వాతాతల్లో ఆనందం
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో పలుచోట్ల లబ్ధిదారులు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. బ్రహ్మసముద్రం మండలంలో మంత్రి ఉషశ్రీ చరణ్‌ ఆధ్వర్యంలో లబ్ధిదారులు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ కేక్‌ కట్‌ చేసి తమ ఆనందాన్ని తెలియజేశారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నగర పంచాయతీలో ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్‌రెడ్డి పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు.

► వైఎస్సార్‌ జిల్లా కడప నగర కార్పొరేషన్‌ పరిధిలోని శంకరాపురంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా పింఛన్‌ లబ్ధిదారులతో ముచ్చటిస్తూ, డబ్బులు పంపిణీ చేశారు. విజయనగరం జిల్లా చీపురపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ పింఛన్ల పెంపు పోస్టర్‌ను ఆవిష్కరించారు. 

► నెల్లూరు జిల్లాలో జరిగిన పింఛన్ల పంపిణీలో మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి పాల్గొన్నారు. కొత్త లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు కార్డు, పెరిగిన పింఛన్‌ డబ్బులను పంపిణీ చేశారు.  కావలిలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ఉదయగిరిలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి పింఛన్ల పంపిణీని ప్రారంభించారు.  లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రాసిన లేఖను చదివి వినిపించారు.

► పశ్చిమగోదావరి జిల్లా తణుకు సజ్జాపురంలో ఆదివారం తెల్లవారు జామున రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పెంచిన పింఛను సొమ్మును, స్వీటు ప్యాకెట్‌ను లబ్ధిదారులకు అందజేశారు.  

► శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు, చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లులో స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి లబ్ధిదారులతో ముచ్చటించారు. పింఛన్ల పెంపు సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి లబ్ధిదారులకు రాసిన లేఖలను అందజేసి, పెరిగిన పింఛన్‌ డబ్బులు పంపిణీ చేశారు. 

► పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని గాంధీనగర్‌లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని వృద్ధులకు పెన్షన్లు అందజేశారు. సత్తెనపల్లి ఆరవ వార్డులో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, బాపట్ల జిల్లా వేమూరు మార్కెట్‌ యార్డు ఆవరణలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పింఛన్లు పంపిణీ చేశారు. 

► గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఆగతవరపుపాడులో ఎమ్మెల్యే కిలారి రోశయ్య, బాపట్లలో కలెక్టర్‌ విజయ్‌ కృష్ణన్‌.. అధికారులు, వలంటీర్లతో కలిసి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్‌ పంపిణీ చేశారు. కృష్ణా జిల్లా పెడనలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ లబ్ధిదారులతో మాట్లాడారు. సీఎం వారికి రాసిన లేఖలను అందజేయడంతో పాటు పింఛన్లు పంపిణీ చేశారు.   

తొలిరోజే 71.26% పంపిణీ 
1వ తేదీ (ఆదివారం) రాత్రి ఏడు గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 45,65,076 మందికి పెరిగిన పింఛను డబ్బుల పంపిణీ పూర్తయింది. తెల్లవారుజాము నుంచే వ­లం­టీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి రూ.1,257.25 కోట్లు అందజేశారు. తొలిరోజునే 71.26 శాతం మంది లబ్ధిదారులకు పంపిణీ పూర్తయినట్టు సెర్ప్‌ అధికారులు వెల్లడించారు. 1వ తేదీ సెలవు రోజు అయినప్పటికీ 13 జిల్లాల్లో 75 శాతానికి పైగా పంపిణీ పూర్తయిందని తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top