గత ప్రభుత్వ కరెంట్‌ షాక్‌..రూ.39,280 కోట్లు

AP Government Committee Recommendation for Review of Past Govt PPAs - Sakshi

64 పీపీఏలపై అనుమానపు నీడలు

కొన్ని సంస్థలకు ఏకంగా 32% లబ్ధి

ఇతర రాష్ట్రాల్లో పోటీ బిడ్డింగ్‌

ఏపీలో మాత్రం అడ్డగోలుగా ఒప్పందాలు

కాగ్‌ నివేదికతో వెలుగు చూస్తున్న వాస్తవాలు

పీపీఏల పునఃపరిశీలనకు ప్రభుత్వ కమిటీ సిఫార్సు

సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వం విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) విషయంలో కేవలం కొన్ని కంపెనీలకే ప్రాధాన్యతనివ్వడం డిస్కమ్‌ (విద్యుత్‌ పంపిణీ సంస్థలు)ల నష్టానికి కారణమైంది. దీనిపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నియమించిన కమిటీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. తాజాగా కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక కూడా పీపీఏల వల్ల జరిగిన నష్టాన్ని ప్రస్తావించింది. 2015 తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సౌర, పవన విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు భారీగానే ఉన్నాయి. వీటి విలువ ఏకంగా రూ.39,280 కోట్లు. నాడు పవన, సౌర విద్యుత్‌ ధరలు తగ్గుతాయని ఇతర రాష్ట్రాలు ముందుగానే గుర్తించాయి. రాష్ట్ర విద్యుత్‌ అధికారులు కూడా అప్పటి టీడీపీ ప్రభుత్వం దృష్టికి ఇదే అంశాన్ని తీసుకెళ్లారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం దీన్ని పెడచెవిన పెట్టింది.

మిగతా రాష్ట్రాలన్నీ బిడ్డింగ్‌లకు వెళ్తున్నా ఏపీ మాత్రం జనరిట్‌ టారిఫ్‌ (నిర్దేశించిన టారిఫ్‌ మేరకు) ఇచ్చింది. అదీ కూడా టీడీపీ ప్రభుత్వ పెద్దలతో ఏదో రకంగా సంబంధం ఉన్న కంపెనీలే కావడం అనుమానాలకు తావిస్తోంది. ఉదాహరణకు గ్రీన్‌కో అనే సంస్థ రూ.12,672 కోట్ల విలువైన 16 ఒప్పందాలు చేసుకోగా.. ఈ మొత్తంలో ఏకంగా గ్రీన్‌కోకు 32 శాతం వాటా కట్టబెట్టారు. అలాగే రెన్యూ అనే సంస్థ రూ.8,513 కోట్ల విలువైన 15 ఒప్పందాలు చేసుకోగా.. ఈ మొత్తంలో ఆ సంస్థకు 22 శాతం లబ్ధి చేకూరింది. ఈ నేపథ్యంలో మొత్తం 133 పవన విద్యుత్‌ పీపీఏలపై సవివరమైన సమాచారాన్ని డిస్కమ్‌లు.. ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి అందించాయి.

ఇందులో రూ.5,548 కోట్ల విలువైన 64 విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నియమించిన కమిటీ పునఃపరిశీలించాలని కోరింది. ప్రస్తుత మార్కెట్‌ ధరలకు అనుగుణంగా పవన విద్యుత్‌కు యూనిట్‌కు రూ.2.43 చొప్పున చెల్లిస్తే సరిపోతుందని పంపిణీ సంస్థలు అంటున్నాయి. ఇలా చేస్తే ఉత్పత్తిదారులకు ఏమాత్రం నష్టం కూడా ఉండదు. పైగా ప్రైవేటు సంస్థలకు చెల్లించే రూ.39,280 కోట్ల ప్రజాధనాన్ని రూ.20 వేల కోట్లకు కుదించే వీలుంది. అంటే.. దాదాపు రూ.19 వేల కోట్లకుపైగా ప్రజాధనం వృథా కాకుండా చేసే వీలున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. 

కేంద్రం చెప్పిందీ వినలేదు..
పవన, సౌర విద్యుత్‌ కొనుగోళ్ల విషయంలో కేంద్రం పెట్టిన లక్ష్యం ఒకటైతే.. 2015 నుంచి టీడీపీ ప్రభుత్వం చేసింది మరొకటి. 2015–16లో విద్యుత్‌ వినియోగంలో 5 శాతం మాత్రమే సంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి తీసుకోవాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించింది. కానీ ఏపీ మాత్రం ఏకంగా 5.59 శాతం మేర పీపీఏలు చేసుకుంది. 2016–17లో 8.6 శాతం,  2017–18లో 9 శాతం లక్ష్యమైతే 19 శాతం, 2018–19లో 11 శాతం లక్ష్యమైతే 23.4 శాతం తీసుకుంది. 2016–17 నుంచి 2018–19 మధ్య కాలంలో 6,190 మిలియన్‌ యూనిట్ల పవన, సౌర విద్యుత్‌ తీసుకోవాల్సి ఉండగా.. దీనికి రెట్టింపునకు పైగా 13,142 మిలియన్‌ యూనిట్లు తీసుకుంది.

దేశంలో పవన విద్యుత్‌ ధరలు పడిపోతే.. మన రాష్ట్రంలో మాత్రం యూనిట్‌కు రూ.4.84 చొప్పున 25 ఏళ్లకు పీపీఏలు చేసుకున్నారు. 2014లో ఎలాంటి బిడ్డింగ్‌ లేకుండానే సోలార్‌ విద్యుత్‌కు యూనిట్‌ రూ.5.25 నుంచి రూ.6.99 చొప్పున ఏకంగా 649 మెగావాట్ల మేర చంద్రబాబు ప్రభుత్వం పీపీఏలు చేసుకుంది. ఈ ధరను కూడా ఏటా 3 శాతం పెంచేలా ఒప్పందాలు కుదుర్చుకుంది. అంటే.. పదేళ్ల తర్వాత యూనిట్‌ విద్యుత్‌ ధర ఏకంగా రూ.9 వరకూ వెళ్లే అవకాశం ఉంది. 2017లో రాజస్తాన్‌లో బిడ్డింగ్‌లో సోలార్‌ ధర యూనిట్‌ రూ.2.44కు పడిపోయింది. ఏపీ మాత్రమే పీపీఏలు ఉండటం వల్ల యూనిట్‌కు రూ.6.99 వరకూ చెల్లించాల్సి వస్తోంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top