అంతర్వేది సాగర తీరం.. విభిన్న స్వరూపం!

Antarvedi coastline undergoing different changes - Sakshi

ఓ చోట ముందుకు.. మరోచోట వెనక్కు వెళుతున్న సముద్రం

సఖినేటిపల్లి: తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది సాగర తీరం భిన్నమైన మార్పులను సంతరించుకుంటున్నది. గురువారం బీచ్‌లో సుమారు 200 మీటర్ల మేర ముందుకొచ్చిన సముద్రం, అన్నాచెల్లెలు గట్టు వద్ద లైట్‌హౌస్‌ నుంచి సమారు కిలోమీటరు మేర లోపలికి వెళ్లింది. బీచ్‌లో అలల తీవ్రతతో సంద్రం ఉగ్రరూపంతోనూ, గోదావరి, సముద్రం కలిసే అన్నాచెల్లెలు గట్టు వద్ద సంద్రం తక్కువ అలల తీవ్రతతో ప్రశాంతంగా ఉంది. అన్నాచెల్లెలు గట్టు ప్రాంతంలో సముద్రం ఎంత ముందుకు వస్తుందో అంత వెనక్కి వెళ్లిపోవడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కనుచూపు మేర ఇక్కడ తీరం ఖాళీగా ఆటస్థలంగా కనిపిస్తున్నది.

అమావాస్య, పౌర్ణమి ప్రభావాలతో ఆటు పోటులకు బీచ్‌ వద్ద ఒకలా, అన్నాచెల్లెలు గట్టు వద్ద మరొకలా ఎగసి పడుతున్న కెరటాలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన భూకంపం వల్ల సముద్ర గర్భంలో వచ్చిన అలజడి ప్రభావమే ఇందుకు కారణమై ఉంటుందని అధికారులు విశ్లేషిస్తున్నారు. బీచ్‌లో పరిస్థితులను తహసీల్దారు వై.రామకుమారి, మెరైన్‌ సీఐ బొక్కా పెద్దిరాజు, ఎస్‌ఐలు రవివర్మ, సోమశేఖర్‌రెడ్డి, సిబ్బంది బీచ్‌లో భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. 
అన్నాచెల్లెలు గట్టు వద్ద లైట్‌హౌస్‌ నుంచి కిలోమీటరు లోపలికి వెళ్లిన సముద్రం  

ప్రమాదం ఏమీలేదు
అంతర్వేది వద్ద సముద్రం రెండు కిలోమీటర్లు వెనక్కి వెళ్లడం వల్ల ప్రమాదం ఏమీ ఉండదు. ముంబై, గుజరాత్, గోవా వంటి ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతుంటాయి. అంతర్వేది విషయానికి వచ్చేసరికి సముద్రపు భూభాగం సమాంతరంగా (ఫ్లాట్‌గా) ఉండడమే కారణం. సగటున కేవలం 4 అడుగుల ఎత్తులో  భూభాగం ఉండడం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి.  
– మురళీకృష్ణ, ప్రొఫెసర్, ఎన్విరాన్‌మెంటల్, డైరెక్టర్, జేఎన్‌టీయూ కాకినాడ  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top