16వ శతాబ్దపు శిల్పాలను పరిరక్షించుకోవాలి

Archaeologist Sivanagireddy Says 16th Century Temple Idols Were Discovered Palnadu - Sakshi

పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం, నాగిరెడ్డిపాలెం– మన్నె సుల్తాన్‌పాలెం మధ్య పొలాల్లో క్రీస్తు శకం 16వ శతాబ్దానికి చెందిన విజయనగర రాజుల కాలానికి చెందిన వీరభద్రాలయం శిథిలమై, అందులో నిలువెత్తు శిల్పాలు దెబ్బతిన్నాయని, వాటిని పరిరక్షించి భవిష్యత్‌ తరాలకు అందించాలని పురావస్తు పరిశోధకుడు, ది కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ విజయవాడ అండ్‌ అమరావతి (సీసీవీఏ) సీఈఓ డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి కోరారు.

చారిత్రక సంపదను కాపాడి భవిష్యత్‌ తరాలకు అందించేందుకు సీసీవీఏ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక పరిశోధనా కార్యక్రమంలో భాగంగా ఆదివారం బెల్లంకొండ మండలం పరిసర ప్రాంతాల్లో పర్యటించానని శివనాగిరెడ్డి ప్రకటనలో తెలిపారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన వీరభద్రుడు, భద్రకాళి శిల్పాలు జీర్ణావస్థలో ఉన్నాయని వివరించారు.

నాగిరెడ్డిపాలెం శివారు ప్రాంతంలో ఉన్న క్రీస్తు 16వ శతాబ్దానికి చెందిన శిథిలమైన శివాలయాన్ని కూడా పునర్నిర్మాణం చేసి భావితరాలకు వాటి గొప్పతనాన్ని చాటాలని ఆయన కోరారు. అక్కడ ఉన్న చారిత్రక సంపద గురించి సమీపంలోని గ్రామస్థులకు అవగాహన కల్పించామని పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top