వేలంలో కొన్న అసైన్డ్‌ భూమి నిషేధిత జాబితాలోకి రాదు: ఏపీ హైకోర్టు

Assigned land purchased at auction does not come under prohibited list - Sakshi

సాక్షి, అమరావతి: బహిరంగ వేలంలో కొన్న అసైన్డ్‌ భూమిని నిషేధిత భూముల జాబితా (22ఏ)లో చేర్చడం చట్టవిరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. అసైన్డ్‌ భూమిని ఎవరైనా బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేసినప్పుడు దాన్ని అసైన్డ్‌ భూమిగా పరిగణించడానికి వీల్లేదంది. ఈ మేరకు చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కొట్రమంగళంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నిర్వహించిన బహిరంగ వేలంలో కొనుగోలు చేసిన 10 ఎకరాల భూమిని నిషేధిత భూముల జాబితాలో చేరుస్తూ రెవెన్యూ శాఖ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు చట్టవిరుద్ధంగా ప్రకటించింది. ఆ ఉత్తర్వులకు అనుగుణంగా సీసీఎల్‌ఏ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పు ఇచ్చారు.  

నిషేధిత భూముల జాబితాలో చేర్చడం సరికాదు.. 
బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేసిన అసైన్డ్‌ భూమిని నిషేధిత భూముల జాబితాలో చేరుస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ పి.గీత, ఇ.మోహన్‌ రామిరెడ్డి, ఎం.విజయభాస్కరరాజు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై న్యాయమూర్తి జస్టిస్‌ సత్యనారాయణమూర్తి విచారణ జరిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ‘పిటిషనర్లు వ్యవసాయ సహకార సంఘం నిర్వహించిన బహిరంగ వేలంలో భూములు కొన్నారు. రెవెన్యూ రికార్డుల్లో కూడా వారి పేర్లు నమోదయ్యాయి. పాసు పుస్తకాలు కూడా జారీ అయ్యాయి.

తుడా అధికారులు కూడా ఎన్‌వోసీ ఇచ్చారు. ఇన్ని జరిగినప్పటికీ ప్రభుత్వం పిటిషనర్ల భూములను నిషేధిత భూముల జాబితాలో చేర్చింది’ అని ఆక్షేపించారు. అంతేకాకుండా ‘భూమిని అసైన్డ్‌దారుకి కేటాయించినప్పుడు ఆ భూమికి ప్రభుత్వం యజమాని కాదు. ఆ భూమికి అన్ని రకాలుగా అసైన్డ్‌దారే యజమాని. భూమిని తాకట్టుపెట్టి అసైన్డ్‌దారు రుణం తీసుకోవచ్చు. తీసుకున్న రుణాన్ని అసైన్డ్‌దారు చెల్లించలేకపోతే ఆ భూమిని వేలం వేయొచ్చు. వేలంలో ఆ భూమిని ఎవరైనా కొనుగోలు చేస్తే అప్పటి నుంచి ఆ భూమిని అసైన్డ్‌ భూమిగా పరిగణించరాదు’ అని తీర్పులో పేర్కొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top