సచివాలయ ఉద్యోగులపై ‘యోగా’ పిడుగు | Andhra Pradesh Secretariat employees serve as yoga trainers | Sakshi
Sakshi News home page

సచివాలయ ఉద్యోగులపై ‘యోగా’ పిడుగు

Jun 9 2026 5:39 AM | Updated on Jun 9 2026 5:39 AM

Andhra Pradesh Secretariat employees serve as yoga trainers

సచివాలయ ఉద్యోగులే యోగా ట్రైనర్లు  

ఒక్కొక్కరు కనీసం 40 మంది ప్రజల్ని యోగా చేసేందుకు రిజిస్ట్రేషన్‌ చేయాలి  

గ్రామ, వార్డు సచివాలయాలకు చంద్రబాబు సర్కారు ఆదేశాలు  

ఇప్పటికే పనిభారంతో సతమతమవుతున్న సిబ్బందికి మరో గుదిబండ

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న రకరకాల ఇంటింటి సర్వేలు, సంబంధం లేని పనుల కారణంగా  పని ఒత్తిడి పెరిగిందని ఆవేదన చెందుతున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై తాజాగా యోగాభారం పడింది. ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేసే భారాన్ని వారి నెత్తినపెట్టింది. దీనిపై ఇప్పటికే పలు జిల్లాల్లో సచివాలయాలకు ఆదేశాలు అందాయి. ప్రతి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగి యోగా ట్రైనర్‌గా నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

ట్రైనర్‌గా నమోదు చేసుకున్న ఒక్కొక్కరు కనీసం 40 మంది ప్రజలను యోగాంధ్రలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్‌ చేయాలని నిర్దేశించింది. ఒక్కో సచివాలయంలో 17 మంది యోగా ట్రైనర్లుగా నమోదవ్వాలని, అంతమంది సచివాలయ సిబ్బంది లేకపోతే ఆ గ్రామంలో యువకులను ట్రైనర్లుగా నమోదు చేయాలని సూచించింది. పొదుపుసంఘాల మహిళలతో పాటు ఉపాధి హామీ పథకం కూలీలు యోగా కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని పేర్కొంది.

రిజిస్ట్రేషన్‌ చేసిన 40 మందికి 20 వరకు రోజూ ఉదయం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు యోగా శిక్షణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ శిక్షణ కార్యక్రమాన్ని రోజూ ఫొటోలు తీసి ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన యోగాంధ్ర మొబైల్‌యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని స్పష్టం చేసింది. ఈ నెల 10, 11, 12 తేదీల్లో మండల స్థాయిలో జరిగే పోటీల్లో స్థానికులు పాల్గొనేలా చూడాలని పేర్కొంది. 21వ తేదీన సచివాలయ, మండల స్థాయిలోనూ స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

Advertisement
 
Advertisement
Advertisement