Andhra Pradesh: పాఠాలకు పక్కా క్యాలెండర్‌

Andhra Pradesh School Academic Calendar 2022 23 For PS, UPS, High Schools - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతి విద్యార్థినీ ప్రపంచ పౌరుడిగా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యం. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లతో ‘నాడు–నేడు’ కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా అభివృద్ధి చేస్తోంది. అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక వంటి పథకాలతో విద్యార్ధుల చదువుకు ప్రోత్సాహకాల కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టింది. ఇప్పుడు అన్ని యాజమాన్యాల్లోని స్కూళ్లలో అభ్యసన కార్యక్రమాల నిర్వహణకూ పక్కా ప్రణాళిక రూపొందించింది. 2022–23 విద్యా సంవత్సరానికి సమగ్ర విద్యా క్యాలెండర్‌ను ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ రూపొందించింది. 

విద్యా హక్కు చట్టం ప్రకారం నిర్దేశించిన పనిదినాలతో క్యాలెండర్‌ను రూపొందించారు. ఫౌండేషన్‌ పాఠశాలల నుంచి హైస్కూల్‌ వరకు చేపట్టాల్సిన విద్యా కార్యక్రమాలను సవివరంగా పొందుపరిచారు. అకడమిక్‌ క్యాలెండర్‌లోని లెసన్‌ ప్లాన్‌  ప్రకారం అన్ని యాజమాన్యాల్లోని స్కూళ్లూ విద్యాభ్యసన కార్యక్రమాలు చేపట్టాలని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి చెప్పారు. నెలవారీ కార్యక్రమాలు, లక్ష్యాలు, వాటి సాధన వంటి అంశాలను ఎస్సీఈఆర్టీ క్యాలెండర్లో సవివరంగా పొందుపరిచింది.

జూలై 5 నుంచి పాఠశాలల పునఃప్రారంభం
వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు జూలై 5 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ విద్యా సంవత్సరానికి జులైలో 22 రోజులు, ఆగస్టులో 22, సెప్టెంబర్‌లో 20/25, అక్టోబర్‌లో 19, నవంబర్‌లో 25, డిసెంబర్‌లో 26/18, జనవరిలో 26/23, ఫిబ్రవరిలో 22, మార్చిలో 23, ఏప్రిల్‌లో 21 రోజుల పాటు పాఠశాలలు పనిచేస్తాయి. మొత్తం మీద పాఠశాలలు 220 రోజులు పనిచేస్తాయి. దసరా, సంక్రాంతి, క్రిస్‌మస్, వేసవి సెలవులు మొత్తం 80 రోజులు సెలవు దినాలు ఉంటాయి. మిగతా రోజులు పండుగలు, ఆదివారాలు, ఇతర సెలవులు ఉంటాయి. దసరా సెలవులు సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 6వరకు, క్రిస్‌మస్‌ సెలవులు డిసెంబర్‌ 23 నుంచి జనవరి 1 వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి జనవరి 16 వరకు ఉంటాయి. 

స్క్లూళ్ల సమయాలివీ..
ఫౌండేషన్‌ స్కూళ్లు (1, 2 తరగతులు, 1 నుంచి 5 తరగతుల స్కూళ్లు) ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పనిచేస్తాయి. గేమ్స్, రెమిడియల్‌ తరగతులకోసం ఆప్షనల్‌ పీరియడ్‌ను 3.30 నుంచి 4.30 వరకు ఇవ్వాలి. హాఫ్‌డే స్కూళ్ల సమయంలో ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు కొనసాగించాలి. హైస్కూళ్లు (3 నుంచి 7, 8 తరగతుల వరకు, 3 నుంచి 10వ తరగతి వరకు, 3 నుంచి 11, 12 తరగతులు,  6 నుంచి 10వ తరగతి) స్కూళ్లు  ఉదయం 9 నుంచి సాయంత్రం 4.00 వరకు పనిచేస్తాయి. ఆప్షనల్‌ పీరియడ్‌ సాయంత్రం 4.00 నుంచి 5.00 గంటల వరకు ఉంటుంది. హాఫ్‌డే స్కూళ్ల సమయంలో ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు జరుగుతాయి. అన్ని స్కూళ్లలో తరగతుల మధ్యలో ఉదయం, మధ్యాహ్నం తప్పనిసరిగా వాటర్‌ బెల్‌ ఉంటుంది.


సబ్జెక్టుల వెయిటేజి ప్రకారం పీరియడ్లు

వివిధ సబ్జెక్టుల వెయిటేజి ప్రకారం పీరియడ్లు ఉంటాయి. 1 నుంచి 5 తరగతులకు వారానికి 240 పీరియడ్లు ఉంటాయి. 1 నుంచి అన్ని తరగతులకు సబ్జెక్టు వెయిటేజీని క్యాలెండర్లో పొందుపరిచింది. హైస్కూళ్లలో అన్ని సబ్జెక్టులకు వెయిటేజీని ప్రకటిస్తూ వారానికి 384 పీరియడ్లను కేటాయించింది. ప్రధాన సబ్జెక్టులతో పాటు వుయ్‌ లవ్‌ రీడింగ్, ఆనంద వేదిక, ఎన్విరాన్మెంటల్‌ ఎడ్యుకేషన్, కెరీర్‌ గైడెన్సు, మాస్‌ డ్రిల్, ఫిజికల్‌ ఎడ్యుకేషన్, వేల్యూ ఎడ్యుకేషన్, వొకేషనల్‌ ఎడ్యుకేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌ డెవలప్‌మెంట్, వర్క్‌ ఎడ్యుకేషన్, హెల్త్‌ ఎడ్యుకేషన్, ఆర్ట్‌ అండ్‌ కల్చరల్, స్కూల్‌ సేఫ్టీ వంటి అంశాలను ప్రణాళికలో చేర్చారు. (క్లిక్: ఈ అమ్మఒడి  భవితకు పెట్టుబడి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top