‘సిట్‌పై స్టే’ పిటిషన్‌ విచారణ పూర్తి.. తీర్పు రిజర్వ్‌.. వర్ల న్యాయవాదిపై సుప్రీం ఘాటు వ్యాఖ్యలు

AP Govt Sit Stay Petition Trail Complete SC Judgment Reserved - Sakshi

సాక్షి, ఢిల్లీ: అమరావతి భూ కుంభకోణం, ఫైబర్‌నెట్‌ కుంభకోణాలపై సిట్‌ విచారణను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ గురువారంతో పూర్తైంది. ఇరుపక్షాల వాదనలు ముగియగా.. తీర్పును రిజర్వ్‌ చేసింది సుప్రీం ధర్మాసనం. 

అంతకు ముందు విచారణ సమయంలో జస్టిస్‌ ఎం.ఆర్‌. షా, జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం టీడీపీ నేత వర్ల రామయ్య తరపు న్యాయవాదిపై సుప్రీం కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘‘గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష జరిపే అధికారం లేదంటే ఎలా? అలాంటి వారికి వంద శాతం ఇమ్యూనిటీ ఇచ్చినట్లు కాదా? ఇది ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకం కాదా?.. దురుద్దేశం లేదని చెప్పేందుకే సీబీఐకి ఇస్తామని చెప్పారు కదా? దురుద్దేశం గనుక ఉంటే ఇవన్నీ దర్యాప్తులో తెలుస్తాయి కదా! అని  ప్రశ్నించింది.

రాజకీయ వైరుధ్యం వల్ల  ఎంక్వేరీ చేయవద్దా?. గత ప్రభుత్వాలు చేసిన నిర్ణయాలపై సమీక్ష జరిపే అధికారమే లేదంటే ఎలా?. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కీలక విధానాలు, ప్రాజెక్టులలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు కోసం ఏర్పాటుచేసిన సిట్​ పై స్టే ఇచ్చింది ఏపీ హైకోర్టు. ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్​ చేసిన ఏపీ ప్రభుత్వం. 

రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మనుసింఘ్వి వాదనలు వినిపిస్తూ కేబినెట్‌ సబ్‌ కమిటీ సిఫార్సుల మేరకు ఒక పోలీసు స్టేషన్‌లో సిట్‌ను ఏర్పాటు చేసినట్లు సుప్రీంకు నివేదించారు. నిజ నిర్ధారణ పూర్తి చేశామని, పక్షపాతం ఉండకూడదనే సీబీఐ దర్యాప్తు కోరుతున్నామన్నారు. కొందరు వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయని, ప్రభుత్వం నేరుగా నమోదు చేయలేదని తెలిపారు. విధాన నిర్ణయాలు, టెండర్, కాంట్రాక్టులకు సంబంధించిన కేసుల్లో సారూప్యం చూడాలని కోరారు. అమరావతి భూ కుంభకోణం, ఫైబర్‌నెట్‌ కుంభకోణాలపై రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్‌ విచారణ కాకుండా నిజ నిర్ధారణ మాత్రమే చేసిందన్నారు. ప్రభుత్వం గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించవచ్చని, నిజ నిర్ధారణపై నిషేధం ఉండదని స్పష్టం చేస్తూ ఈ మేరకు తీర్పులను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.  

ఇక వర్లరామయ్య తరపు న్యాయవాది దవే వాదనలు వినిపిస్తూ.. పక్షపాతంతో ఈ అంశంపై జివో ఇచ్చారని, అధికార పార్టీతో నిజనిర్దారణ ఏర్పాటుచేశారని వాదించారు. ఈ క్రమంలో ధర్మాసనం కలుగజేసుకుని.. ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ప్రజాధనం దుర్వినియోగం, వృథా ఉంటే దర్యాప్తు చేయకూడదా? అని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. ఏవైనా లావాదేవీలు దురుద్దేశపూరితంగా జరిగాయని భావిస్తే అది విచారించదగినదే కదా? అని ప్రశ్నించింది.

ఇదీ చదవండి: అమరావతి రైతులకు హైకోర్టులో ఎదురు దెబ్బ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top