రక్తహీనతపై ఐరన్‌ అస్త్రం..

Ap Government to Reduce Anemia in Pregnant Women - Sakshi

ఆసుపత్రుల్లో ఉచితంగా ఐరన్‌ మాత్రల పంపిణీ 

అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషకాహారం అందజేత

విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న వైద్యులు

సాక్షి, కర్నూలు(హాస్పిటల్‌): ప్రపంచానికి అమ్మతనపు కమ్మదనాన్ని పరిచయం చేసే మహిళలు గర్భం దాల్చిన తర్వాత అనారోగ్యం బారిన పడుతున్నారు. రక్తహీనతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గర్భిణులందరికీ ఐరన్‌ మాత్రల పంపిణీ చేయాలని ఆదేశించింది. దీంతో ఈ కార్యక్రమాన్ని అధికారులు ముమ్మరం చేశారు. జిల్లాలో 2019–20లో 95.67శాతం, 2020–21లో 104.01శాతం మందికి ఐరన్‌ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు పంపిణీ చేశారు. అంతేకాకుండా 2020–21లో 98.03శాతం మంది గర్భిణులకు ధనుర్వాతం రాకుండా ముందుగానే టెటనస్‌ టాక్సిడ్‌ ఇంజెక్షన్లు కూడా ఇచ్చారు.  

సమస్య ఎందుకు వస్తుందంటే.. 
గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు కుటుంబ సభ్యులందరూ భోజనం చేసిన తర్వాత ఆహారాన్ని తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో తినకపోయినా తిన్నామని చెబుతూ మంచినీళ్లు తాగి కాలం వెళ్లదీస్తుంటారు. ఫలితంగా వారిలో రక్తహీనత పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. కొందరు అవగాహన లేక పోషకాహారానికి దూరంగా ఉంటున్నారు. వీరు గర్భం దాల్చిన సందర్భంలో రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం తక్కువగా ఉంటోంది.  

ప్రభుత్వం ఏం చేస్తుందంటే.. 
జిల్లాలో 16 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 3,486 అంగన్‌వాడీ కేంద్రాలు, 63 మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులకు పోషకాహారం పంపిణీతో పాటు ఐరన్‌మాత్రలు ఇస్తున్నారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల్లో వైద్యపరీక్షలు చేసి అవసరమైన మందులు ఇస్తున్నారు. హైరిస్క్‌ గర్భిణులతో పాటు మొదటిసారి గర్భం దాల్చిన వారిపై ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రసవం అయ్యేలోపు నాలుగుసార్లు వైద్యుల వద్ద పరీక్షలు చేయిస్తున్నారు. గర్భిణులకు వైద్యసేవలు అందించేందుకు జిల్లాలో 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, 26 అర్బన్‌హెల్త్‌ సెంటర్‌లు, నంద్యాలలో జిల్లా ఆసుపత్రి, ఆదోనిలో మాతాశిశు ఆసుపత్రి, కర్నూలులో ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఉన్నాయి.  

రక్తహీనతతో ఇబ్బందులు ఇవీ.. 
రక్తహీనతతో గర్భంలో శిశువు ఎదుగుదల సరిగ్గా ఉండదు. అబార్షన్‌ అయ్యే అవకాశాలు ఎక్కువ. నెలలు నిండకుండానే బిడ్డ జన్మించి చనిపోవచ్చు. తల్లికీ టీబీ వచ్చే అవకాశం ఉంది. తల్లికి మూత్రపిండాలు, కాలేయం దెబ్బతినే అవకాశం ఎక్కువ. బీపీ ఎక్కువైతే మెదడులో నరాలు చిట్లవచ్చు. కొన్నిసార్లు తల్లి, బిడ్డ మానసిక స్థితి సరిగ్గా ఉండకపోవచ్చు. సాధారణ మహిళతో పాటు గర్భిణులకు హిమోగ్లోబిన్‌ ఎప్పుడూ 10 శాతం పైగానే ఉండేటట్లు చూసుకోవాలి.   

ఐరన్‌ ఫోలిక్‌ మాత్రల ప్రయోజనం ఇదీ.. 
రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం 8 నుంచి 10 గ్రాములు ఉంటే కొంచెంగా, 6 నుంచి 8 గ్రాములుంటే  మధ్యస్తంగా, 6 కంటే తక్కువగా ఉంటే  తీవ్రమైన రక్తహీనతగా వైద్యులు చెబుతారు. 8 నుంచి 10 శాతం ఉన్న వారికి ఐరన్‌ ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు, 6 నుంచి 8 గ్రాములు ఉన్న వారికి ఐరన్‌ సుక్రోజ్‌ ఇన్‌ఫ్యూజన్‌ ఇంజెక్షన్లు ఇస్తారు. 6 కంటే తక్కువ ఉన్న వారికి మాత్రం రక్తం ఎక్కిస్తారు. గర్భిణులు మూడో నెల నుంచే ఐరన్‌ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు క్రమం తప్పకుండా వాడాలి. లేకపోతే వారు తీవ్ర రక్తహీనతకు చేరి తల్లీబిడ్డలిద్దరికీ ప్రాణాపాయం సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top