
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాకాలో పచ్చనేత భూకబ్జా నేపథ్యం
న్యాయం చేయాలంటూ సిపాయి సెల్ఫీ వీడియో
సాక్షి, టాస్క్‌ఫోర్స్: దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తుంటే, తన భూమిని ఓ రాజకీయ నాయకుడు కబ్జా చేస్తున్నాడని, ఇందుకు అడ్డుగా ఉన్నాడని తన తండ్రిపై దాడి చేశారని పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో ఓసైనికుడు పోస్టు చేసిన ఒక సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని తెలుగు తమ్ముళ్ల అడ్డగోలు వ్యవహారాలకు ఈ వీడియో అద్దంపడుతోంది.
‘ముఖ్యమంత్రికి.. నా పేరు బీఎన్ ప్రసాద్. మాది చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, కదిరివోబనపల్లి గ్రామం. నేను పదేళ్లుగా దేశానికి సైనిక సేవలు అందిస్తున్నాను. మీరు మా గ్రామంలో కొత్తగా నిర్మించిన ఇంటికి ఎదురుగా మాకు ఒక ఎకరం ఇరవై సెంట్ల భూమి ఉంది. ఇందులోనే 15 సెంట్ల భూమిని రాజకీయ నాయకుడైన సుందరప్ప ఆక్రమించుకుని రీసర్వేలో నమోదు చేసుకుని అతని భార్యకు రిజిస్ట్రేషన్ చేశాడు’ అని వాపోయాడు. తన సమస్యపై దృష్టి సారించిన అధికారులు సర్వే చేసి తనకు రావాల్సిన 15 సెంట్లకు ఫెన్సింగ్ వేసినట్లు తెలిపారు. అయితే శనివారం ఉదయం తన తండ్రి బి.నారాయణప్ప పొలంలో పనిచేసేందుకు వెళ్లగా సుందరప్ప, ఆయన కుటుంబ సభ్యులు దాడిచేసినట్లు పేర్కొన్నాడు.
సుందరప్పకు ‘దేశం’ అండా‘దందా’..
సుందరప్ప టీడీపీలో కీలక నాయకుడు. భార్య నారాయణమ్మ స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేశారు. కుమారుడు బీరేష్ పంచాయతీ పార్టీ అధ్యక్షుడు. చంద్రబాబు ఇంటి నిర్మాణ పనుల్లోనూ వీరు చురుగ్గా పాల్గొన్నారు. దీంతో పైస్థాయి పార్టీ నేతలతో పరిచయాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో పరిష్కారమైన భూ వివాదాన్ని మళ్లీ తిరగదోడుతూ సుందరప్ప దాడులకు పాల్పడుతున్నాడని సమాచారం. సుందరప్ప కుటుంబంతో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని 2024 ఆగస్టులో ఇదే సైనికుడు ప్రసాద్ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాడు. దీనిపై కుప్పం పోలీసులు అప్పట్లో విచారణ జరిపి ఆ కుటుంబం జోలికి వెళ్లవద్దని హెచ్చరించారు. కానీ ఇప్పుడు ఈ భూమికి ఎదురుగా సీఎం గృహప్రవేశం జరగటం, పలమనేరు–కృష్ణగిరి రోడ్డు నాలుగు లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేయనుండటంతో రియల్టీ బూమ్ ఏర్పడింది. దీంతో మళ్లీ సుందరప్ప తన భూకబ్జా కుట్రలకు పదునుపెట్టాడు.
