సర్పంచ్‌ ఎన్నికల్లో మళ్లీ అదే పంచ్‌ | Extraordinary results for YSRCP in 2nd phase Panchayat Polls: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ ఎన్నికల్లో మళ్లీ అదే పంచ్‌

Nov 30 2026 4:58 AM | Updated on Nov 30 2026 5:00 AM

Extraordinary results for YSRCP in 2nd phase Panchayat Polls: Andhra Pradesh

పిఠాపురం మండలం నరసింగపురంలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల సంబరాలు

గ్రామ పంచాయతీల్లో కొనసాగుతున్న వైఎస్సార్‌ సీపీ ప్రభంజనం

రెండో దఫాలో 3,803 పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులకు ఎన్నికలు 

రాత్రి వరకు లెక్కింపు పూర్తైన చోట్ల 1,190 పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులే గెలుపు 

ఏకగ్రీవాలతో కలిపి ఇప్పటివరకు మొత్తం 1,252 చోట్ల సర్పంచ్‌లుగా పార్టీ అభ్యర్థుల ఘన విజయం

ఇప్పటికే తొలి విడతలో మొత్తం 1,182 చోట్ల సర్పంచ్‌లుగా నెగ్గిన వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు

నామినేషన్లకు ముందు నుంచే పచ్చముఠాల అరాచక పర్వం

బలం లేకున్నా బలవంతపు ఏకగ్రీవాలతో బరితెగింపు 

ఓటర్లకు బెదిరింపులు.. రిగ్గింగ్‌.. విపక్ష ఏజెంట్లపై దాడులు 

అధికారులపై ఒత్తిడి తెచ్చి కౌంటింగ్‌లో అక్రమాలు.. ఫలితాలు తారుమారు 

కూటమి ఇన్ని అరాచకాలు, అధికార దుర్వీనియోగానికి పాల్పడినా  వైఎస్సార్‌సీపీని అడ్డుకోలేని పరిస్థితి

సాక్షి, అమరావతి: తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన మాదిరిగానే రెండో విడతలోనూ వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులు దూసుకెళుతూ ఘన విజయాలు దక్కించుకున్నారు. టీడీపీ గూండాలు పోలీసుల సహకారంతో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తూ ఓటింగ్‌లో పాల్గొనకుండా అడ్డుకున్నా..  పోలింగ్‌ బూత్‌లను ఆక్రమించుకుని రిగ్గింగ్‌లకు పాల్పడినా..  ఓట్ల లెక్కింపులోనూ దౌర్జన్యాలకు తెగబడినా.. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల విజయాన్ని అడ్డుకోలేకపోయారు. రెండో విడతలో ఆదివారం 3,803 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరగగా  అనంతరం ఎక్కడికక్కడే లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించారు.

రాత్రి 11 గంటల వరకు అందిన వివరాల ప్రకారం.. 3,564 గ్రామ పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు పూర్తవగా 1,190 చోట్ల వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు సర్పంచ్‌ పదవులను దక్కించుకున్నారు. ఇంకా పలుచోట్ల వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులే గెలిచినా..  టీడీపీ నేతలు అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి రీ కౌంటింగ్‌ పేరుతో అక్రమాలకు పాల్పడి ఫలితాలను తారుమారు చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇప్పటికే తొలి విడతలో ఏకగ్రీవాలతో కలిపి మొ­త్తం 1,182 చోట్ల వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు సర్పంచ్‌లుగా నెగ్గడం తెలిసిందే. నామినేషన్లకు ముందు నుంచే పచ్చముఠాల అరాచక పర్వం ప్రారంభం కా­గా.. బలం లేకున్నా బలవంతపు ఏకగ్రీవాలతో బరి తె­గించి వ్యవహరించాయి. ఓటర్లకు బెదిరింపులు.. రిగ్గింగ్‌తోపాటు విపక్ష ఏజెంట్లపై దాడులకు తెగబడ్డాయి. అధికారులపై ఒత్తిడి తెచ్చి కౌంటింగ్‌లో అక్రమాలు తెర తీసి ఫలితాలు తారుమారు చేసేలా వ్యవహ­రించాయి. కూటమి ఇన్ని అరాచకాలు, అధికార దుర్వీనియోగానికి పాల్పడినా వైఎస్సార్‌సీపీని అడ్డుకోలేని పరిస్థితి నెలకొందని పరిశీలకులు పేర్కొంటున్నారు.  

ఏకగ్రీవాలతో కలిపి మొత్తం 1,252 చోట్ల గెలుపు 
రెండో విడతలో మొత్తం 4,975 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కాగా.. కూటమి ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో టీడీపీ నేతలు పోలీసులు, అధికారుల సహకారంతో ప్రత్యర్ధులను భయపెట్టి నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. బలం లేని చోట్ల కూడా బలవంతపు ఏకగ్రీవాలు చేసుకున్నారు. దీంతో 1,170 చోట్ల సర్పంచ్‌ పదవులు ఏకగ్రీవమయ్యాయి. రెండో విడతలో 62 చోట్ల వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు ఏకగ్రీవంగా గెలిచారు. తాజాగా గెలుపొందిన వాటితో కలిపి మొత్తం 1,252 చోట్ల వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు రెండో విడతలో సర్పంచ్‌లుగా నెగ్గారు.  

80.10 శాతం పోలింగ్‌ నమోదు 
రెండో విడతలో సర్పంచ్, వార్డు పదవులకు ఎన్నికలు జరిగిన 3,803 గ్రామ పంచాయతీలతో పాటు కేవలం వార్డు పదవులకు ఎన్నికలు నిర్వహించిన  77 పంచాయతీలు కలిపి మొత్తం 3,880 చోట్ల ఆదివారం పోలింగ్‌ జరిగింది. మొత్తం 83.52 లక్షల మంది ఓటర్లకు గాను 80.10 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు  రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. అత్యధికంగా ఎన్టీఆర్‌ జిల్లాలో 86.11 శాతం ఓటింగ్‌ నమోదు కాగా అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 67.40 శాతం ఓటింగ్‌ జరిగింది.

మూడు పంచాయతీల్లో నేడు రీ పోలింగ్‌ 
ప్రకాశం జిల్లా దొనకొండ మండలం వడ్డిపాడులో సర్పంచ్, 8 వార్డులకు సోమవారం రీ పోలింగ్‌ జరగనుంది. ముండ్లమూరు మండలం పెద అలుగులలో 1, 2 వార్డులకు.. తిరుపతి రూరల్‌ మండలం రణదీరపురం పంచాయతీలో ఐదు వార్డులకు కూడా రీపోలింగ్‌కు ఆదేశించారు. ఆయా పంచాయతీల్లో నేడు ఉదయం రీ పోలింగ్‌ అనంతరం మధ్యాహ్నం నుంచి కౌంటింగ్‌ చేపట్టనున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement