పైలెట్‌ ప్రాజెక్టుగా విజయనగరం జిల్లా ఎంపిక

AP Govt Selected Vizianagaram As Pilot Project For Supply Of Fortified Rice - Sakshi

ప్రజల సంక్షేమం కోసమే ఫోర్టిఫైడ్‌ రైస్‌ పంపిణీ

బియ్యంలో సూక్ష్మపోషకాలతో సంపూర్ణ ఆరోగ్యం

జిల్లావ్యాప్తంగా ఈ నెల నుంచి పంపిణీ

విజయనగరం గంటస్తంభం: రేషన్‌ బియ్యం అంటే ఏదో మొక్కుబడిగా అందివ్వడం కాదు. అవి ప్రతీఒక్కరూ వినియోగించుకునేవిగా ఉండాలి. దానివల్ల వారి ఆరోగ్యం మెరుగుపడాలి. ఆ ఉద్దేశంతోనే సంపూర్ణ పోషకాలు కలిగిన ఫోర్టిఫైడ్‌ రైస్‌ను అందిస్తోంది. ప్రయోగాత్మకంగా ఇప్పటివరకూ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లోనే వీటిని పంపిణీ చేస్తుండగా ఈ నెల నుంచి జిల్లాలోని అందరికీ అందిస్తోంది. వీటిని వృథా చేసుకోకుండా వినియోగించుకుంటే వారి ఆరోగ్యానికి, పిల్లలకు ఎంతో మంచిది.  

పైలెట్‌ ప్రాజెక్టుగా జిల్లా 
ఫోర్టిఫైడ్‌ రైస్‌ పంపిణీకి రాష్ట్రంలో విజయనగరం జిల్లాను పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో జిల్లాలో 78.7శాతం పిల్లల్లో, 75.5శాతం మహిళల్లో రక్తహీనత ఉన్నట్లు తేలడంతో తొలి ప్రాధాన్యతగా జిల్లాను ఎంపిక చేశారు. రక్తహీనత నివారించేందుకు ఈ బియ్యం దోహదపడుతా యన్న ఉద్దేశంతో వీటిని ప్రత్యేకంగా అందజేస్తున్నారు. గతంలో మన రైతులు పండించిన ధాన్యాన్ని మరపట్టి వాటిని రేషన్‌డిపోల ద్వారా ప్రభుత్వం సరఫరా చేసేది. ఇప్పుడు అదే ధాన్యం మరపట్టి బియ్యంలో ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అదనంగా చేర్చుతున్నారు.

ఐరన్, ఫోలిక్‌ యాసిడ్, విటమిన్‌ బి12 వంటి కీలక సూక్ష్మ పోషకాలు చేర్చడం వల్ల పోషకా హార లోపాన్ని అధిగమించేలా చేస్తుంది. జిల్లాలో 21 రైస్‌ మిల్లుల్లో ఇప్పుడు ఫోరి్టఫైడ్‌ రైస్‌ తయారవుతోంది. ఈ ఏడాది 1.10లక్షల మెట్రిక్‌ టన్నులు తయారీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంకా అవసరమైన బియ్యా న్ని ఇతర జిల్లాల నుంచి తెప్పిస్తారు. ఎక్కువ మంది పోషకాహార లోపం నుంచి బయట పడేందుకు ఈ బియ్యం సరఫరా చేయాలని సర్కారు యోచించింది. ఈ రైస్‌ వల్ల రుచి బాగుంటుంది. వంట చేసే విధానంలో ఏమీ మార్పు ఉండదు.

పోషకాహార లోపంతో సమస్యలు 
పోషకాహార లోపంవల్ల చాలా ఇబ్బందులున్నాయి. పోషకాహార లోపం ఉన్నవారు ఎత్తు మెట్లు  ఎక్కుతున్నప్పుడు ఆయాసపడడం, మానసికంగా అలసిపో వడం, నాలుక పాలిపోవడం, తలవెంట్రుకలు రాలడం, ఏకాగ్రత లోపించడం, బలహీనంగా, చికాకుగా ఉండడం, అరచేతులు, అరికాళ్లు పాలిపోవడం, వ్యాధినిరోధకశక్తి తగ్గిపోవడం వంటివి జరుగుతాయి. రేషన్‌ బియ్యం పొందేవారిలో కష్టపడే వారు ఎక్కువ. పోషకాహార లోపం వల్ల వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం గుర్తించి ఫోరి్టఫైడ్‌ రైస్‌ సరఫరా చేస్తోంది.

ఫోలిక్‌ యాసిడ్‌
ఫోర్టిఫైడ్‌ రైస్‌లో ముఖ్యంగా లభించేది ఫోలిక్‌ యాసిడ్‌. బాలింత తల్లుల్లో పెరుగుదలకు తోడ్పడుతుంది. పిండం అభివృద్ధి చెందుతుంది. పసిపిల్లల్లో మెదడు, వెన్నెముక పెరగడానికి తోడ్పడుతుంది. రక్త నిర్మాణం బాగా జరుగుతుంది

విటమిన్‌ బి–12
మెదడు, నాడీ మండలం పని చేయడంలో, ఎర్ర రక్తకణాల ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తుంది. నాడీ వ్యవస్థ పనితీరు బాగుంటుంది.
 
ఐరన్‌
మన శరీరంలో జరిగే అనేక జీవక్రియల్లో ఐరన్‌ ముఖ్య భూమిక పోషిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయిని సరైన మోతాదులో ఉంచి రక్తహీనత అరికట్టడంలో ఐరన్‌ది ప్రధాన పాత్ర. ఫోర్టిఫైడ్‌ రైస్‌ తినడం వల్ల అందులో ఐరన్‌ రక్తహీనతతో పోరాడుతుంది.

వృథా చేయవద్దు 
ప్రభుత్వం ఫోరి్టఫైడ్‌రైస్‌ సదుద్దేశంతో సరఫరా చేస్తోంది. దీనికోసం అదనంగా కోట్లాదిరూపాయలు ఖర్చు చేస్తోంది. కార్డుదారులు వాటిని వండి తింటే వారి ఆరో గ్యం బాగుంటుంది. సాధారణ బియ్యంలో మి ల్లింగ్‌ సమయంలో పోషకాలు కలుపుతున్నాం. బియ్యంపై ప్రజలు అపోహలు వీడాలి. ఇందులో కలిపే ఐరన్, ఫోలిక్‌ యాసిడ్, విటమిన్‌ బి–12 వంటి అనేక ఆరోగ్య పోషకాలు ఉన్నాయి.  కార్డుదారులంతా వాటిని వినియోగించుకోవాలి.
- జి.సి. కిశోర్‌కుమార్, సంయుక్త కలెక్టర్, విజయనగరం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top