Buggana Rajendranath: ‘టీడీపీ హయాంతో పోలిస్తే మేం చేసిన అప్పులు చాలా తక్కువ’

AP Finance Minister Buggana Said Misinformation Is Spread About Debt - Sakshi

న్యూఢిల్లీ: ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించే దురుద్దేశంతో రాష్ట్ర అప్పులపై దుష్ప్రచారం జరుగుతోందన‍్నారు ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌. వివిధ రాష్ట్రాల అప్పులపై పార్లమెంటులో ప్రశ్న అడిగితే.. అదేదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాత్రమే అడిగినట్టుగా చిత్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అప్పులు ఎక్కువగా చేశారని గుర్తు చేశారు మంత్రి. అనవసర అప్పులు ఆ కాలంలోనే ఎక్కువగా జరిగాయన్నారు.

‘మా ప్రభుత్వ హయాంలో అప్పులు చేశాము. అయితే టీడీపీ ప్రభుత్వ హాయంతో పోల్చితే మేము చేసిన అప్పుల శాతం చాలా తక్కువ. కర్ణాటకలో సగటున ఏడాదికి అప్పుల భారం రూ. 60 వేల కోట్లు, తమిళనాడులో రూ.1 లక్ష కోట్ల అప్పు పెరిగింది. జనాభా దామాషా ప్రకారం చూసినా, మరే విధంగా చూసినా ఏపీ అప్పుల తీరు చాలా తక్కువ. స్థూల ఉత్పత్తిలో పోల్చితే ఈ అప్పులు ఏ విధంగా ఎక్కువ? నిజానికి మా హయాంలో చేసిన అప్పులు స్థూల ఉత్పత్తితో పోల్చితే తక్కువే. ఏడాదికి 15%-16% వరకు అప్పు పెరిగితే, మిగతా రాష్ట్రాల్లో 20% వరకు పెరిగింది. 

ద్రవ్యలోటు 2014లో 3.95% ఉంటే,  2021-22లో 3% కి తగ్గించాము. పొరుగు రాష్ట్రాలు 4% కంటే ఎక్కువ ద్రవ్యలోటు కలిగి ఉన్నాయి. ఒక్క ఏపీ మాత్రమే అప్పు చేసినట్టు చిత్రీకరిస్తున్నారు. యావద్దేశ అప్పు శాతం పెరిగింది. కోవిడ్-19 పరిస్థితుల కారణంగా ఇలా జరిగింది.’​‍ అని స్పష్టం చేశారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌. 

ఇదీ చదవండి: మంత్రి బుగ్గన వేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరా?

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top