ప్రజాస్వామ్యంపై పాశవిక దాడి | Ys Jagan fires on irregularities in Andhra Pradesh local elections | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యంపై పాశవిక దాడి

Nov 30 2026 4:45 AM | Updated on Nov 30 2026 4:47 AM

Ys Jagan fires on irregularities in Andhra Pradesh local elections

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో అంతులేని అక్రమాల పర్వం

వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు, ఏజెంట్లే లక్ష్యంగా దాడులు 

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా  ప్రజాస్వామ్యంపై యథేచ్ఛగా దాడి 

వేంపల్లెలో పోలింగ్‌ కేంద్రానికి తాళం వేసి మరీ రిగ్గింగ్‌ 

గడ్డంవారిపల్లెలో సీసీ కెమెరాలు ధ్వంసం 

కోయిలకుంట్ల, అన్నవరంలో పోలింగ్‌ కేంద్రాలు స్వా«దీనం 

ఉల్లగల్లులో పోలింగ్‌ కేంద్రం నుంచి బ్యాలెట్‌ పత్రాలు బయటకు.. 

ఈ దౌర్జన్యాలకు పాల్పడిన వారికి అండగా పోలీసులు 

శింగనమల నియోజకవర్గం ఉల్లికల్లులో దొంగ ఓట్లను ప్రశి్నంచిన వైఎస్సార్‌సీపీ నాయకులపై కర్రలతో దాడి 

చింతలపూడిలో ఓటు వేయకుండా దళితులను అడ్డుకున్నారు

నాగంబోట్లపాలెంలో బ్యాలెట్‌ పెట్టెలో ఇంకు పోశారు 

గాందీపురంలో గుర్తింపు కార్డులు చూపాలని చెవిరెడ్డి నిలదీయడంతో దొంగ ఓటర్లు పారిపోయారు 

ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, ఎస్వీ సతీష్రెడ్డి, సాకే 

శైలజానాథ్, కాటసాని రామిరెడ్డి, ఓబుల్‌రెడ్డి గృహ నిర్బంధం 

దొంగ ఓట్లను ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ అరెస్టు   

సంతకవిటిలో జర్నలిస్టులపై దాడి..  

అధికార దుర్వీనియోగం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇవే నిదర్శనాలు  

‘ఎక్స్‌’ వేదికగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ధ్వజం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజాస్వామ్యంపై పాశవిక దాడి కొనసాగుతోందని, రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో అంతులేని అక్రమాలే ఇందుకు నిదర్శనమని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో చోటుచేసుకొన్న అక్రమాలపై సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా ఆయన ఆదివారం మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ నాయకులను నిర్బంధించిన పోలీసులు.. రిగ్గింగ్‌ను ప్రశి్నంచిన వారిపై బలప్రయోగం చేస్తూ, టీడీపీ మూకలకు మాత్రం పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని..  ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. ఈ తీవ్రమైన అక్రమాలు, దౌర్జన్యాలకు చంద్రబాబునాయుడు సమాధానం చెప్పాలంటూ ‘ఎక్స్‌’ వేదికగా వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 

రాష్ట్రవ్యాప్తంగా అత్యంత దిగ్భ్రాంతికర ఘటనలు.. 
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్యంపై యథేచ్ఛగా దాడి జరిగింది. టీడీపీ నాయకులు తమ రిగ్గింగ్, బెదిరింపులతో పాటు, హింసాకాండను మరింత తీవ్రతరం చేయగా, పోలీసులు బహిరంగంగానే వారికి అండగా నిలుస్తూ, వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను లక్ష్యంగా చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక దారుణ ఘటనలు చోటుచేసుకున్నాయి. వాటిలో అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘటనలు ఇవి కొన్ని.. 

వేంపల్లెలో పోలింగ్‌ ఏజెంట్లపై దాడులు.. 
టీడీపీ మూకలు కర్రలు, రాళ్లు, ఇనుప రాడ్లతో పోలింగ్‌ కేంద్రాలను చుట్టుముట్టి, వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై దాడులకు పాల్పడి, వారిని గాయపరిచారు. మా పార్టీ ఏజెంట్లను బయటకు తరిమేసి, ఒక పోలింగ్‌ కేంద్రానికి తాళం వేసి మరీ రిగ్గింగ్‌ కొనసాగించారు. బాలుర ఉన్నత పాఠశాల, శ్రీరాంనగర్, చింతలమడుగుపల్లిలో ఓటర్లను బెదిరించారు. స్థానిక ఓటర్లను పోలీసులు వెనక్కి పంపుతూ, ఈ అక్రమాలన్నింటికీ అండగా నిలిచారు. 

