మెరిసే తీరం సూర్యలంక బీచ్‌

Bapatla Suryalanka Beach stands behind international beaches - Sakshi

‘బ్లూ ఫ్లాగ్‌’ సాధన దిశగా అడుగులు

అత్యంత అరుదైన గోల్డెన్‌ శాండ్‌ బీచ్‌గా ఇప్పటికే గుర్తింపు

ఐసీజెడ్‌ఎంలో భాగంగా రూ.10 కోట్లతో స్టేట్‌ ప్రాజెక్ట్‌ యూనిట్‌ ఏర్పాటు

సాక్షి, అమరావతి: బాపట్ల తీరంలోని సూర్యలంక అత్యంత అరుదైన బంగారపు వర్ణపు ఇసుక (గోల్డెన్‌ శాండ్‌)తో అంతర్జాతీయ బీచ్‌ల సరసన నిలుస్తోంది. ఈ బీచ్‌ అర్ధ చంద్రాకారంలో వంపు తిరిగి ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువ. అలల ఉధృతి లేకుండా (సైలెంట్‌ సీ) పర్యాటకులు స్నానాలు చేసేందుకు ప్రశాంత వాతావరణాన్ని కల్పిస్తోంది. బీచ్‌ వెంబడి నీళ్లలో ఎక్కడా రాళ్లు లేని ఈ బీచ్‌ ప్రతిష్టాత్మక ‘బ్లూ ఫ్లాగ్‌’ సర్టిఫికేషన్‌ సాధించే దిశగా అడుగులేస్తోంది. ఇంటిగ్రేటెడ్‌ కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌ (ఐసీజెడ్‌ఎం) ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్రభుత్వం దీనిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతోంది. రాష్ట్రంలో బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికేషన్‌ సాధించేలా 9 బీచ్‌లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.

ఇందులో భాగంగా ఇటీవల సూర్యలంక, ప్రకాశం జిల్లాలోని రామాపురం బీచ్‌లో కేంద్ర పర్యావరణ శాస్త్రవేత్తల బృందం నీటి నాణ్యత, పర్యావరణ, పర్యాటకుల రక్షణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో సూర్యలంక అత్యంత సురక్షితమైన, ఆహ్లాద వాతావరణం అందించే బీచ్‌గా ఉండటంతో దీని అభివృద్ధిపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఐసీజెడ్‌ఎం బీచ్‌లను బ్లూఫ్లాగ్‌కు అనుగుణంగా తయారు చేసేందుకు ఏపీలో రూ.10 కోట్లతో ‘స్టేట్‌ కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌(ఎస్‌సీజెడ్‌ఎంయూ)’ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇందులో 20 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వం, 30 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖ, మిగిలిన 50 శాతం నిధులను ప్రపంచ బ్యాంకు సమకూరుస్తోంది.

నీటి నాణ్యత పరిశీలన ఇలా..
బ్లూఫ్లాగ్‌ సర్టిఫికేషన్‌లో సముద్రపు నీటి నాణ్యత పరీక్షలు అత్యంత ముఖ్యమైనవి. ఇటీవల కేంద్ర పర్యావరణ శాస్త్రవేత్తల బృందం సూర్యలంక, ప్రకాశం జిల్లాలోని రామాపురం బీచ్‌లలో పర్యటించి వరుసగా ఐదు రోజుల పాటు నీటి నాణ్యతను పరిశీలించారు. దాదాపు ఒక్కోచోట 30 నుంచి 40 వరకూ నమూనాలు సేకరించారు. బీచ్‌ ఒడ్డు నుంచి దాదాపు నాలుగు కిలోమీటర్ల లోపలికి వెళ్లి వీటిని తీసుకున్నారు. నీటిలో ఉప్పు, ఆక్సిజన్, నైట్రోజన్, పొటాషియం శాతాలను పరిశీలిస్తారు. బీచ్‌ మొత్తం భాగంలో ఎక్కడ నీటి నమూనాలు బాగుంటాయో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. నీటిలో సముద్రపు జంతువులు లేని, చర్మ వ్యాధులకు అవకాశం లేని, లోతు, పర్యాటకులు ఎంత లోపలికి వెళ్లొచ్చు, కెరటాల ఎత్తు తదితర అంశాలను గుర్తిస్తారు. ఆ సర్కిల్‌లో వాష్‌ రూమ్‌లు, కుర్చీలు, ఆట స్థలం, గార్డెనింగ్, పర్యాటకుల రక్షణ కోసం స్థానిక మత్స్యకారులతో సేఫ్‌ గార్డులను నియమిస్తారు.

ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి
బ్లూ ఫ్లాగ్‌ కోసం బీచ్‌లను ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి చేస్తున్నాం. సూర్యలంక బీచ్‌కు అన్ని అర్హతలు ఉండటంతో దీనిపై దృష్టి సారించాం. కేంద్ర ప్రభుత్వ సాయంతో మౌలిక వసతులు కల్పిస్తున్నాం.
– ఎస్‌.సత్యనారాయణ, ఎండీ, ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌

విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా..
విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా బీచ్‌లను అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటివరకు 21 బీచ్‌లు ఉండగా.. మరిన్ని బీచ్‌లను తయారు చేయనున్నాం. సూర్యలంకకు దేశంలోనే అరుదైన బీచ్‌గా గుర్తింపు ఉంది.
 – ఆరిమండ వరప్రసాద్‌రెడ్డి, చైర్మన్, ఏపీటీడీసీ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top