AP Govt Releases New PRC Implementation - Sakshi
Sakshi News home page

AP: పీఆర్సీ సవరణ జీవోలు విడుదల

Feb 20 2022 5:53 PM | Updated on Feb 21 2022 8:19 AM

AP Govt Releases New PRC Implementation - Sakshi

సాక్షి, అమరావతి: ఉద్యోగుల ఆకాంక్షల మేరకు పీఆర్సీ అమలుకు సంబంధించి సవరించిన జీవోలను ప్రభుత్వం విడుదల చేసింది. మంత్రుల కమిటీతో జరిగిన చర్చల్లో ఉద్యోగ సంఘాలు చేసుకున్న ఒప్పందం ప్రకారం హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, పెన్షనర్ల అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌లో మార్పులు చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఆదివారం ఐదు వేర్వేరు జీవోలు జారీ చేశారు. ఇంటి అద్దె అలవెన్స్‌ల శ్లాబులను 10, 12, 16, 24 శాతానికి సవరిస్తూ తాజా ఉత్తర్వులు ఇచ్చారు. పెన్షనర్లకు అదనపు పెన్షన్‌ను 70 సంవత్సరాల నుంచే ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గత జీవోల్లో రద్దు చేసిన సీసీఏ (సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్‌)ను మంజూరు చేశారు. తాజా జీవోలన్నీ ఈ ఏడాది జనవరి 1 నుంచే అమల్లోకి వస్తాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

చర్చల్లో అంగీకారం మేరకు మార్పులు 
11వ పీఆర్సీ ప్రకారం 2022 పే స్కేల్స్‌ అమలుకు సంబంధించి గత నెలలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్త్వర్వులపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో వారు లేవనెత్తిన అంశాలను ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు ప్రభుత్వం మంత్రుల కమిటీని నియమించిన విషయం తెలిసిందే.  
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కూడిన ఈ కమిటీ జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో సభ్యులుగా ఉన్న ఉద్యోగ సంఘాల నేతలతో రెండు రోజులపాటు విస్తృతంగా చర్చలు జరిపింది.  

కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ ఉద్యోగులకు ఇంకా ప్రయోజనాలు చేకూర్చాలని సీఎం ఆలోచిస్తున్నా, చేయలేని పరిస్థితి ఉందని ఈ కమిటీ ఉద్యోగ సంఘాలకు క్షుణ్ణంగా వివరించింది. ఉద్యోగ సంఘాల నేతలు లేవనెత్తిన ప్రతి అంశాన్ని చర్చించింది. ఉద్యోగులకు మేలు జరిగేలా హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు, సీసీఏ పునరుద్ధరణ, అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌లో ప్రభుత్వానికి పలు మార్పులు చేయాలని సూచించింది. సీఎం జగన్‌ ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. వీటిపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉద్యోగ సంఘాల నాయకులు ఒక ఒప్పందం చేసుకున్నారు.  

ఆ తర్వాత సీఎం వైఎస్‌ జగన్‌ ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై ఉద్యోగులకు ఇంకా ఎక్కువ మేలు చేయాలని ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల కారణంగా చేయలేని పరిస్థితి ఉందని, ఈ ప్రతిపాదనలకు ఒప్పుకున్నందుకు వారిని అభినందించారు. ఈ నేపథ్యంలో 11వ పీఆర్సీ అమలుకు సంబంధించి సవరించిన జీవోలు జారీ అయ్యాయి.  
 

మార్పుల అమలు ఇలా.. 
కొత్త పీఆర్సీ ప్రకారం ఇప్పటికే జీతాలు చెల్లించడంతో ఈ సవరణల ఆధారంగా ఉద్యోగుల జీతాల్లో మార్పులు చేసే అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్లు ఇచ్చే నోటిఫికేషన్‌ ప్రకారం ఆ పట్టణాలు, నగరాల్లోని 8 కిలోమీటర్ల పరిధి వరకు సవరించిన హెచ్‌ఆర్‌ఏ రేట్లు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. 
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటు స్థానిక సంస్థలు, ఎయిడెడ్‌ సంస్థలు, ఎయిడెడ్‌ పాలిటెక్నిక్‌ సంస్థలకు సవరించిన హెచ్‌ఆర్‌ఏ రేట్లు వర్తిస్తాయని పేర్కొన్నారు. సచివాలయ, హెచ్‌ఓడీ కార్యాలయ ఉద్యోగులకు 2024 జూన్‌ వరకు సవరించిన హెచ్‌ఆర్‌ఏ అమలవుతుందని స్పష్టం చేశారు.  
సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాలు, విశాఖ, విజయవాడ నగరాలు, 11 మున్సిపల్‌ కార్పొరేషన్లలో సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్‌ (సీసీఏ)ను పునరుద్ధరించింది. ఇది 2022 జనవరి 1 నుంచి అమలవుతుంది. 


70 ఏళ్లు దాటిన వారికి 7 శాతం, 75 ఏళ్లు దాటిన వారికి 12 శాతం, 80 ఏళ్లు పైన 20 శాతం, 85 ఏళ్లు దాటితే 25 శాతం, 90 ఏళ్లు దాటితే 30 శాతం, 95 ఏళ్లు దాటితే  35 శాతం, 100 ఏళ్లు దాటితే 50 శాతం అదనపు క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ ఇవ్వాలని నిర్ణయించింది. మానిటరీ బెనిఫిట్స్‌ 2020 ఏప్రిల్‌ 1 నుంచి వర్తిస్తాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement