
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర కోస్తాలో అతి భారీ వర్షాలు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రైలు, రోడ్డు రవాణా మార్గాలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వాయువ్య దిశగా పయనించి రాగల 12 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
3వ తేదీ నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడే ఛాన్స్ ఉందని.. ఉత్తర కోస్తా-దక్షిణ ఒడిశా మధ్య తీవ్ర వాయుగుండం తీరం దాటనుంది. ఇవాళ విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, యానాం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. అల్లూరి, మన్యం, శ్రీకాకుళం, ఏలూరు, కృష్ణ, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.
రానున్న మూడు రోజులు ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వానలు పడనున్నాయని.. నాలుగు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. ఏపీలోని అన్ని పోర్టులకు మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ అయ్యింది.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రా గల 3 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. చెట్ల కింద నిలబడరాదని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