వైఎస్సార్‌ కడప జిల్లాలో దౌర్జన్యాలకు అండగా పోలీసులు 
వీరపునాయునిపల్లె, బూసిరెడ్డిపల్లె, అలిదెన, పాయసంపల్లె, కుమ్మరపల్లెలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై దాడులుచేసి వారిని పోలింగ్‌ కేంద్రాల నుంచి బయటకు పంపించేశారు. గడ్డంవారిపల్లెలో సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. కోయిలకుంట్ల, అన్నవరంలో పోలింగ్‌ కేంద్రాలను స్వా«దీనం చేసుకున్నారు. ఉల్లగల్లులో పోలింగ్‌ కేంద్రం నుంచి బ్యాలెట్‌ పత్రాలను బయటకు తీసుకెళ్లారు. ఈ దౌర్జన్యాలకు పాల్పడిన వారికి పోలీసులు అండగా నిలిచారు. 

రాష్ట్రవ్యాప్తంగా అధికార దుర్వీనియోగం
శింగనమల నియోజకవర్గం ఉల్లికల్లులో దొంగ ఓట్లను ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నాయకులపై కర్రలతో దాడి చేశారు. గుంతకల్లులో జరిగిన దాడిలో వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థితో పాటు పార్టీ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. దర్శి, అద్దంకిలో ఏజెంట్లను అడ్డుకుని అరెస్టుచేశారు. అద్దంకి నియోజకవర్గం బల్లికురవ మండలం ముక్తేశ్వరంలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలీసులు అడ్డుకుని, అరెస్టుచేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చింతలపూడిలో దళితులను ఓటు వేయకుండా అడ్డుకున్నారు. నాగంబోట్లపాలెంలో బ్యాలెట్‌ పెట్టెలో ఇంకు పోశారు. గాం«దీపురంలో గుర్తింపు కార్డులు చూపాలని చెవిరెడ్డి నిలదీయడంతో దొంగ ఓటర్లు పారిపోయారు. సంతకవిటిలో జర్నలిస్టులపై దాడి చేశారు. అధికార దుర్వీనియోగం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇవే నిదర్శనాలు. 

నాయకులు, ఏజెంట్లు లక్ష్యంగా.. 
ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, ఎస్వీ సతీష్రెడ్డి, సాకే శైలజానాథ్, కాటసాని రామిరెడ్డి, ఓబుల్‌రెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచడం లేదా అడ్డుకోవడం జరిగింది. దొంగ ఓట్లను ప్రశి్నంచిన మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌ను అరెస్టుచేశారు. ఓటు వేయడానికి వెళ్తున్న నరేన్‌రెడ్డిని అడ్డుకున్నారు. అర్థంలేని ఆంక్షలకు నిరసనగా రవీంద్రనాథ్‌రెడ్డి ఆందోళనకు దిగారు. ప్రజాస్వామ్యం ఎంతటి దుస్థితికి చేరిందో చూడండి.

ఓటర్లు, జర్నలిస్టులపైనా దాడులు.. 
జర్రావారిపల్లెలో నిరసన తెలుపుతున్న మహిళలు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. చంద్రగిరిలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులపై లాఠీఛార్జి చేసిన పోలీసులు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు భానుకుమార్‌ను అరెస్టుచేశారు. వేంపల్లె, పామర్రులో జర్నలిస్టుల ఫోన్లను లాక్కుని, వారు చిత్రీకరించిన దృశ్యాలను తొలగించారు. పెట్నికోటలో విలేకరులపై దాడిచేశారు. కొండగూడెంలో సాక్షి టీవీకి చెందిన సతీష్, హెచ్‌ఎంటీవీకి చెందిన శ్రీధర్‌ గాయపడ్డారు. సాక్షి జర్నలిస్టు అశోక్‌ను తోసేసి, వార్తా సేకరణను అడ్డుకున్నారు. 

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లను బెదిరించి వెనక్కి పంపడం, ఏజెంట్లపై దాడులుచేసి పోలింగ్‌ కేంద్రాల నుంచి తరిమేయడం, పోలింగ్‌ కేంద్రాలను స్వా«దీనం చేసుకోవడం, బ్యాలెట్‌ పత్రాలతో అక్రమాలకు పాల్పడటం, జర్నలిస్టులను అడ్డుకోవడం చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులను నిర్బంధించిన పోలీసులు, రిగ్గింగ్‌ను ప్రశ్నించిన వారిపై బలప్రయోగం చేస్తూ, టీడీపీ మూకలకు మాత్రం పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. ఈ తీవ్రమైన అక్రమాలు, దౌర్జన్యాలకు చంద్రబాబునాయుడు సమాధానం చెప్పాలి. హింసాకాండతో, పోలీసుల దౌర్జన్యాలతో ప్రజల తీర్పును తమకు అనుకూలంగా సృష్టించుకోలేరు. రిగ్గింగ్‌తో సాగిన ఈ ఎన్నికల ప్రక్రియను ప్రజలు కచ్చితంగా తిరస్కరిస్తారు. అతిత్వరలోనే చంద్రబాబు ప్రజాగ్రహాన్ని చవిచూడక తప్పదు.. అంటూ ‘సీబీఎన్‌ జంగిల్‌రాజ్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో వైఎస్‌ జగన్‌ పోస్టుచేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement