టీడీఆర్‌ బాండ్లే తీసుకోవాలని బలవంతం చేయొద్దు | AP High Court orders state govt on land acquisition compensation | Sakshi
Sakshi News home page

టీడీఆర్‌ బాండ్లే తీసుకోవాలని బలవంతం చేయొద్దు

Apr 15 2026 5:46 AM | Updated on Apr 15 2026 5:47 AM

AP High Court orders state govt on land acquisition compensation

సాక్షి, అమరావతి: భూ సేకరణ చట్టం కింద భూమి తీసుకున్నప్పుడు చట్ట ప్రకారం చెల్లించాల్సిన పరిహారాన్ని ఇవ్వకుండా టీడీఆర్‌ బాండ్లు తీసు­కోవాలని బలవంతం చేయడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి చెప్పింది. టీడీఆర్‌ బాండ్లు తీసుకోవడానికి భూ యజమానులు నిరాకరిస్తే చట్టం నిర్దేశించిన మేరకు పరిహారం చెల్లించడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేసింది. పరిహారానికి బదులు టీడీఆర్‌ బాండ్లు తీసుకోవడం తప్పనిసరి కాదంది. టీడీఆర్‌ బాండ్లు తీసుకోవడమన్నది కేవలం ఐచ్ఛికం మాత్రమేనని పేర్కొంది. 

తీసుకున్న భూమికి చట్ట ప్రకారం పరిహారం చెల్లించకుండా టీడీఆర్‌ బాండ్లు తీసుకోవాలని భూ యజమానులను ఒంగోలు మున్సిపల్‌ అధికారులు బలవంతం చేయడాన్ని తప్పుపట్టింది. బాండ్లు తీసుకునేందుకు భూ యజమానులు నిరాకరించారని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో వారికి చట్ట ప్రకారం పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌ ఇటీవల తీర్పు వెలువరించారు.

బెదిరింపులకు దిగటంతో హైకోర్టును ఆశ్రయించిన బాధితులు
ఒంగోలు మున్సిపల్‌ అధికారులు జేఎంబీ చర్చి సెంటర్‌ నుంచి ఓల్డ్‌ మార్కెట్‌ వరకు రోడ్డు విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం కొన్ని ఆస్తులను సేకరించాలని నిర్ణయించారు. అందులో భాగంగా పలువురికి నోటీసులు జారీ చేశారు. టీడీఆర్‌ బాండ్లు లేదా పరిహారానికి ఆమోదం తెలిపాలని సదరు భూ యజమానులను కోరారు. అయితే, భూ యజమానులు టీడీఆర్‌ బాండ్లు తీసుకునేందుకు నిరాకరించారు. తమకు చట్ట ప్రకారం పరిహారం చెల్లించాలని కోరారు. దీంతో ఒంగోలు పురపాలక శాఖ అధికారులు టీడీఆర్‌ బాండ్లు తీసుకోవాల్సిందేనని, లేనిపక్షంలో ఇల్లు కూల్చేస్తామంటూ మౌఖికంగా బెదిరింపులకు దిగారు. దీంతో భూ యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. 

టీడీఆర్‌ బాండ్లు కాకుండా తమకు చట్ట ప్రకారం పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌ విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది షేక్‌ ఆసిఫ్‌ వాదనలు వినిపిస్తూ.. టీడీఆర్‌ బాండ్లు తీసుకోవాల్సిందేనని పిటిషనర్లను అధికారులు బలవంతం చేస్తున్నారని తెలిపారు. చట్ట ప్రకారం పరిహారం చెల్లించకుండా ఎగవేసేందుకే అధికారులు టీడీఆర్‌ బాండ్లను తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని వివరించారు.

బలవంతంగా రుద్దడానికి వీల్లేదు
వాదనలు విన్న న్యాయమూర్తి అధికారుల తీరును తప్పుపట్టారు. బాధితులపై టీడీఆర్‌ బాండ్లను బలవంతంగా రుద్దడానికి వీల్లేదని స్పష్టం చేశారు. బాధితులైన భూ యజమానులు టీడీఆర్‌ బాండ్లను తిరస్కరిస్తే 2013 భూ సేకరణ చట్టం కింద పరిహారం చెల్లించడం మినహా ప్రభుత్వానికి మరో ప్రత్యామ్నాయం లేదని తేల్చి చెప్పారు. పిటిషనర్‌కు 2013 చట్ట ప్రకారం మార్కెట్‌ ధరను ఖరారు చేసి అందుకు అనుగుణంగా పరిహారాన్ని చెల్లించాలని ఒంగోలు మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement