విద్యుత్‌ నాణ్యతలో ఏపీ నంబర్‌ 1 | AP is number 1 in power quality | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ నాణ్యతలో ఏపీ నంబర్‌ 1

Mar 3 2024 3:02 AM | Updated on Mar 3 2024 3:02 AM

AP is number 1 in power quality - Sakshi

స్టేట్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇండెక్స్‌–2023ను విడుదల చేసిన బీఈఈ

ఇంధన సామర్థ్యంలో గ్రూప్‌–2లో మొదటిస్థానం దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్‌ 

36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యధికంగా ఏపీకి 83.25 పాయింట్లు

సాక్షి, అమరావతి: ఇంధన సామర్థ్యం.. విద్యుత్‌ పొదుపు.. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ అగ్ర స్థానంలో దూసుకుపోతోంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) శనివారం విడుదల చేసిన స్టేట్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ ఇండెక్స్‌ (ఎస్‌ఈఈఐ)–2023లో ఏపీ ప్రథమ స్థానం (గ్రూప్‌–2లో) దక్కించుకుంది. దేశంలోని అనేక పెద్ద రాష్ట్రాలను సైతం వెనక్కి నెట్టి ఏపీ ముందువరుసలో నిలిచింది.

అలయన్స్‌ ఫర్‌ ఎనర్జీ ఎఫిషియెంట్‌ ఎకానమీ (ఏఈఈఈ) సహకారంతో రూపొందిన ఈ ఇండెక్స్‌లో 5 మిలియన్‌ టన్నుల నుంచి 15 మిలియన్‌ టన్నుల చమురుకు సమానం (ఎంటీఓఈ) అయిన ఇంధనాన్ని ఆదా చేసిన రాష్ట్రాలను గ్రూప్‌–2గా విభజించగా, వాటిలో ఏపీ 83.25 పాయింట్లు తెచ్చుకుని ఈ ఘనత సాధించింది. 2022లో ఇదే ఇండెక్స్‌లో ఏపీ టాప్‌–5లో నిలిచింది.

ఏడాదిలోనే వేగంగా మెరుగుపడి టాప్‌–1కి చేరుకుంది. 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో భవనాలు, పరిశ్రమలు, మునిసిపల్, రవాణా, వ్యవసాయం, విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లలో ఇంధన సామర్థ్య విధానాలు, కార్యక్రమాలు, పెట్టుబడులు వంటి దాదాపు 65 అంశాలను పరిగణలోకి తీసుకుని నిర్వాహకులు ఈ పాయింట్లను నిర్థారించారు.

ఏపీ విధానాల కారణంగానే అగ్రస్థానం
100కి 60 కంటే ఎక్కువ పాయింట్లు సాధించిన రాష్ట్రాలను ఫ్రంట్‌ రన్నర్, 50 నుంచి 59.75 పాయింట్లు వచ్చిన వాటిని అచీవర్, 30 నుంచి 49.75 పాయింట్లు వస్తే కంటెండర్, 30 కంటే తక్కువ పాయింట్లు వస్తే ఆస్పిరెంట్‌ రాష్ట్రాలుగా బీఈఈ విభజించింది. ఇందులో మన రాష్ట్రం అత్యధిక ప్రదర్శన కనబరిచింది. రాష్ట్రంలో ఇంధన సామర్థ్యానికి ప్రత్యేక విధానాలను రూపొందించడం ద్వారా అనేక విధానాలను అవలంబించడం, ఆర్థిక ప్రోత్సాహకాలు, సామర్థ్యాన్ని పెంపొందించడం, వివిధ సహకార కార్యక్రమాలను చేపట్టడం ద్వారా ఏపీ ముందంజలో నిలిచింది.

భవన నిర్మాణ రంగంలో ఎనర్జీ కన్జర్వేషన్‌ బిల్డింగ్‌ కోడ్‌ను రాష్ట్రం తప్పనిసరి చేసింది. పట్టణ/స్థానిక సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంధన సామర్థ్య ఉపకరణాలపై దృష్టి పెట్టింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో ఎనర్జీ ఆడిట్‌ను తప్పనిసరి చేసింది. రవాణా రంగంలో ఎలక్ట్రిక్‌ మొబిలిటీ పాలసీ తీసుకువచ్చింది. విద్యుత్‌ వాహనాలు, చార్జింగ్‌ స్టేషన్లను ప్రోత్సహిస్తోంది.

మునిసిపాలిటీల్లో విద్యుత్‌ ఆదా చేసే వీధి దీపాలు, నీటి పంపింగ్‌(ఎనర్జీ ఎఫిషియెన్సీ పంపుసెట్లు) సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ప్రసార, పంపిణీ నష్టాలను తగ్గించే చర్యలు తీసుకుంది. వ్యవసాయంలో సమీకృత నీరు, విద్యుత్‌ పొదుపు, పద్ధతులను ప్రోత్సహిస్తోంది. ఇలాంటి విప్లవాత్మక చర్యలు కారణంగా ఎనర్జీ ఇండెక్స్‌లో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement