ఎస్‌ఈసీకి ఎదురుదెబ్బ.. ఆ అధికారం మీకెక్కడుంది!?

AP High Court Interim Orders To SEC On MPTC and ZPTC Unanimous - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురైంది! ఏకగ్రీవాలను నీరుగార్చి తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించి భంగపడింది. గతేడాది అర్ధాంతరంగా ఆగిపోయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా బలవంతంగా నామినేషన్లను ఉపసంహరించారని నిర్ధారణ అయితే ఆ అభ్యర్థుల నామినేషన్లను పునరుద్ధరించాలని కలెక్టర్లను ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఈ నెల 18న జారీ చేసిన ఆదేశాల విషయంలో హైకోర్టు జోక్యం చేసుకుంది.

ఒకే ఒక నామినేషన్‌ దాఖలైన చోట ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తూ ఎన్నికల అధికారి ఫాం – 10 జారీ చేసిన ఏకగ్రీవాలపై ఈ నెల 23వతేదీ వరకు ఎలాంటి విచారణ జరపవద్దని ఎన్నికల కమిషన్, అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ ఫాం – 10 జారీ చేయని చోట ఏవైనా చర్యలు తీసుకుంటే ఈ నెల 23 వరకు వెల్లడించరాదని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల కాపీని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లకు పంపాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించారు.

ఇవీ పిటిషన్లు...
ఎన్నికల కమిషనర్‌ ఉత్తర్వులను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి రద్దు చేయాలని కోరుతూ చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం, ఆరడిగుంట, సింగిరిగుంట ఎంపీటీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఫాం 10 అందుకున్న డి.నంజుండప్ప, ఏ.భాస్కర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పీలేరు ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఫాం 10 అందుకున్న ఏటీ రత్నశేఖర్‌రెడ్డి కూడా మరో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. లంచ్‌ మోషన్‌ రూపంలో దాఖలైన ఈ వ్యాజ్యాలపై పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి, వీఆర్‌ఎన్‌ ప్రశాంత్, ఎస్‌ఆర్‌ వివేక్‌ చంద్రశేఖర్‌లు వాదించగా ఎన్నికల కమిషన్‌ తరఫున ఎన్‌.అశ్వనీకుమార్‌ వాదించారు.

ఆర్వోల విధుల్లో కమిషనర్‌ జోక్యం చేసుకోరాదు..
‘రాజ్యాంగంలోని అధికరణ 243 కే కింద తన అధికారాలకు అడ్డులేదని ఎన్నికల కమిషనర్‌ భావిస్తున్నారు. రిటర్నింగ్‌ అధికారులు ఏం చేయాలో నిబంధనల్లో స్పష్టంగా ఉంది. వారి విధుల్లో ఎన్నికల కమిషనర్‌ జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. ఒకే అభ్యర్థి బరిలో ఉంటే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి తక్షణమే ప్రకటించి ఫాం 10 ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఎన్నికల కమిషనర్‌ చట్టాలను ఖాతరు చేయకుండా సూపర్‌మ్యాన్‌లా వ్యవహరిస్తున్నారు’ అని పిటిషనర్ల తరపు న్యాయవాది మోహన్‌రెడ్డి నివేదించారు. పిటిషనర్ల తరఫున మరో న్యాయవాది వీఆర్‌ఎన్‌ ప్రశాంత్‌ వాదనలు వినిపిస్తూ ఓ అభ్యర్థి ఎన్నికైనట్లు ప్రకటించి ధ్రువీకరణ పత్రం జారీ చేసిన తరువాత అభ్యంతరాలుంటే ఎన్నికల ట్రిబ్యునల్‌ ముందు పిటిషన్‌ దాఖలు చేసుకోవడం ఒక్కటే మార్గమన్నారు. ఎన్నికల కమిషన్‌ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయక ముందే దాఖలైన ఈ వ్యాజ్యాలకు విచారణార్హత లేదని కమిషన్‌ తరపు న్యాయవాది అశ్వనీకుమార్‌ పేర్కొన్నారు.

ఆ అధికారం మీకెక్కడుంది..?
ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ విచారణకు ఆదేశించే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందా? ఆ అధికారం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అని ఎన్నికల కమిషన్‌ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. చట్టంలో ఏమీ చెప్పనప్పుడు మాత్రమే 243 కే కింద అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేస్తూ ఈ వ్యవహారంలో క్షుణ్నంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పిటిషనర్లు ప్రస్తావించిన అంశాలకు ప్రాథమిక ఆధారాలున్నాయని స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top