ఆధారసహితం.. అంజనాద్రే హనుమ జన్మస్థలం

Anjanadri Itself Lord Hanuman Birth Place Historical researchers - Sakshi

స్పష్టం చేసిన పండితులు, చారిత్రక పరిశోధకులు

ముగిసిన రెండు రోజుల అంతర్జాతీయ వెబినార్‌

యూనివర్సిటీ క్యాంపస్‌ (తిరుపతి): తిరుమలలోని అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలమని పురాణాలు, శాసనాలు, భౌగోళిక ఆధారాలన్నీ స్పష్టంగా చెబుతున్నాయని, ఈ విషయంలో ఆలోచించాల్సిందేమీ లేదని పలువురు పీఠాధిపతులు, పండితులు, చారిత్రక పరిశోధకులు తేల్చిచెప్పారు. టీటీడీ శ్రీవేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో ‘హనుమంతుని జన్మస్థలం అంజనాద్రి’ అంశంపై నిర్వహించిన రెండురోజుల అంతర్జాతీయ వెబినార్‌ శనివారం ముగిసింది. తిరుమల క్షేత్రంలో అంతర్భాగమైన అంజనాద్రి పర్వతమే ఆంజనేయస్వామి జన్మస్థలమని, ఆళ్వారుల పాశురాల్లోని వైష్ణవ సాహిత్యం ద్వారా తెలుస్తోందని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు చక్రవర్తి రంగనాథన్‌ తెలిపారు. ‘వైష్ణవ సాహిత్యంలో తిరుమల–అంజనాద్రి’ అంశంపై మాట్లాడుతూ ఆళ్వారులు రచించిన 4 వేల పాశురాల్లో 207 పాశురాలు తిరుమల క్షేత్ర వైభవాన్ని, అందులో 12 పాశురాలు విశేషంగా ఆంజనేయస్వామి గురించి తెలుపుతున్నాయన్నారు.

పండిత పరిషత్‌ కార్యదర్శి డాక్టర్‌ ఆకెళ్ల విభీషణ శర్మ ‘భక్తి కీర్తనల్లో అంజనాద్రి’ అంశంపై ప్రసంగిస్తూ, అన్నమయ్య, పురంధర దాసులు, వెంగమాంబ లాంటి వాగ్గేయకారులు అంజనాద్రి గురించి కీర్తనల్లో ప్రస్తావించారన్నారు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు రాణి సదాశివమూర్తి ‘పురాణ భూగోళంలో హనుమంతుడు– అంజనాద్రి’ అంశంపై ఉపన్యాసిస్తూ, అంజనాద్రి దాస క్షేత్రమని, వేంకటాచల మహాత్మ్యం అనేది వివిధ పురాణాల సంకలనమన్నారు. 

సాహిత్య ఆధారాలు..
శ్రీవారి ఆలయ అర్చకులు అర్చకం రామకృష్ణ దీక్షితులు ‘సప్తగిరులలో అంజనాద్రి ప్రాముఖ్యం’పై మాట్లాడారు. కాలిఫోర్నియా నుంచి ప్రముఖ ఐటీ నిపుణులు పాలడుగు చరణ్‌ ‘సంస్కృత సాహిత్యంలో హనుమంతుడు’ అంశంపై ప్రసంగించారు. ఋగ్వేదం నుంచి వర్తమాన సాహిత్యం వరకు అన్ని పదాల్లో అంజనాద్రి హనుమంతుని జన్మస్థలమని నిరూపితమైందన్నారు. దానికి సాహిత్య ఆధారాలు ఉన్నట్లు వివరించారు.

అందుకే అంజనాద్రి అయ్యింది..
మధ్యప్రదేశ్‌ చిత్రకూట్‌లోని రామభద్రాచార్య ప్రత్యేక ప్రతిభావంతుల విశ్వవిద్యాలయం ఉపకులపతి జగద్గురు రామభద్రాచార్య, తిరువనంతపురంలోని ప్రభుత్వ సంస్కృత కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె.ఉన్నికృష్ణన్‌ మాట్లాడుతూ, తిరుమలలో అంజనాదేవి తపస్సు చేసి ఆంజనేయునికి జన్మ ఇచ్చినందువల్లే ఆ కొండకు అంజనాద్రి అని పేరొచ్చిందన్నారు. తెలంగాణ ప్రభుత్వ ముఖ్య ప్రజాసంబంధాల అధికారి వనం జ్వాలా నరసింహారావు, ముంబైకి చెందిన ప్రసిద్ధ కవి, ఆధ్యాత్మిక వేత్త సాంపతి సురేంద్రనాథ్‌ మాట్లాడారు. కర్ణాటక సోసలేలోని వ్యాసరాజ మఠాధిపతి విద్యా శ్రీశతీర్థ మహాస్వామి అనుగ్రహ భాషణం చేశారు. 

అంజనాద్రిని అభివృద్ధి చేస్తాం: ధర్మారెడ్డి
తిరుమల అంజనాద్రిలోని ఆంజనేయుడు జన్మించిన స్థలంలో ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేసి భక్తులు దర్శించుకునే సదుపాయాలు కల్పిస్తామని అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వెబినార్‌ అంశాలను జాతీయ సంసృత విశ్వవిద్యాలయంలో ఆయన మీడియాకు వెల్లడించారు. ఆంజనేయుని జన్మస్థలం అంజనాద్రి అని ఆధారాలతో త్వరలో ఒక గ్రంథం ముద్రించనున్నామన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top