మహిళలకు అధికారమిస్తే ఆందోళన ఎందుకు?

AP High Court Hearing On Petition Against GO No 59 - Sakshi

ప్రజాసేవకే కదా అధికారం ఇస్తోంది.. తప్పేముంది?

మహిళా సంరక్షణ కార్యదర్శులను ‘మహిళా పోలీసులు’గా నియమించడంపై హైకోర్టు

కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను ‘మహిళా పోలీసులు’గా పోలీసుశాఖలో అంతర్భాగంగా పరిగణిస్తూ ఈ ఏడాది జూన్‌లో జారీచేసిన జీవో 59పై హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని చెప్పింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, ఏపీపీఎస్‌సీ చైర్మన్, పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ తదితరులకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను నవంబర్‌ 24కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ ఆకుల వెంకటశేషసాయిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.

జీవో 59 ఏపీ పోలీసు చట్ట నిబంధనలకు, రాజ్యాంగానికి విరుద్ధమంటూ ప్రకటించి ఆ జీవోను రద్దు చేయాలని కోరుతూ విశాఖపట్నం పెదవాల్తేరుకు చెందిన నిరుద్యోగి ఆరేటి ఉమామహేశ్వరరావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్‌ న్యాయవాది వై.బాలాజీ వాదనలు వినిపిస్తూ.. మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీసులుగా పరిగణించడంతోపాటు వారికి పోలీసు యూనిఫాం ఇవ్వడంతోపాటు కానిస్టేబుల్‌కు ఉండే అధికారాలు, బాధ్యతలు కట్టబెట్డడం చట్టవిరుద్ధమని చెప్పారు.

పోలీసు నియామక బోర్డు ద్వారానే పోలీసు నియామకాలు జరగాల్సి ఉంటుందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. మహిళలకు అధికారం ఇస్తే తప్పేముందని ప్రశ్నించింది. మహిళలకు అధికారం ఇస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదంది. ప్రజలకు సేవ చేయడానికే కదా ప్రభుత్వం మహిళలను పోలీసులుగా గుర్తిస్తోందంటూ వ్యాఖ్యానించింది. మహిళలకు అధికారం ఇవ్వడాన్ని తాము తప్పుపట్టడం లేదని, నిబంధనలకు విరుద్ధంగా చేయడాన్నే తప్పుపడుతున్నామని బాలాజీ చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలంటూ విచారణను నవంబర్‌ 24కి వాయిదా వేసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top