డిజిటల్‌ హెల్త్‌లో ఏపీ టాప్‌ 

AP Top in Digital Health - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ రూ.వేల కోట్లు వెచ్చించి వైద్య, ఆరోగ్య రంగాన్ని తీర్చిదిద్దుతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని నేషనల్‌ హెల్త్‌ అథారిటీ సీఈవో డాక్టర్‌ ఆర్‌.ఎస్‌.శర్మ సూచించారు. ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ (ఏబీడీఎం) కార్యక్రమాల అమలులో ఏపీ ప్రథమ స్థానంలో నిలవటాన్ని అభినందిస్తూ ప్రభుత్వానికి ఆయన లేఖ రాశారు. పౌరుల ఆరోగ్య వివరాలకు సంబంధించి ఆస్పత్రుల్లో ఓపీ, ఐపీ, వైద్య పరీక్షలు, చికిత్స లాంటి సమస్త వివరాలను కాగితాలతో పనిలేకుండా కేవలం ఒక్క క్లిక్‌ ద్వారా తెలుసుకునేలా ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.   

14 అంకెలతో డిజిటల్‌ ఐడీ 
దేశంలో ఎక్కడికి వెళ్లినా కాగితాలతో పనిలేకుండా పౌరులకు వైద్య సేవలు అందించడం ఏబీడీఎం ముఖ్య ఉద్దేశం. ప్రతి పౌరుడికీ 14 అంకెల డిజిటల్‌ ఆరోగ్య ఐడీ నంబర్‌ కేటాయించి కాగితాల అవసరం లేకుండా ఈ–హాస్పిటల్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ 2.75 కోట్ల మంది ప్రజలకు రాష్ట్రంలో డిజిటల్‌ ఐడీలు జారీ అయ్యాయి. వీరిలో 28,314 మంది ఐడీలకు హెల్త్‌ రికార్డులను అప్‌లోడ్‌ చేశారు. వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌ నుంచి బోధనాసుపత్రుల వరకూ 13,373 ఆసుపత్రులను రిజిస్టర్‌ చేశారు. 7,023 మంది ప్రభుత్వ వైద్యులు రిజిస్టర్‌ అయ్యారు. పౌరులకు డిజిటల్‌ ఐడీల జారీ, వైద్యుల రిజిస్ట్రేషన్‌ విభాగాల్లో దేశంలోనే ఏపీ తొలి స్థానంలో నిలవడం గమనార్హం.  

పైలట్‌ ప్రాజెక్టుకు రాష్ట్రం ఎంపిక 
ఏబీడీఎం కార్యక్రమాల్లో రాష్ట్రం ముందు వరుసలో నిలవడంతో నర్సింగ్, పారామెడికల్‌ సిబ్బంది రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు సంబంధించి పైలెట్‌ ప్రాజెక్టు అమలుకు ఏపీని కేంద్రం ఎంపిక చేసింది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ఏబీడీఎంలో నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది రిజిస్ట్రేషన్‌ ప్రారంభం కానుంది. 

కేంద్రం కంటే ముందే 
గతేడాది సెప్టెంబర్‌లో ఏబీడీఎం కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించగా అంతకంటే ముందే డిజిటల్‌ హెల్త్‌ రికార్డ్స్‌ సేవలను సీఎం జగన్‌ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులందరికీ క్యూఆర్‌ కోడ్‌తో కూడిన గుర్తింపు కార్డులను జారీ చేసింది. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌తో తెలుసుకునేలా ఆరోగ్య రికార్డులను అనుసంధానించింది. 

త్వరలో సీహెచ్‌సీల్లో ప్రారంభం
ఏబీడీఎం కార్యకలాపాల్లో వేగంగా ముందుకు వెళ్తున్నాం. నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది రిజిస్ట్రేషన్‌ కూడా చేపడతాం. ఇప్పటికే పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ, బోధనాస్పత్రుల్లో ఈ–హాస్పిటల్‌ విధానాన్ని అమలు చేస్తున్నాం. త్వరలో సీహెచ్‌సీల్లో ప్రారంభించాలని నిర్ణయించాం. ఈ నెల 23 నుంచి ఎంపిక చేసిన సీహెచ్‌సీలో పైలట్‌గా సేవలు ప్రారంభిస్తాం. అనంతరం అన్ని సీహెచ్‌సీల్లో ఈ–హాస్పిటల్‌ విధానం అమలు చేస్తాం. ఆరోగ్య శ్రీ, ఎన్‌సీడీ స్క్రీనింగ్‌  ద్వారా నిక్షిప్తం చేసిన ప్రజల ఆరోగ్య రికార్డులను ఏబీడీఎంకు అనుసంధానిస్తాం. 
– నవీన్‌కుమార్, ప్రత్యేక కార్యదర్శి, వైద్య, ఆరోగ్య శాఖ   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top