
హెలిప్యాడ్ పనులను పరిశీలిస్తున్న కారుమూరి, పర్వతరెడ్డి
ఈనెల 31న మాజీమంత్రి కాకాణితో ములాఖత్ నల్లపరెడ్డి ప్రసన్న కుటుంబానికి పరామర్శ
హెలిప్యాడ్ వద్దకు పది మంది మాత్రమే వెళ్లాలంట
ప్రసన్న ఇంటి వద్దకు ఎవరికీ అనుమతిలేదు
జైలు దగ్గర నుంచి ప్రసన్న ఇంటి వద్దకు 15 వాహనాలకే అనుమతి
అభిమానాన్ని అడ్డుకునేందుకు అడుగడుగునా కుట్రలు
గతంలోనూ హెలిప్యాడ్‌కు అనుమతులివ్వకుండా ఇబ్బంది పెట్టిన పోలీసులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఈనెల 31న వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటనకు షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో పోలీసులు మరోమారు కఠిన ఆంక్షలు విధించారు. ఆయన పర్యటనలో ప్రజాభిమానాన్ని అడ్డుకునేందుకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించాలని కుట్రలు పన్నుతున్నారు. హెలిప్యాడ్ వద్దకు కేవలం పది మందిని మాత్రమే అనుమతిస్తామని, ర్యాలీగా వెళ్లొద్దని, అభిమానులు తరలిరావడానికి వీల్లేదంటూ వివిధ ఆంక్షలతో వైఎస్సార్‌సీపీ నేతలకు పోలీసులు నోటీసులిచ్చారు. ఈ ఆంక్షలపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు మండిపడుతున్నారు.
మాజీమంత్రి కాకాణితో ములాఖత్..
రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సర్కారు వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిపై దాదాపు 13 అక్రమ కేసులు బనాయించి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్ జగన్ కాకాణితో ములాఖత్ కానున్నారు. అక్కడ నుంచి.. టీడీపీ రౌడీమూకలు ఇటీవల ధ్వంసం చేసిన మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వెళ్తారు.
ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఈ మేరకు వైఎస్ జగన్ పర్యటన ఖరారు కావడంతో పోలీసులు ఆయన పర్యటనలో ప్రజాభిమానాన్ని అడ్డుకునేందుకు కఠినమైన ఆంక్షలు విధిస్తూ ఇప్పటికే వైఎస్సార్‌సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డికి రెండు నోటీసులు అందించారు.
హెలిప్యాడ్ వద్దకు పది మందే వెళ్లాలంట..
ఇక వెంకటాచలం మండలం చెముడుగుంటలోని సెంట్రల్ జైలుకు సమీపంలో పోలీసులు అనుమతిచ్చిన హెలిప్యాడ్ వద్దకు కేవలం పదిమంది మాత్రమే వెళ్లాలని, అంతకుమించి ఎవరూ వెళ్లకూడదని పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అలాగే, జైలు ఆవరణలోకి ఎవరూ రాకూడదని, కేవలం ముగ్గురితోనే వెళ్లి కాకాణితో ములాఖత్ కావాలని స్పష్టంచేశారు.
అక్కడ నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరులోని ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి కేవలం మూడు వాహనాల్లోనే వెళ్లాలని ఈనెల 27న నోటీసు ఇ చ్చిన పోలీసులు సోమవారం దానిని సవరించి 15 వాహనాలతో వెళ్లొచ్చని మరో నోటీసు జారీచేశారు. అయితే, ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటి వద్దకు ఎవరూ వెళ్లకూడదని, ఒక్క వైఎస్ జగన్ మాత్రమే వెళ్లాలంటూ నోటీసులు ఇవ్వడంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది.
గతంలో హెలిప్యాడ్‌కు అనుమతి ఇవ్వకుండా..
నిజానికి.. ఈనెల 3న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటన ఖరారైనప్పటికీ హెలిప్యాడ్‌కు స్థల అనుమతులు కూడా ఇవ్వకుండా టీడీపీ కూటమి నేతలు అడ్డంకులు సృష్టించారు. ప్రైవేటు స్థలంలో హెలికాప్టర్ దిగేందుకు స్థల యజమాని ఒప్పుకున్నా.. కూటమి నేతలు వారిని భయపెట్టి స్థలం ఇవ్వనీయకుండా అడ్డుకున్నారు.
పోలీసులు సైతం హెలిప్యాడ్‌కు అనుమతులివ్వకుండా ఇబ్బందిపెట్టారు. ఈ నేపథ్యంలో.. స్థానిక ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి హెలిప్యాడ్‌ను అనుమతివ్వాలని న్యాయస్థానానికి వెళ్లడంతో అప్పట్లో జగన్ పర్యటన వాయిదా పడింది. ఈసారి ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పర్యటన ఆపేదిలేదని తెగేసి చెప్పడంతో పోలీసులు కఠినమైన ఆంక్షలు పెట్టి అనుమతులిచ్చారు.
ప్రజాభిమానాన్ని అడ్డుకునేందుకే..
ఇదిలా ఉంటే.. ఏడాదిలోనే టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతోంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించకుండా తప్పుచేశామన్న భావన ప్రజల్లో బలంగా ఏర్పడడంతో ఆయన ఎక్కడకెళ్లినా ప్రజలు స్వచ్ఛందంగా తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఊహించని స్థాయిలో జనం రావడాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేకే ఆ ప్రజాభిమానాన్ని అడ్డుకునేందుకు జగన్ పర్యటనలకు ఇలా ఆంక్షలు విధిస్తూ.. కుట్రలు పన్నుతోంది.