సోదరుడు ఓడిపోయాడని.. విజేత ఓట్ల కట్టలతో పరార్‌! | High Tension At Atreyapuram Counting Center | Sakshi
Sakshi News home page

సోదరుడు ఓడిపోయాడని.. విజేత ఓట్ల కట్టలతో పరార్‌!

Nov 30 2026 4:34 AM | Updated on Nov 30 2026 4:34 AM

High Tension At Atreyapuram Counting Center

ఓట్ల కట్టలతో మొదటి అంతస్తు మీద నుంచి దూకి పరారవుతున్న గబ్బర్‌ సింగ్‌

వాడపల్లి ఆలయ చైర్మన్, టీడీపీ నేత గబ్బర్‌సింగ్‌ నిర్వాకం

ఆత్రేయపురంలో కౌంటింగ్‌ కేంద్రం వద్ద హల్‌చల్‌ 

మెజారిటీ వచ్చినా వైఎస్సార్‌సీపీ మద్దతుదారు గెలుపును ప్రకటించని అధికారులు

సాక్షి, అమలాపురం/ఆత్రేయపురం: సోదరుడి ఓటమి తథ్యమని తేలడంతో తట్టుకోలేక టీడీపీ నాయకుడు, వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయ చైర్మన్‌ ముదునూరి వెంకటరాజు అలియాస్‌ గబ్బర్‌సింగ్‌ ఆత్రేయపురంలోని కౌంటింగ్‌ కేంద్రం నుంచి వైఎస్సార్‌సీపీ మద్దతుదారుకు పడిన రెండు ఓట్ల కట్టలతో పరారయ్యారు. మొదటి అంతస్తు నుంచి రేకుల షెడ్డు మీదకు దూకి పరారైన అతడిని పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కొద్దిదూరంలోనే పట్టుకున్నారు. 

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బలపరిచిన చిలువూరి రామకృష్ణంరాజు విజయం సాధించారు. టీడీపీ మద్దతుతో పోటీచేసిన ముదునూరి రామభద్రిరాజు ఓటమి పాలయ్యారు. రామకృష్ణంరాజుకు 172 ఓట్ల మెజారిటీ వచ్చినట్టు ఓట్ల లెక్కింపులో స్పష్టమైంది. ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోయిన రామభద్రిరాజు సోదరుడు, వాడపల్లి ఆలయ చైర్మన్‌ గబ్బర్‌సింగ్‌ కౌంటింగ్‌ కేంద్రం నుంచి రామకృష్ణంరాజుకు పడిన రెండు ఓట్ల కట్టలతో పరారయ్యారు. అతడిని కొద్ది దూరంలోనే పట్టుకుని ఓట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. 

ఆందోళనకు దిగిన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి 
వైఎస్సార్‌సీపీ మద్దతుదారు రామకృష్ణంరాజు విజయం సాధించినట్టు స్పష్టమైనా అధికారులు ఫలితాన్ని ప్రకటించడంలో జాప్యం చేస్తుండటంతో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల కట్లు తీసుకుని పరారైన వ్యక్తిని పట్టుకున్నా తదుపరి చర్యలు తీసుకోకపోవడం, విజేతను ప్రకటించకపోవడం అనుమానాలకు తావిచ్చింది. దీంతో కౌంటింగ్‌ కేంద్రం వద్దకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. తమ అభ్యర్థి గెలుపును ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ సమాచారం అందుకున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఎన్నికల ఫలితం ప్రకటించడంలో జాప్యం ఎందుకని ఎన్నికల అధికారుల్ని ప్రశ్నించారు. చివరకు రామకృష్ణంరాజు ఎన్నికైనట్లు ప్రకటించేందుకు అధికారులు అంగీకరించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement