మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌గా సంచయిత నియామకం చెల్లదు

Ashok Gajapatiraju returns as Mansas Trust Chairman - Sakshi

సింహాచలం దేవస్థానం చైర్‌పర్సన్‌గా కూడా.. 

జీవోలను రద్దు చేసిన హైకోర్టు 

మాన్సాస్‌ ట్రస్టు చైర్మన్‌గా తిరిగి అశోక్‌ గజపతిరాజు  

సాక్షి, అమరావతి: మహారాజా అలక్‌ నారాయణ్‌ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ (మాన్సాస్‌) ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌గా సంచయిత గజపతిరాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు రద్దు చేసింది. ఆమె నియామకం చెల్లదని పేర్కొంది. అలాగే మాన్సాస్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా సంచయిత గజపతిరాజు, ఊర్మిళా గజపతిరాజు, ఆర్‌వీ సునీతా ప్రసాద్‌లను నియమిస్తూ జారీ చేసిన జీవోను సైతం రద్దు చేసింది. అంతేకాకుండా సింహాచలం దేవస్థానం చైర్‌పర్సన్‌గా సంచయిత నియామక జీవోను సైతం కొట్టేసింది. ఇదే సమయంలో మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌గా అశోక్‌ గజపతిరాజు నియామకం తిరిగి అమల్లోకి వస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రస్ట్‌ వ్యవస్థాపక కుటుంబ సభ్యుడిగా/చైర్మన్‌గా 2016లో అశోక్‌ గజపతిరాజు నియామకం సక్రమంగానే జరిగిందని తెలిపింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ మఠం వెంకటరమణ సోమవారం తీర్పు వెలువరించారు. మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌గా సంచయితను నియమిస్తూ ప్రభుత్వం గతేడాది జీవో 74ను జారీ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ట్రస్టు వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా సంచయిత, ఊర్మిళ, ఆర్‌వీ సునీతా ప్రసాద్‌లను నియమిస్తూ మరో జీవో ఇచ్చింది. అదేవిధంగా సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వంశపారంపర్య చైర్‌పర్సన్‌గా సంచైతను నియమిస్తూ మరో జీవోనూ జారీ చేసిన విషయం విదితమే. ఈ మూడు జీవోలను సవాల్‌ చేస్తూ టీడీపీ సీనియర్‌ నేత, మాన్సాస్‌ ట్రస్ట్‌ మాజీ చైర్మన్‌ అశోక్‌ గజపతిరాజు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్‌ వెంకటరమణ సోమవారం తీర్పు వెలువరించారు. తీర్పు కాపీ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో హైకోర్టు జీవోలను కొట్టేయడానికి గల కారణాలు తెలియరాలేదు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top