కొత్త సచివాలయ భవనాల నిర్మాణానికి సీఆర్‌డీఏ పిలిచిన టెండర్ డాక్యుమెంట్ ప్రకారం ఐదు భవనాల నిర్మిత ప్రాంతం 4.85 లక్షల చదరపు మీటర్లే (52,20,496 చదరపు అడుగులు)
కొత్త సచివాలయ భవనాల నిర్మాణ వ్యయం ఒక చదరపు అడుగుకు రూ.29,340
టెండర్ డాక్యుమెంట్ ప్రకారం ఐదు భవనాల నిర్మీత ప్రాంతం 52.20 లక్షల చదరపు అడుగులే
ఈ అవినీతిని మాజీ సీఎం వైఎస్ జగన్ సాక్ష్యాధారాలతో బయటపెట్టడంతో చంద్రబాబు సర్కార్‌లో కలవరం
నిర్మీత ప్రాంతం 71.43 లక్షల చదరపు అడుగులంటూ సర్కార్ అబద్ధాలు
దీని ప్రకారం చదరపు అడుగుకు రూ.17,339 అంటూ సమర్థన
అక్రమాలను కప్పిపుచ్చేందుకు సర్కార్ పచ్చి అబద్ధాలు చెబుతోందంటున్న ఇంజనీరింగ్ నిపుణులు, మేధావులు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో కొత్త సచివాలయ భవనాల నిర్మాణంలో సాగుతున్న అక్రమాలు.. అవినీతిని సాక్ష్యాధారాలతో బట్టబయలు చేస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సామాజిక మాద్యమం ‘ఎక్స్’లో శనివారం చేసిన పోస్టు సంచలనం రేపింది. చదరపు అడుగుకు రూ.30 వేలా..? ఏంటీ... బాబూ బంగారంతో కడుతున్నావా..? అంటూ సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ సూటిగా సంధించిన ప్రశ్నకు ఇంజనీరింగ్ నిపుణులు, మేధావులు నుంచి సాధారణ ప్రజల దాకా విశేష స్పందన లభిస్తుండటం... ప్రపంచం, దేశవ్యాప్తంగా డయాగ్రిడ్ విధానంలో నిర్మీంచిన భవనాల నిర్మాణంతో కొత్త సచివాలయ భవనాల నిర్మాణాన్ని పోల్చుతూ అవినీతిని కడిగిపారేస్తుండటం చంద్రబాబు సర్కార్‌లో కలకలం రేపింది.
అవినీతిని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు సర్కార్ తప్పుడు లెక్కలతో బుకాయిస్తూ, అంతా సవ్యంగా సాగుతున్నట్లు దబాయిస్తోండటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సచివాలయ భవనాల నిర్మీత ప్రాంతం 71.43 లక్షల చదరపు అడుగులని.. ఈ లెక్కన చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.17,339 లేనంటూ సర్కార్ వెల్లడించింది. కానీ 2025 ఏప్రిల్ 16న కొత్త సచివాలయ భవనాలకు మూడు ప్యాకేజీల కింద పిలిచిన టెండర్ డాక్యుమెంట్లను పరిశీలిస్తే.. ఐదు భవనాల పూర్తి నిర్మీత ప్రాంతం 4.85 లక్షల చదరపు మీటర్లే (52,20,496 చదరపు అడుగులే).
ఇప్పటికి ఆ ఐదు భవనాల నిర్మాణ వ్యయం రూ.15,316.94 కోట్లు. ఈ లెక్కన చదరపు అడుగు వ్యయం రూ.29,340. కొత్త సచివాలయ భవనాల నిర్మాణానికి సీఆర్‌డీఏ నిర్వహించిన టెండర్ డాక్యుమెంట్లనూ.. వాటికి సంబంధించి సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులను సమగ్రంగా అధ్యయనం చేసిన ఇంజనీరింగ్ నిపుణులు, మేధావులు ‘ఎక్స్’ వేదికగా వైఎస్ జగన్ చేసిన పోస్ట్‌కు మద్దతు పలుకుతూ.. చంద్రబాబు సర్కార్ చెబుతున్న అబద్ధాలను, అవినీతిని ఎండగడుతూ భారీ ఎత్తున స్పందిస్తున్నారు. కొత్త సచివాలయ భవనాల కోసం మూడు ప్యాకేజీల కింద 2018లో టెండర్లు నిర్వహించినప్పుడు ఎల్ అండ్ టీ, షాపూర్‌జీ పల్లోంజీ, ఎన్‌సీసీ సంస్థలకు ఒక్కో ప్యాకేజీ చొప్పున కట్టబెట్టారు.
