సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదని.. తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు తేల్చిచెప్పారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను మరోమారు గుర్తుచేసిన ఏపీజేఏసీ అమరావతి ఉద్యమ సదస్సు.. ఎన్నికల సమయంలోనూ, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఇచ్చిన హామీల వీడియోను ప్రదర్శించారు.
ప్రభుత్వం బెదిరింపులకు ఏపీ జేఏసీ అమరావతి భయపడదు. మా డబ్బును కూడా ప్రభుత్వం వాడుకుంది. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ఇస్తున్నారు.. ఇక్కడ ఎందుకు ఇవ్వరు. ఇతర రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్‌లు ఇస్తున్నారు. మా ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఎన్నికలప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలనే మేం అడుగుతున్నాం. మాకు రావాల్సిన హక్కులనే మేం ప్రశ్నిస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐఆర్ ఇవ్వలేదు. ఇలా జరగడం చరిత్రలో తొలిసారి’’ అంటూ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘స్మార్ట్ హెల్త్ కార్డులు ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది. అసలు హెల్త్ కార్డులు ఎలా ఉంటాయో కూడా మాకు తెలియదు. కళ్లద్దాలకు కూడా బిల్లులు పెట్టి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఐఏఎస్‌లు తీసుకుంటున్నారు. కానీ ఉద్యోగులకు మాత్రం ఎలాంటి సదుపాయం లేదు. 60 రోజుల్లో ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ సమస్య పరిష్కారం కావాలని గత ఏడాది చంద్రబాబు జీవో ఇచ్చారు. ఈ రోజుకీ జీవో అమలు కాలేదు’’ అంటూ బొప్పరాజు మండిపడ్డారు.
ఇదీ చదవండి: జిమ్ ట్రైనర్ సతీష్‌రెడ్డి కేసులో కొత్త ట్విస్ట్


