
కడప కోటిరెడ్డి సర్కిల్: ఆర్టీసీ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి తెలిపారు. పెట్రోల్ బంకుల ఏర్పాటు ద్వారా.. ఆర్టీసీకి మేలు జరుగుతుందన్నారు. సోమవారం కడపలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాంతీయ ఆస్పత్రి, ఆర్‌ఎం కార్యాలయం, ఆర్టీసీ బస్టాండు, గ్యారేజీ, ఆర్టీసీ వర్క్‌షాప్‌లను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ ద్వారా 20 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 11 బంకులకు ఎన్‌ఓసీ మంజూరైందని తెలిపారు.
అలాగే ప్రతి జిల్లాలో ఆర్టీసీకి విలువైన స్థలాలున్నాయని, వాటిని ఉపయోగంలోకి తీసుకువస్తామని చెప్పారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ఆర్టీసీ ప్రాంతీయ ఆస్పత్రులు సేవలందిస్తున్నాయని పేర్కొన్నారు. కడపలోని కార్మికులకు కూడా మెరుగైన వైద్య సేవలందించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఆస్పత్రిని సీఎం వైఎస్ జగన్ ఏర్పాటు చేశారన్నారు. కడప ఆర్టీసీ బస్టాండ్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆర్టీసీ కార్గో సేవలను తక్కువ ధరకు అందిస్తున్నామని, ప్రతి జిల్లా కేంద్రంలో డోర్ డెలివరీ సౌకర్యాన్ని ప్రవేశ పెట్టామని చెప్పారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవివర్మ, కడప రీజియన్ రీజనల్ మేనేజర్ జితేంద్రనాథ్‌రెడ్డి, చైర్మన్ ఓఎస్‌డీ గోపి, సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్.శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.