సీఎం జగన్‌ పాలనలో.. రాష్ట్రం ‘క్లిక్‌’ అయిందిలా...

AP is the leader in the use of IT - Sakshi

ఐటీ వినియోగంలో అగ్రగామిగా ఏపీ

మహిళల రక్షణకు ‘దిశ’ ద్వారా పరిష్కారం

రెవెన్యూ డిజిటలైజేషన్లో అందరికీ ఆదర్శం

కనీస మద్దతు ధరల నిర్ణయానికీ టెక్నాలజీ దన్ను

రాష్ట్రంలో ప్రతి ఎకరా పంట ఇపుడు ఆన్‌లైన్లో

విద్యార్థుల హాజరు నుంచి సౌకర్యాల పర్యవేక్షణ కూడా...

ప్రతి విభాగంలోనూ సమర్థంగా ఐటీ వినియోగం

సుమతి రోడ్డుమీద వెళుతుండగా ఆకతాయిలు ఫాలో అవుతున్నారు. భయం వేసింది. చేతిలోని ఫోన్లో ఓ బటన్‌ నొక్కింది. ఐదు నిమిషాలు గడవకముందే పోలీసులొచ్చారు. ఆకతాయిల్ని పట్టుకుని బుద్ధి చెప్పారు. ఇదంతా.. ‘దిశ’ టెక్నాలజీతోనే సాధ్యమయింది. సుమతి దిశ యాప్‌లోని బటన్‌ను ప్రెస్‌ చేయటంతో అది పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌కు సమాచారం పంపింది. అక్కడి నుంచి దగ్గర్లోని పెట్రోలింగ్‌ బృందానికి మెసేజ్‌ వెళ్లింది. అంతా క్షణాల్లో జరిగిపోవటంతో.. సుమతికి ఆపద తప్పింది. 

రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన దిశ యాప్‌ను.. 1.46 కోట్ల మంది మహిళలు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. దీనిద్వారా అలెర్ట్‌ రావటంతో... 31,541 ఘటనల్లో పోలీసులు తక్షణం స్పందించి చర్యలు తీసుకున్నారు.

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ!. ఐటీ. హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చింది తానేనంటారు చంద్రబాబు. ఈ క్లెయిమ్‌పై ఉన్న విభిన్న వాదనలనిక్కడ ప్రస్తావించాల్సిన అవసరం లేదు. మరి 2014 నుంచీ ఏపీ ముఖ్యమంత్రిగాఉన్నపుడు ఐటీని ఏం చేశారు? ప్రపంచమంతా కొత్త ఆవిష్కరణలతో పరుగులు తీస్తున్నపుడు ఇక్కడ మాత్రం అన్నీ మాటలే తప్ప చేతల్లో ఎందుకు కనిపించలేదు? ఐటీకి పితామ­హుడినని చెప్పారే తప్ప... కొత్తగా టెక్నాలజీని వినియోగించిందెక్కడ? సువిశాల తీరం ఉందని... దాన్నే అడ్వాంటేజ్‌గా తీసుకోవాలని పదే పదే చెప్పారు తప్ప ఒక్క పోర్టును గానీ, హార్బర్‌ను గానీ తేలేదెందుకు? మరి వైఎస్‌ జగన్‌ మాత్రం మాటలు చెప్పకుండా ప్రతి విభాగంలోనూ టెక్నాలజీని సమర్థంగా అమలు చేస్తున్నారు కదా? కొత్త పోర్టులు, హార్బర్లను తెచ్చారు కదా? మనకు కావాల్సింది హోరెత్తించే మాటలా..? కళ్లముందు కనిపించే నిజాలా?


రాష్ట్రంలో గత ఖరీఫ్‌లో 93,29,128 ఎకరాల్లో పంటలు వేశారు. దీన్లో వరి 32,83,593 ఎకరాల్లోను... వేరు శనక 5,93166 ఎకరాల్లోను వేశారు. ఈ లెక్కల్లో ఒక్క ఎకరా కూడా తేడా లేదు. ఎందుకంటే ‘ఈ–క్రాప్‌’ టెక్నాలజీ ఉందిప్పుడు. ప్రతి రైతూ తన పంటను నమోదు చేసుకునే ఈ పటిష్ఠమైన డిజిటల్‌ వ్యవస్థతో... రాష్ట్రంలోని 27,800 గ్రామాల్లో ఉన్న ప్రతి ఎకరాకూ లెక్క ఉంది. అది బీమాకైనా... పంట నష్టానికైనా.. దిగుబడికైనా.

