ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రాబోయే 3 గంటల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. చిత్తూరు, పుత్తూరు, సత్యవేడు, శ్రీసిటీ, తడ పరిసర ప్రాంతాలలో పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షం పడుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది.
గుంటూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాలల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.


