AP: విరామ వేళ.. వలకు భరోసా | Sakshi
Sakshi News home page

AP: విరామ వేళ.. వలకు భరోసా

Published Mon, Apr 15 2024 12:19 PM

AP Govt Provide Fnancial Aistance Under YSR Matsya Bharosa To Fsherman Fmilies - Sakshi

సముద్రంలో చేపల వేటపై నేటి నుంచి నిషేధం


జూన్‌ 14 అర్ధరాత్రి వరకు అమలు 


మత్స్యకారులను ఆదుకోనున్న ప్రభుత్వం 


వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కింద ఒక్కో కుటుంబానికి రూ.10వేల సాయం 


బోట్లు, మత్స్యకారుల గుర్తింపునకు సిద్ధమైన అధికారులు 

సాక్షి, మచిలీపట్నం: సముద్ర జలాలపై సాగించే చేపల వేటకు విరామం లభించింది. గంగపుత్రులు రెండు నెలల పాటు తమ వలలకు విశ్రాంతి ప్రకటించనున్నారు. మత్స్యసంపద పెరిగే కాలం కావడంతో 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటపై ప్రభుత్వం నిషేధం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో చేపల వేట సాగించే మత్స్యకారులు నిషేధ కాలంలో ఇంటి పట్టునే ఉండనున్నారు. దీంతో వీరికి ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ మత్స్య భరోసా కింద ఆర్థిక సహాయం అందించనుంది. దీనికి సంబంధించి ఆ శాఖ అధికారులు ఇప్పటికే చర్యలు చేపట్టారు. 

61 రోజులు బ్రేక్‌.. 
సముద్రంలో చేపల పునరుత్పత్తి సమయం కావడంతో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బంగాళాఖాతంలో వేటకు విరామం ఇవ్వాలి. ఏటా ఏప్రిల్‌ 15వ నుంచి నిషేధం అమలు చేస్తున్నారు. తూర్పు తీరంలోని పశి్చమ బెంగాల్‌ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకూ సముద్రంలో చేపల వేటపై నిషేధం ఆదివారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తుంది. జూన్‌ 14వ తేదీ అర్ధరాత్రి వరకూ (61 రోజులు) ఇది అమల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి చేపల వేట నిషేధం అమలుకు పోలీసుల సహకారంతో మత్స్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జిల్లాలోని మత్స్యకారులు సముద్రంలో వేట ముగించుకుని తమ బోట్లతో ఒడ్డుకు చేరుకున్నారు. 

వేట విరామ భృతి.. 
సముద్రంలో చేపల వేటపై నిషేధం కారణంగా ఉపాధి కోల్పోనున్న మత్స్యకారులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేట విరామ భృతిని అందిస్తోంది. ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున సాయం చేస్తోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వేట నిషేధ భృతి కేవలం రూ.4 వేలు మాత్రమే ఉండగా దీనిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూ.10వేలకు పెంచి, వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పేరిట 2019 నుంచి అందిస్తోంది. ఈ ఏడాది కూడా సాయం అందించేందుకు మత్స్యశాఖ అధికారులు చేపల వేట సాగించే బోట్లకు ఫొటోలు తీసుకుని, లబి్ధదారుల వివరాలు నమోదు చేసే చర్యలు చేపట్టనున్నారు. 

కృష్ణా జిల్లా వివరాలు.. 
సముద్ర తీరప్రాంత మండలాలు: మచిలీపట్నం, నాగాయలంక, కృత్తివెన్ను, కోడూరు 
♦ సముద్ర తీరం: సుమారు 111 కిలోమీటర్లు 
♦ మత్స్యకార ఆవాసాలు : 64 
♦ మత్స్యకారుల జనాభా: 85వేలు 
♦ సముద్రంలో చేపల వేట సాగిస్తున్న వారు: 12వేలు 
మొత్తం బోట్లు : 2,256 
♦ వీటిలో మెకనైజ్డ్‌ బోట్లు : 92 
♦ మోటరైజ్డ్‌ బోట్లు: 2,091 
♦ సంప్రదాయ బోట్లు : 73 
♦ ఏటా మత్స్య సంపద టర్నోవర్‌: 40,600 టన్నులు చేపలు, 11,390 టన్నుల రొయ్యలు 
♦ మత్స్య సంపద విలువ: సుమారు రూ.510కోట్లు 

సాయం చేసేందుకు గుర్తింపు.. 
వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పేరిట సాయం అందించేందుకు 18 మీటర్ల వరకూ పొడవు ఉన్న మెకనైజ్డ్‌ బోట్‌కు యజమాని మినహా 8 మందికి, మోటరైజ్డ్‌ బోట్లకు యజమానితో కలిపి ఆరుగురికి, సంప్రదాయ బోట్లకు ముగ్గురు చొప్పున మత్స్యకారులను అర్హులుగా ఎంపిక చేస్తారు. ప్రభుత్వ సాయం పొందేందుకు బోట్‌ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఫిషింగ్‌ లైసెన్స్, ఆధార్‌ కార్డు, రైస్‌ కార్డు, బ్యాంక్‌ అకౌంట్, సెల్‌ నంబర్‌ వివరాలను అందజేయాల్సి ఉంటుంది.


లబ్ధిదారుల గుర్తించే చర్యలు చేపట్టాం.. 
నేటి నుంచి సముద్రంలో చేపల వేటపై నిషేధం అమలులోకి వచ్చింది. మత్స్యకార భరోసా సాయం అందించేందుకు లబ్ధిదారులను గుర్తించేందుకు చర్యలు చేపట్టాం. వేట నిషేధాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే ఆంధ్రప్రదేశ్‌ మెరైన్‌ రెగ్యులేషన్‌ చట్టం–1994 ప్రకారం చర్యలు తీసుకుంటాం. చేపలు, పడవలు స్వాధీనం చేసుకుని జరిమానా విధిస్తాం. తీరంలో చేపలు అమ్మకాలు, ప్యాకింగ్‌ చేయరాదు. వేట నిషేధంపై మత్స్యకారులు, వ్యాపారులకు నోటీసులు అందించాం. వీటిపై అవగాహన కల్పిస్తున్నాం. 
– వి. శివ సాంబరాజ్యం, జిల్లా మత్స్యశాఖ అధికారి(జేడీఎఫ్‌), కృష్ణా జిల్లా  

Advertisement

తప్పక చదవండి

Advertisement