వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కన్నుమూత

Badvel MLA Doctor Venkata Subbaiah Passed Away In YSR Kadapa - Sakshi

సాక్షి, వైఎస్సార్‌కడప: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ వెంకట సుబ్బయ్య మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పోందుతూ ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఎమ్మెల్యే వెంకట సుబ్యయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెంకట సుబ్బయ్య మృతి పట్ల వైఎస్సార్‌సీపీ నేతలు, అభిమానులు సంతాపం తెలిపారు. ప్రజల సందర్శనార్థం వెంకట సుబ్బయ్య పార్థివదేహాన్ని బద్వేల్‌ మార్కెట్‌ యార్డ్‌లో ఉంచారు. ఆదివారం సాయంత్రం కడపలోని ఆయన నివాసానికి వెంకట సుబ్బయ్య పార్థివ దేహాన్ని తరలించనున్నారు. సోమవారం ఉదయం కడపలో ప్రభుత్వ లాంఛనాలతో వెంటక సుబ్బయ్య అంత్యక్రియలు జరపనున్నారు.

1960లో జన్మించిన వెంకట సుబ్బయ్య ఆర్థోపెడిక్ సర్జన్‌గా ప్రజలకు సేవలందించారు. 2016లో ఆయన బద్వేల్‌ వైఎస్సార్‌సీపీ కో-ఆర్డినేటర్‌గా పనిచేశారు. 2019లో తొలిసారిగా డాక్టర్ వెంకట సుబ్బయ్య  ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ ఓబులాపురం రాజశేఖర్‌పై 44 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

కడపకు సీఎం జగన్‌:
మధ్యాహ్నం 3గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడప వెళ్లనున్నారు. ఆదివారం మృతి చెందిన బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య కుటుంబాన్ని సీఎం జగన్‌ పరామర్శించనున్నారు. కడప ఎయిర్‌పోర్ట్‌ నుంచి నేరుగా ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య కుటుంబం వద్దకు వెళుతారు. పరామర్శ అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకోనున్నారు.

ప్రముఖుల సంతాపం:
వైద్యుడిగా, ఎమ్మెల్యేగా వెంకట సుబ్బయ్య సేవలు చిరస్మరణీయమని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో డాక్టర్‌ వెంకట సుబ్బయ్య కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మృతిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, కడప ఇంచార్జ్ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వెంకట సుబ్బయ్య మృతి వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీకి తీరనిలోటు అని తెలిపారు. వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వైఎస్సార్‌సీపీ వెంకట సుబ్బయ్య కుటుంబానికి అండగా ఉంటుందని మంత్రి చెప్పారు.

ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతి అత్యంత బాధాకరమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 2014లో వైఎస్సార్‌సీపీ ద్వారానే వెంకట సుబ్బయ్య రాజకీయ రంగప్రవేశం చేశారని గుర్తు చేసుకున్నారు. పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉండేవారు అని చెప్పారు. 2019 ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారని పేర్కొన్నారు. వెంకట సుబ్బయ్య ఆత్మకు శాంతి కలగేలా భగవంతున్ని ప్రార్థిస్తున్నాని ఆళ్ల నాని పేర్కొన్నారు. వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top