బోటు నిండుగా ఆదాయం!

Andhra Pradesh Water Tourism On Profit Track After Covid 19 - Sakshi

రాష్ట్రంలో పుంజుకుంటున్న జల పర్యాటకం 

విభజన తర్వాత రికార్డు స్థాయిలో ఈ ఏడాది ఆదాయం 

ఇప్పటికే ఏపీటీడీసీకి రూ.6.25 కోట్లు... 

మార్చి చివరికి రూ.8.32 కోట్లకుపెరుగుతుందని అంచనా

రూ.2 కోట్లతో కొత్త బోట్ల కొనుగోలుకు కసరత్తు  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జల పర్యాటకం పరవళ్లు తొక్కుతోంది. గడిచిన ఏడేళ్లతో పోలిస్తే ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఏపీ పర్యా­టకాభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ)కు చెందిన 12 బోటింగ్‌ యూనిట్లలో వివిధ రకాలైన 41 బోట్లు నిత్యం సేవలందిస్తున్నాయి. పాపికొండలు, విజయవాడ, శ్రీశైలం బోటింగ్‌ పాయింట్లకు పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత రికా­ర్డు స్థాయిలో 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఇప్ప­టికే ఏపీటీడీసీ బోటింగ్‌ విభాగం ద్వారా రూ.6.25 కో­ట్లు ఆదాయం రాగా, మార్చి చివరి నాటికి రూ.8.­32కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.

కొత్తగా బోట్ల కొనుగోలు 
రూ.2కోట్ల వ్యయంతో కొత్త బోట్ల కొనుగోలుకు ఏపీటీ­డీసీ సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే అధికారులు టెం­డర్లు పిలవనున్నారు. 50సీటింగ్‌ సామర్థ్యం కలిగిన మూడు బోట్లను కొనుగోలు చేసి పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉన్న విజయవాడ, శ్రీశైలం యూనిట్లకు కేటాయించనున్నారు. ఔట్‌ బోర్డ్‌ బోట్లు, స్పీడ్, డీలక్స్, పెడల్‌ బోట్లను సైతం కొనుగోలు చేయనున్నారు. మరోవైపు నాగార్జున సాగర్‌లోని స్టీల్‌ జెట్టీకి కూ­డా మరమ్మతులు పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురానున్నారు.

కొత్త బోటింగ్‌ యూనిట్లపై దృష్టి 
ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రస్తుత బోటింగ్‌ యూనిట్లలో సేవలను మెరుగుపరచడంతోపాటు కొత్త యూనిట్లను నెలకొల్పడంపై దృష్టి సారిస్తోంది. ఇటీవల పోచవరం(పాపికొండలు), వైఎస్సార్‌ జిల్లాలోని పర్నపల్లిలో జల పర్యాటకాన్ని అందుబాటులోకి తెచి్చంది. రాష్ట్రంలోనే తొలిసారిగా పర్నపల్లిలో అమెరికన్‌ పాంటూన్‌ బోట్లను ప్రవేశపెట్టింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఈ కస్టమైజ్డ్‌ బోట్లు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అక్కడ గత నెలలో ఏకంగా రూ.8లక్షల వరకు ఆదాయం వచి్చంది. త్వరలో బ్రహ్మంసాగర్, దేవునికడపతోపాటు రాష్ట్రంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో కూడా బోట్లు నడిపేందుకు ఏపీటీడీసీ ప్రతిపాదనలు రూపొందిస్తోంది.

జల పర్యాటకానికి ఆదరణ పెరుగుతోంది. పర్యాటకులకు మెరుగైన సేవలందించేందుకు కొత్త బోట్లను సైతం కొనుగోలు చేస్తున్నాం. రాష్ట్ర విభజన తర్వాత ఇంత ఆదాయం ఎప్పుడూ రాలేదు. కొత్త బోటింగ్‌ పాయింట్లపైనా దృష్టి సారించాం. కరోనా తర్వాత ఇంత వేగంగా పుంజుకోవడం శుభపరిణామం. 
 – కె.కన్నబాబు, ఎండీ, ఏపీటీడీసీ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top