Group-1 Prelims: ఏపీ వ్యాప్తంగా ఇవాళ గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌

APPSC Conducting Group-1 Prelims Exam Today In Andhra Pradesh - Sakshi

18 జిల్లాల్లోని 297 పరీక్ష కేంద్రాల్లో నిర్వహణ

హాజరు కానున్న 1,26,449 మంది అభ్యర్థులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి నేడు (ఆదివారం) ప్రిలిమినరీ పరీక్ష (స్క్రీనింగ్‌ టెస్ట్‌) జరగనుంది. పరీక్ష కోసం ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లోని 297 కేంద్రాల్లో పరీక్ష నిర్వ­హించనున్నారు. మొత్తం 1,26,449 మంది అభ్య­­ర్థులు పరీక్షకు హాజరు కానున్నారు.

ఉద­యం 10 గంటల నుంచి 12 వరకు పేపర్‌–1, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పేపర్‌–2 నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌లో 120 చొప్పున ప్రశ్నలుంటాయి. అభ్యర్థులు హాల్‌ టిక్కెట్లతోపాటు నిర్దేశిత గుర్తింపు కార్డును పరీక్ష కేంద్రాల వద్ద చూపించాలి. ఉదయం 9 గంటల నుంచి 9.30 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఆ తర్వాత 15 నిమిషాల గ్రేస్‌ పీరియడ్‌ కింద 9.45 గంటల వరకు అనుమతి ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 1 గంట నుంచి 1.30 వరకు పరీక్ష హాల్లోకి వెళ్లాలి. 15 నిమిషాల గ్రేస్‌ పీరియడ్‌ కింద 1.45 గంటల వరకు అనుమతిస్తారు.

ఆ తర్వాత ఎవరినీ అనుమతించరు. అభ్యర్థి దరఖాస్తులో బయోడేటా వివరాలను తప్పుగా పేర్కొని ఉంటే ఇన్విజిలేటర్‌ వద్ద అందుబాటులో ఉన్న నామినల్‌ డేటాను అప్‌డేట్‌ చేసుకోవాలి. అభ్యర్థికి ఇచ్చే ఓఎమ్మార్‌ సమాధాన పత్రం ఒరిజినల్, డూప్లికేట్‌ కాపీలుగా ఉంటుంది. పరీక్ష పూర్తయ్యాక అభ్యర్థి ఒరిజినల్‌ కాపీని ఇన్విజిలేటర్‌కు ఇచ్చి డూప్లికేట్‌ కాపీని తన వద్ద ఉంచుకోవాలి. ప్రాథమిక ‘కీ’ ఆదివారం రాత్రి లేదా సోమవారం విడుదల చేస్తారు. పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించడమే తమ లక్ష్యమని ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top