సెకండియర్‌కు ప్రమోట్‌ చేయండి

AP Medical Students Request To Center And NMC Second Year Promotion - Sakshi

కేంద్రం, నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌కు ఏపీ మెడికల్‌ విద్యార్థుల వినతి

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కారణంగా విద్యాసంవత్సరాన్ని నష్టపోయిన 2019 బ్యాచ్‌ మెడికల్‌ విద్యార్థులను రెండో సంవత్సరానికి ప్రమోట్‌ చేసి బ్యాక్‌లాగ్స్‌ రాసుకునే అవకాశం కల్పించాలని ఏపీ మెడికల్‌ విద్యార్థుల పేరెంట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కన్వీనర్‌ తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌ కోరారు. ఈ మేరకు ఏపీకి చెందిన బాధిత విద్యార్థులు, తల్లిదండ్రుల బృందం ఢిల్లీలోని నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌కు విజ్ఞప్తి చేసింది.

శనివారం మెడికల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు అండర్‌ గ్రాడ్యుయేట్‌ విభాగం ప్రెసిడెంట్‌ అరుణ వానికర్‌ను కలిసిన ఈ బృందం కోవిడ్‌ కారణంగా 2019 మెడికల్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు జరిగిన నష్టాన్ని వివరించింది. జాతీయస్థాయిలో నీట్‌ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మొదటి సంవత్సర పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం కష్టతరం కాదని తూతిక శ్రీనివాస విశ్వనాథ్‌ అన్నారు. నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ పరంగా, ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ పరంగా తీసుకున్న విధానపరమైన లోపాల కారణంగా విద్యార్థులు నష్టపోయారని చెప్పారు.

పరీక్షా పేపర్‌ సెట్టింగ్‌ విధానంలో వర్సిటీ చేసిన తప్పు కారణంగా విద్యార్థులు 20 మార్కులు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. కోవిడ్‌ కారణంగా తీసుకున్న విధానపరమైన నిర్ణయాల వల్ల నష్టపోయిన విద్యార్థులందరికీ న్యాయం జరగాలంటే విద్యార్థులను రెండో సంవత్సరానికి ప్రమోట్‌ చేసి బ్యాక్‌లాగ్స్‌ రాసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరారు. లేదా కరోనా ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని గ్రేస్‌ మార్కులను కలిపి విద్యార్థులను పాస్‌ చేయాలని బోర్డు ప్రెసిడెంట్‌ అరుణ వానికర్‌కు, ప్రధాని కార్యాలయంలో, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యాలయంలో లేఖ అందించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top