ఈ ఉదాహరణలన్నీ చూస్తే... రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రంగంలోనూ టెక్నాలజీని ఎంత సమర్థంగా వినియోగిస్తోందో అర్థమవుతుంది. భారీ ఎత్తున ఐటీ కాంట్రాక్టులివ్వకుండా, ఉన్న వనరులను... నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌ సేవలను సమర్థంగా వాడుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విభాగంలోనూ పూర్తిస్థాయిలో టెక్నాలజీని వాడుతోంది. అందుకనే... మునుపెన్నడూ చూడని పారదర్శకత, జవాబుదారీతనం ఇపుడు కనిపిస్తోంది. చేసిన పని పావలాదే అయినా... పదిరూపాయల ప్రచారం చేసుకోవటమనేది ఈ ప్రభుత్వ విధానం కాదు కాబట్టే.. పెద్దపెద్ద ఆరంభాలు, ఆర్భాటాలు లేకుండానే ప్రజలకు సమర్థమైన ఐటీ సేవలు అందుతున్నాయి.

ఏఎన్‌ఎం యాప్‌లో 15 మాడ్యూల్స్‌...
2020లో ప్రభుత్వం రూపొందించిన ఏఎన్‌ఎం యాప్‌ ద్వారా... క్షేత్ర స్థాయిలో ప్రతి కార్యక్రమాన్నీ వారు రిపోర్ట్‌ చేస్తుంటారు. ఎన్‌సీడీ–సీడీ సర్వే, ఫీవ­ర్‌ సర్వే, గర్భిణి స్త్రీలు, చిన్న పిల్లలు, పాఠశాల విద్యార్థుల హెల్త్‌ స్క్రీనింగ్, ఆరోగ్యశ్రీ ఫీడ్‌ బ్యాక్‌ ఇలా అన్నిటినీ నమోదు చేస్తారు. ఆశా వర్కర్లకు తెచ్చిన ‘ఈ–ఆశా’ యాప్‌ ద్వారా గర్భిణులు, చిన్నా­రుల ఆరోగ్యాన్ని వైద్యశాఖ నిరంతరం పర్యవేక్షిస్తుంది. పీహెచ్‌సీల్లో పనిచేసే మెడికల్‌ ఆఫీసర్లు, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లకూ యాప్‌లున్నాయి. ఇవన్నీ ఒకదానికొకటి అనుసంధానమై పనిచేస్తాయి.

స్కూళ్లకు పక్కా సమాచార వ్యవస్థ...
ఈ ప్రభుత్వం తెచ్చిన స్కూల్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం(సిమ్స్‌)లో ఎల్‌కేజీ నుంచి ఇంటర్‌ వరకు ఉన్న 82 లక్షల విద్యార్థుల వివరాలు అప్‌ టు డేట్‌గా ఉన్నాయి. విద్యార్థుల ఆధార్‌ను లింక్‌ చేస్తూ... ప్రత్యేక ఐడీ నెంబర్‌ కేటాయించారు. దీంతో స్టూడెంట్‌ హాజరు యాప్‌ ద్వారా ట్రాక్‌ చెయ్యటం... గ్రామ/వార్డు కార్యదర్శుల ద్వారా వారిని తిరిగి బడికి రప్పించటం సులువవుతోంది. ఇక టీచర్ల అటెండెన్స్‌కూ యాప్‌ ఉంది. జియోగ్రాఫికల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌తో అనుసంధానించిన ఈ యాప్‌... టీచర్‌ తమ స్కూల్‌ పరిసరాలకు 10 మీటర్ల దూరంలో ఉంటేనే హాజరును తీసుకుంటుంది.  

