ఆయకట్టంతా తడిచేలా | AP Govt Ready To Provide Water To The Farms Under The Srisailam Project | Sakshi
Sakshi News home page

ఆయకట్టంతా తడిచేలా

Aug 31 2020 7:52 AM | Updated on Aug 31 2020 7:52 AM

AP Govt Ready To Provide Water To The Farms Under The Srisailam Project - Sakshi

నిండుకుండలా ఉన్న శ్రీశైలం జలాశయం

సాక్షి, అమరావతి: శ్రీశైలం జలాశయంపై ఆధారపడ్డ ప్రాజెక్టులను నింపి రికార్డు స్థాయిలో ఆయకట్టుకు నీళ్లందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తెలుగుగంగలో అంతర్భాగమైన వెలిగోడు ప్రాజెక్టు ఇప్పటికే నిండింది.  బ్రహ్మం సాగర్‌తోపాటు ఎస్సార్‌1, ఎస్సార్‌2, సోమశిల, కండలేరు ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. గాలేరునగరిలో అంతర్భాగమైన గోరకల్లు రిజర్వాయర్‌ నిండుకుండలా మారింది. అవుకు, గండికోట, మైలవరం, పైడిపాలెం, వామికొండసాగర్, సర్వారాయ సాగర్, సీబీఆర్‌(చిత్రావతిబ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌)లలోకి వరద ప్రవాహం చేరుతోంది. ఈ ప్రాజెక్టులన్నీ నిండాలంటే మరో 130 టీఎంసీలు అవసరం. 
సాధారణంగా సెప్టెంబరులో కృష్ణా, పెన్నా, కుందూ పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. గతేడాదిమాదిరిగా ఈసారి కూడా వీటికి వరద వస్తుందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లోని ప్రాజెక్టులన్నీనిండే అవకాశాలుండటం రైతుల్లో ఆనందాలను నింపుతోంది.
కృష్ణమ్మ పరవళ్లతో  శ్రీశైలం, నాగార్జునసాగర్‌లు ఇప్పటికే నిండిపోయాయి. పులిచింతలలో వరుసగా రెండో ఏడాదీ గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేశారు.
శ్రీశైలంలో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా తెలుగుగంగ, గాలేరునగరి, ఎస్సార్బీసీ(శ్రీశైలం కుడి గట్టు కాలువ)లకు పూర్తి సామర్థ్యం మేరకు నీటిని విడుదల చేస్తున్నారు.
తెలుగగంగలో భాగమైన వెలిగోడు ప్రాజెక్టులో గరిష్ఠ స్థాయిలో 16.95 టీఎంసీలను నిల్వ చేశారు. ఎస్సార్‌–1లో 2.13 టీఎంసీలకుగానూ 1.41, ఎస్సార్‌–2లో 2.44 టీఎంసీలకుగానూ 1.65 టీఎంసీలు చేరాయి. బ్రహ్మంసాగర్‌ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.74 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.36 టీఎంసీలకు చేరుకుంది. 
గోరకల్లు  పూర్తి నిల్వ సామర్థ్యం 12.44 టీఎంసీలు కాగా ప్రస్తుతం నిల్వ 9.96 టీఎంసీలకు చేరుకుంది. అవుకు జలాశయంలో 4.14 టీఎంసీలకుగానూ 3.40 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల్లోకి వరద  చేరుతోంది. గండికోట రిజర్వాయర్‌ గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.516 టీఎంసీలు ఉన్నాయి. సీబీఆర్, వామికొండసాగర్, సర్వారాయసాగర్, పైడిపాలెం రిజర్వాయర్‌లు నిండటానికి ఇంకా 15 టీఎంసీలు అవసరం.
నెల్లూరు జిల్లా సోమశిల రిజర్వాయర్‌లో 78 టీఎంసీలకుగానూ 42.89 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. కండలేరులో 68.03 టీఎంసీలకుగానూ 22.91 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. వరద కొనసాగుతోంది.
శ్రీశైలం నుంచి హంద్రీ–నీవా సుజల స్రవంతి ద్వారా నీటిని తరలిస్తున్నారు. పత్తికొండ, కృష్ణగిరి, జీడిపల్లి రిజర్వాయర్‌లలో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకుంది. గొల్లపల్లి, మారాల, చెర్లోపల్లి, అడవిపల్లి తదితర రిజర్వాయర్లు నిండాల్సి ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement