ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా ఏపీ | AP as a world tourist destination | Sakshi
Sakshi News home page

ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా ఏపీ

Jun 28 2025 4:27 AM | Updated on Jun 28 2025 4:27 AM

AP as a world tourist destination

టూరిజం గేమ్‌ ఛేంజర్‌ కాబట్టే పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా ఇచ్చాం

పెట్టుబడుల ద్వారా సంపద సృష్టిస్తాం.. ఆ ఆదాయంతో సంక్షేమం చేస్తాం

జీఎఫ్‌ఎస్టీ టూరిజం కాంక్లేవ్‌లో సీఎం చంద్రబాబు 

రాష్ట్రంలో పతంజలి వెల్‌నెస్‌ సెంటర్లు, వెడ్డింగ్‌ డెస్టినేషన్లు: బాబా రామ్‌దేవ్‌

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు/ ప్రత్తిపాడు/యడ్లపాడు: ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు అన్నారు. టూరిజం గేమ్‌ ఛేంజర్‌ కాబట్టే పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా కల్పించామన్నారు. విజయవాడలో శుక్రవారం జరిగిన ‘గ్లోబల్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌ (జీఎఫ్‌ఎస్టీ) టూరిజం కాంక్లేవ్‌ ఏఐ 2.0’కు సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘భవిష్యత్తు అంతా పర్యాటక రంగానిదే. ఈ రంగంలో భారీ ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. వెల్‌నెస్, హ్యాపీనెస్‌ ఫ్యూచర్‌ డెస్టినేషన్‌గా ఏపీని తీర్చిదిద్దుతాం’ అని చెప్పారు. 

పెట్టుబడుల ద్వారా సంపద సృష్టిస్తేనే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని ఆ తర్వాతే సంక్షేమం, అభివృద్ధి చేయగలమని చెప్పారు. వన్‌ ఫ్యామిలీ వన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ అనే నినాదం ఇస్తున్నామన్నారు. యోగాతో ప్రజల్ని ప్రభావితం చేసినట్లే ఏపీ పర్యాటకాన్ని కూడా బ్రాండింగ్‌ చేయాలని ప్రముఖ యోగా గురు బాబా రామ్‌దేవ్‌ను కోరారు. పర్యాటకం, వెల్‌నెస్‌ కేంద్రాలకు సలహాదారుగా సేవలు అందించాలని ఆయన్ను కోరారు. జీఎఫ్‌ఎస్టీ టూరిజం కాంక్లేవ్‌లో భాగంగా 82 ప్రాజెక్టులకు సంబంధించి రూ.10,329 కోట్ల పెట్టుబడులను వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. 

అంతకుముందు.. టూరిజం క్యారవాన్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు. పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ మాట్లాడుతూ.. 2047 నాటికి రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే టీడీపీ కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. త్వరలో ఎకో టూరిజం పాలసీ తెస్తున్నట్లు చెప్పారు. బాబా రామ్‌దేవ్‌ మాట్లాడుతూ.. దిండి లాంటి ప్రాంతాల్లో వెడ్డింగ్‌ క్రూయిజ్‌ లేదా బోట్‌ లాంటి ప్రాజెక్టు చేపడతామని చెప్పారు. ఏపీలో పతంజలి సంస్థ వెల్‌నెస్‌ సెంటర్లు ఏర్పాటుచేయాలని భావిస్తోందని.. అలాగే, హార్సిలీ హిల్స్‌ను ప్రపంచ ఐకానిక్‌ వెల్‌నెస్‌ సెంటర్‌గా మారుస్తామన్నారు. 

హార్డ్‌ వర్క్‌ కాదు స్మార్ట్‌ వర్క్‌..
ఇక సాయంత్రం గుంటూరు రూరల్‌ మండలం చౌడవరంలోని ఆర్‌వీఆర్‌జేసీ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏపీ పోలీస్‌ శాఖ ఏఐ 4 ఏపీ పోలీస్‌ హ్యాకథాన్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు కళాశాలలోని ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ప్రారంభించి మాట్లాడారు. రాబోయే రోజుల్లో చేయాల్సింది హార్డ్‌వర్క్‌ కాదని, స్మార్ట్‌ వర్క్‌ అని, పిల్లలు అది నేర్చుకోగలిగితే ప్రపంచాన్నే జయించవచ్చన్నారు. 

టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలన్న దానిపై ఏపీ పోలీసులు దేశంలో ఎక్కడాలేని విధంగా ఓ అడుగు ముందుకేశారన్నారు. ఇక ర్యాపిడో వ్యవస్థాపకుడు ఈ జిల్లా వ్యక్తేనని, అతని తండ్రి నిజామాబాద్‌కు వలస వెళ్లారని.. అతను టీడీపీ కార్యకర్తగా ఉండేవారన్నారు. తాను చెప్పిన విషయాలన్నీ వినేవాడని, కొడుకు ఐఐటీ చేశాడని, ఆ తరువాత వెరీ సింపుల్‌ సొల్యూషన్‌ మీరు చూశారని చంద్రబాబు చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement