Avanthi Srinivas: అది తప్పుడు ఆడియో

Avanthi Srinivas Comments On Audio Tape issue - Sakshi

ఫిర్యాదు చేశాం.. కుట్రసంగతి తేలుతుంది

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు 

సాక్షి, విశాఖపట్నం: సోషల్‌ మీడియాలో గురువారం వైరల్‌ అయిన ఆడియో తనది కాదని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చెప్పారు. వ్యక్తిగతంగా, రాజకీయంగా తన ఎదుగుదలను చూసి ఓర్వలేక కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసు కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హాకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసుల ద్వారా విచారణ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇలా క్రియేట్‌ చేస్తున్నవారి నిగ్గుతేల్చాలని కోరినట్లు చెప్పారు. విశాఖలోని తన క్యాంప్‌ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సామాన్య కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. మంచితనంతో అంచెలంచెలుగా ఎమ్మెల్యే నుంచి మంత్రి స్థాయి వరకు ఎదిగానని చెప్పారు.

తన ఎదుగుదలను చూసి ఓర్వలేక ఎవరో కొందరు కుట్ర పన్నారని, దీనివెనుక ఎవరున్నారన్న విషయం పోలీసుల విచారణలో తేలుతుందని పేర్కొన్నారు. తాను ఎటువంటి అవినీతిఖి పాల్పడనన్నారు. తన రాజకీయ ఎదుగుదలను, వైఎస్సార్‌సీపీ సర్కార్‌ ప్రగతిని చూసి ఓర్వలేక జరిగిన కుట్రగా భావిస్తున్నట్లు తెలిపారు. తనకు శత్రువులు లేరని చెప్పారు. తాను మహిళతో మాట్లాడిన విషయం వాస్తవం కాదన్నారు. రోజురోజుకు రాజకీయాలు దిగజారుగుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. తనకు దేవుడిపై నమ్మకం ఉందని, ఇలాంటి కుట్రలు ఎవరు పన్నినా అవి ఫలించవని చెప్పారు. తన ప్రత్యర్థి కూడా బాగుండాలి అనుకుంటానన్నారు. తాను తప్పుడు పనులు చేయనని, ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతానని చెప్పారు.

రాజకీయంగా తనపై పోటీచేసిన ప్రత్యర్థులను కూడా మిత్రులుగానే చూసే వ్యక్తినన్నారు. జిల్లాలో ఏకైక మంత్రిగా తాను చేసే మంచిపనులు, పార్టీ అభివృద్ధి చూడలేకనే సోషల్‌ మీడియాలో ఫేక్‌ వీడియోతో ప్రచారం చేస్తున్నారని చెప్పారు. సోషల్‌ మీడియాలో మంచి కన్నా చెడు త్వరగా ప్రచారం జరుగుతుందన్నారు. ఇందులో ఎవరున్నా వదిలేది లేదని పేర్కొన్నారు. దేవుడి ఆశీస్సులు, ప్రజల అభిమానం ఉన్నంతవరకు ఎవరూ తన ఎదుగుదలను అడ్డుకోలేరన్నారు. ఇలాంటి వదంతులు నమ్మవద్దని నియోజకవర్గ ప్రజలను, రాష్ట్రంలో పార్టీ శ్రేణులను, అభిమానులను  కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. బవైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top