జగనన్న గోరుముద్ద అమలును పర్యవేక్షించడానికి ‘ఇంటిగ్రేటెడ్‌ మోనిటరింగ్‌ సిస్టం ఫర్‌ మిడ్‌డే మీల్స్‌ అండ్‌ శానిటేషన్‌’ (ఐఎంఎంఎస్‌) వచ్చింది. వారంలో ఆరు రోజులు.. రోజుకు సగటున దాదాపు 37,63,698 మంది విద్యార్థులకు ఆహారం తీసుకుంటున్నారు. టీచర్ల ఫోన్‌లోని ఈ యాప్‌ ద్వారా... హాజరుతో పాటు ఎంతమంది పిల్లలు ఆహారం తీసుకుంటున్నారు? ఏరోజు ఏం వడ్డించారు, ఇచ్చిన సరుకు ఎంత? ఎంత స్టాక్‌ ఉంది? వంటి వివరాలన్నీ తెలుస్తాయి. ప్రతిరోజు టాయిలెట్ల పరిస్థితులూ అప్‌డేట్‌ అవుతాయి. ఎంప్లాయి ఇన్ఫర్మేషన్‌ సిస్టంలో టీచర్ల çహాజరుతో పాటు ఎన్‌ఓసీ, సెలవులు, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్, గ్రీవెన్స్‌ సహా సర్వీసు రికార్డు మొత్తం ఉంటోంది.

♦ చైల్డ్‌ ఇన్ఫో సిస్టంలో విద్యార్థులు ఏ స్కూల్‌ నుంచి ఏ స్కూల్‌కు మారారు. కుటుంబ సభ్యుల ఆధార్‌ వివరాలు, బ్యాంకు ఖాతా లింకేజ్‌ వంటివన్నీ ఉంటాయి. 

♦ జేవీకే యాప్‌ ద్వారా ప్రతి స్కూల్లో అవసరమైన జగనన్న విద్యాకానుక కిట్లు ఎన్ని? ఎన్ని అందించారు? ఎన్ని మిగిలాయి? వంటివన్నీ తెలుస్తాయి. పైపెచ్చు ఈ వ్యవస్థలను పర్యవేక్షించేందుకు జిల్లాకు ఇద్దరు అధికారుల చొప్పున నియమించి ఇబ్రహీంపట్నం, విశాఖపట్నంలో రెండు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లున్నాయి. బడుల్లో టీచర్లు, పిల్లల అటెండెన్స్‌ వేశాక అది ఈ సెంటర్లకు వెళుతుంది.

టెక్నాలజీతో రైతుకు దన్ను...
‘ఈ–కర్షక్‌’ యాప్‌తో ఆర్‌బీకేలో రైతులు సీజన్‌లో తాము సాగు చేసే పంటల వివరాలను నమోదు చేసుకుంటారు. తర్వాత ఆర్బీకే సిబ్బంది పొలాలకు వెళ్లి స్వయంగా జియో కో ఆర్డినేట్స్, జియో ఫెన్సింగ్‌  ద్వారా రైతుసాగు చేసే పంట పొలం విస్తీర్ణం, సర్వే నెంబర్‌తో పాటు పంట వివరాలనూ ధ్రువీకరిస్తారు. పొలం ఫోటో డిజిటైజ్‌ చేస్తారు.  
♦ఆర్‌బీకేల్లోని వెటర్నరీ సహాయకుల పనితీరును పర్యవేక్షించడానికి ‘పశు సంరక్షక్‌’ యాప్‌ ఉంది.  
♦రోజువారీ వ్యవసాయ పంటల హెచ్చుతగ్గులను పర్యవేక్షించడానికి మార్కెటింగ్‌ శాఖ ‘కంటిన్యూస్‌ మోనిటరింగ్‌ ఆఫ్‌ ప్రైస్‌ ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ పేమెంట్స్‌’ (సీఎంయాప్‌)ను తీసుకొచ్చింది.  
♦‘ఈ–మత్స్యకార’ పోర్టల్‌ను వివిధ యాప్‌లతో అనుసంధానించారు. అప్సడా రిజిస్ట్రేషన్లు, ఆర్‌బీకే ఇన్‌పుట్‌ సప్లయి,  ఈక్రాప్, మత్స్య సాగుబడి, కేసీసీ, పీఎంఎంఎస్‌వై వంటివన్నీ దీని ద్వారానే నిర్వహిస్తున్నారు. 
♦‘వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ’ యాప్‌తో 55607 అంగన్‌వాడీ కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు.