2024లో వాటిని రద్దు చేసి.. 2025లో వాటికి మళ్లీ టెండర్లు నిర్వహించినప్పుడు 2018లో ఆ మూడు సంస్థలు ఏ ప్యాకేజీ దక్కించుకున్నాయో.. ఇప్పుడూ అదే ప్యాకేజీ పనులు సొంతం చేసుకున్నాయి. ఇక అదే భవనాలకు ఎంఈపీ (మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్) పనుల కోసం 2026లో మూడు ప్యాకేజీల కింద టెండర్లు నిర్వహిస్తే.. మళ్లీ ఆ పనులను ఆ మూడు సంస్థలే దక్కించుకోవడం గమనార్హం. ఆ పనులకు ఎప్పుడు టెండర్లు నిర్వహించినా.. ఆ మూడు సంస్థలే పనులు దక్కించుకోవడంలో ఆంతర్యమేమిటని ప్రశి్నస్తున్నారు.
దీన్ని బట్టి చూస్తే... ఆ మూడు సంస్థలకే పనులు దక్కేలా టెండర్‌లో నిబంధనలు పెట్టి.. వాటికి కట్టబెడుతున్నారన్నది స్పష్టమవుతోందని.. అంచనా వ్యయాన్ని ఎప్పటికప్పుడు పెంచేస్తూ నీకింత నాకింత..! అంటూ ఆ సంస్థలతో కలిసి ముఖ్యనేత పంచుకుతింటున్నారని ఇంజనీరింగ్ నిపుణులు, మేధావువులు ఆరోపిస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి మెట్రో నగరాల్లో ఫైవ్ స్టార్ సదుపాయాలతో కూడా చదరపు అడుగుకు రూ.5 వేలకు మించి లేదంటూ స్పష్టం చేస్తున్నారు. అమరావతిలో కొత్త సచివాలయ భవనాలకు ఈ ప్రత్యేక ధర ఏమిటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి
నిర్మాణాలా? లేక అంతర్జాతీయ స్థాయి అవినీతా?
అంటూ సీఎం చంద్రబాబును నిలదీస్తున్నారు. ‘‘రాజధాని నిర్మాణం పేరుతో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ లాంటి అంతర్జాతీయ.. హడ్కో, నాబార్డు లాంటి జాతీయ బ్యాంకుల నుంచి అధిక వడ్డీలకు రుణం తెచి్చ.. ప్రజల నెత్తిన అప్పులుం.. మీవాళ్లకు భారీ కాంట్రాక్టులు.. మీకేమో ముడుపులు.. ఇదీ అమరావతిలో జరుగుతున్న మాయ’’ అంటూ మండిపడుతున్నారు.
కొత్త సచివాలయ 5 భవనాల నిర్మాణం
⇒ 2,271 కోట్లతో మొదలై.. ఇప్పటికి రూ.15,316 కోట్లకు!
⇒ 2018 మే 1: ఐదు టవర్ల నిర్మాణ పనులు ఎల్ అండ్ టీ, షాపూర్‌జీ పల్లోంజీ, ఎన్‌సీసీ సంస్థలకు రూ.2,271.24 కోట్లకు అప్పగింత.
⇒ 2024: పాత టెండర్ల రద్దు.
⇒ 2025 ఏప్రిల్ 16: ప్రధాన నిర్మాణ పనుల అంచనా వ్యయం రూ.4,688.83 కోట్లకు పెంపు.
⇒ తాజాగా: ప్రధాన నిర్మాణ పనుల అంచనా రూ.6,641.21 కోట్లకు పెంపు.
⇒ విద్యుత్, హెచ్‌వీఏసీ, అగి్నమాపక, లిఫ్టులు, ప్లంబింగ్ పనులకు రూ.2,316.88 కోట్లు.
⇒ అద్దాలు, క్లాడింగ్, సోలార్ ప్యానళ్లు, బీఎంయూ పనులకు రూ.4,830 కోట్లు.
⇒ రోడ్లు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలకు రూ.1,057.62 కోట్లు.
⇒ డిజైన్ల రూపకల్పనకు రూ.471.23 కోట్లు.
⇒ మొత్తం అంచనా వ్యయం: రూ.15,316.94 కోట్లు.
⇒ మొత్తం నిర్మీత ప్రాంతం: 52,20,496 చదరపు అడుగులు.
⇒ చదరపు అడుగుకు సగటు వ్యయం: రూ.29,340 (ఇప్పటికి)