అర చేతిలో ఆరోగ్యశ్రీ...
ఆరోగ్య శ్రీ యాప్‌లో లాగిన్‌ అయితే... తాము గతంలో ఏ చికిత్స పొందామన్నది లబ్ధిదారులు తెలుసుకోవచ్చు. పథకం కింద ఏ ఆస్పత్రుల్లో ఏ వైద్య సేవలు అందుతాయి? దగ్గర్లో నెట్‌వర్క్‌ ఆసుపత్రులు ఏమేం ఉన్నాయి? తెలుసుకోవచ్చు. వాటి లొకేషన్‌నూ ట్రాక్‌ చేయొచ్చు. ‘ఈహెచ్‌ఆర్‌– డాక్టర్‌ కేర్‌’ ఆన్‌లైన్‌ వేదికతో యూపీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో డిజిటల్‌ వైద్య సేవలందుతున్నాయి. ఈ పోర్టల్‌ నుంచి రోగులకు అందించిన వైద్యం వివరాలను వారి ఆయుష్మాన్‌ భారత హెల్త్‌ ఖాతాలో అప్‌లోడ్‌ చేస్తున్నారు. ల్యాబ్‌ టెస్ట్‌ల ఫలితాలు ఈహెచ్‌ఆర్‌ నుంచి నేరుగా రోగుల మొబైల్‌కే ఎస్సెమ్మెస్‌ ద్వారా వెళుతున్నాయి. 

క్రొంగొత్తగా... రిజిస్ట్రేషన్ల వ్యవస్థ
దేశంలో దస్తావేజులు రాయటానికి కొన్ని స్టార్టప్‌లు ఆన్‌లైన్‌ రైటర్లను అందుబాటులోకి తెచ్చాయి. ఇక్కడ ప్రభుత్వమే ఆ పనిచేసింది. ‘కార్డ్‌ ప్రైమ్‌’ విధానం ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖను పూర్తిగా డిజిటలైజ్‌ చేసిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం... వినియోగదారులు ఎవరిపైనా ఆధారపడకుండా నేరుగా ఆన్‌లైన్లో డాక్యుమెంట్లు తయారు చేసుకునే వీలు కల్పించింది. ఆన్‌లైన్లోనే చలానాలు కట్టి స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఆ టైమ్‌లో సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌కి వెళితే అరగంటలో పని పూర్తవుతుంది. గతంలోలా డాక్యుమెంట్ల స్కానింగ్‌ అక్కర్లేదు కూడా. డిజిటల్‌ సిగ్నేచర్‌ ఒక్కటీ చాలు. 

♦ఇక వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్‌ సమయంలోనే ఆటో మ్యుటేషన్‌ జరిగే కొత్త విధానాన్ని తెచ్చిందీ ప్రభుత్వం. గతంలో రిజిస్ట్రేషన్‌ అయ్యాక ఆ డాక్యుమెంట్లను రెవెన్యూ అధికారులకిస్తే వాళ్లు మ్యుటేషన్‌ చేసేవారు. దీనికి సమయం పట్టేది. ఇప్పుడా అవసరం లేదు. 

♦స్టాంపు పేపర్ల స్థానంలో ఈ స్టాంపింగ్‌ను అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. గతంలో భౌతికంగా స్టాంపులు కొని, వాటి ద్వారా అగ్రిమెంట్లు చేసుకునేవారు. ఇప్పుడు స్టాంపు పేపర్లతో పని లేదు. కామన్‌ సర్వీస్‌ సెంటర్లు, మీ సేవా కేంద్రాలు, డాక్యుమెంట్‌ రైటర్ల వద్ద కూడా ఈ–స్టాంపింగ్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. స్టాంపు  పేపర్ల అవకతవకలకు చెక్‌ పడింది.

♦భూముల రీ సర్వే ద్వారా ఏ రాష్ట్రంలో లేని విధంగా డిజిటల్‌ రెవెన్యూ రికార్డులు తయారవుతున్నాయి. డ్రోన్లతో సర్వే చేసి శాటిలైట్‌ లింకు ద్వారా జియో కోఆర్డినేట్స్‌తో రైతుల భూముల హద్దులు నిర్ధారిస్తున్నారు. ప్రతి భూ కమతానికి ఆధార్‌ తరహాలో యునిక్‌ ఐడీ ఉంటోంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top