వెబ్‌ల్యాండ్‌ హ్యాక్‌ | Andhra Pradesh land records system collapses | Sakshi
Sakshi News home page

వెబ్‌ల్యాండ్‌ హ్యాక్‌

Oct 8 2026 5:39 AM | Updated on Oct 8 2026 5:39 AM

Andhra Pradesh land records system collapses

కుప్పకూలిన రాష్ట్ర భూరికార్డుల వ్యవస్థ

2 రోజులుగా నిలిచిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు  

నిలిచిన క్రయవిక్రయాలు, ఆగిన పంటరుణాలు 

ఈ–క్రాప్‌ నమోదు, ఎరువుల పంపిణీపైనా ప్రభావం 

ప్రైవేటు చేతుల్లోకి కోట్లాదిమంది రైతుల భూముల డేటా  

వైఎస్‌ జగన్‌ రీసర్వేతో దేశానికే ఆదర్శంగా నిలిచిన ఏపీ  

చంద్రబాబు చేతగానితనంతో అస్తవ్యస్తం.. హ్యాకింగ్‌ను సాంకేతిక సమస్యగా కప్పిపుచ్చుతున్న కూటమి సర్కారు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని భూముల వివరాలు, రైతుల యాజమాన్య హక్కుల రికార్డుల వివరాలున్న వెబ్‌ల్యాండ్‌ పోర్టల్‌ హ్యాకింగ్‌కు గురైంది. దీంతో భూపరిపాలనకు గుండెకాయ వంటి ఈ వ్యవస్థ కుప్పకూలింది. ఫలితంగా రెండురోజుల నుంచి ఏ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలోనూ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరగడంలేదు. క్రయవిక్రయాలు పూర్తిగా స్తంభించాయి. పంటరుణాలు, ఈ–క్రాప్‌ నమోదు, ఎరువుల పంపిణీపైనా ప్రభా­వం పడినట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా చంద్రబాబు కూటమి ప్రభుత్వం మాత్రం దీన్ని చిన్న సాంకేతిక సమస్య అని చెబుతోంది. వెబ్‌ల్యాండ్‌ హ్యాక్‌ అయి రెండురోజులు అయినా వాస్తవం బయటకు రాకుండా తొక్కిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలోని కోట్లాది సర్వే నంబర్లు, ఎల్‌పీఎం నంబర్లు, భూయజమానుల పేర్లు, వారి ఆధార్‌ అనుసంధాన వివరాలు, అడంగల్, 1–బీ, మ్యుటేషన్ల చరిత్ర.. మొత్తం రాష్ట్ర భూసంపద వివరాలన్నీ వెబ్‌ల్యాండ్‌లోనే ఉంటాయి. అలాంటి వ్యవస్థ మొత్తం హ్యాక్‌ అవడంతో ప్రజల భూములు మొత్తం ప్రమాదంలో పడినట్లేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక్క క్లిక్‌తో యజమాని పేరు మారిపోయే ప్రమాదం నెలకొందని నిపుణులు చెబుతున్నారు.  

హెచ్చరికలు వచ్చినా నిద్రపోయిన సర్కారు 
రాష్ట్రంలో భూముల డేటా అంతా చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీసీఎల్‌ఏ) ఆధ్వర్యంలోని వెబ్‌ల్యాండ్‌ పోర్టళ్లలో ఉంటుంది. రీసర్వే పూర్తయిన గ్రామాలకు వెబ్‌ల్యాండ్‌–2, రీసర్వే కాని గ్రామాలకు పాత వెబ్‌ల్యాండ్‌ పనిచేస్తాయి. ప్రజలు తమ భూమి వివరాలు చూసుకునేందుకు మీభూమి పోర్టల్‌ ఉంది. పదిరోజులుగా ఈ పోర్టళ్లలో తరచు సమస్యలు వస్తున్నాయి. వారం కిందటే మీభూమి పోర్టల్‌ పూర్తిగా ఆగిపోయింది. అయినా ప్రభుత్వం కళ్లు తెరవలేదు. ఫలితంగా రెండురోజుల కిందట మొత్తం వెబ్‌ల్యాండ్‌ వ్యవస్థే కుప్పకూలింది. వెబ్‌ల్యాండ్‌ నిర్వహణ అధికారికంగా నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) ద్వారా జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్‌ఐసీ ద్వారా ప్రైవేటు వ్యక్తులు, ఏజెన్సీలకు లాగిన్‌ ఐడీలు, ఇతర కీలక యాక్సెస్‌లు విచ్చలవిడిగా ఇచ్చారని రెవెన్యూవర్గాల సమాచారం. భూరికార్డులను మార్చే అధికారం అధికారుల నుంచి ప్రైవేటు ఏజెన్సీలు, కార్పొరేట్‌సంస్థలు, వ్యక్తులకు ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలిసింది.  

బ్లాక్‌చెయిన్‌ పేరుతో డేటా మొత్తం బయటకు 
ఇచ్చిన యాక్సెస్‌లు చాలవన్నట్లు ప్రభుత్వం ఇప్పుడు వెబ్‌ల్యాండ్‌ డేటా, రిజిస్ట్రేషన్ల డేటా, సర్వే డేటా మొత్తాన్ని ఒకేచోటకు చేర్చి బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీతో పోర్టళ్లను పూర్తిగా మార్చే పనిలో పడింది. ఈ ఏడాది జూలైలో చంద్రబాబు మీభూమి–బ్లాక్‌చెయిన్‌ పైలెట్‌ ప్రాజెక్టును ఆర్భాటంగా ప్రారంభించారు. చివరికి మొత్తం భూరికార్డుల వ్యవస్థనే అస్థవ్యస్థంగా మార్చి కుప్పకూలేలా చేశారు. డేటా మైగ్రేషన్‌ పేరుతో మొత్తం భూముల సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతులకు అప్పగించడమే ఈ ప్రాజెక్టు వెనుక అసలు ఉద్దేశమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

భూములు మార్చేందుకేనా ఈ హ్యాకింగ్‌? 
ఈ హ్యాకింగ్‌ యాదృచ్ఛికంగా జరిగింది కాదనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగా భూరికార్డులను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలోనే ఇది జరిగిందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రూ.కోట్ల విలువ చేసే భూములు, ప్రభుత్వ భూములు, అసైన్డ్‌ భూములు, 22–ఏ నిషేధిత జాబితాలోని భూములపై కన్నేసినవారే దీనివెనుక ఉన్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది.  

ఆధార్‌ వివరాలకు ముప్పు 
వెబ్‌ల్యాండ్‌లో భూయజమానుల ఆధార్‌ నంబర్లు, మొబైల్‌ నంబర్లు అనుసంధానమై ఉన్నాయి. హ్యాకర్ల చేతికి ఈ వివరాలు చేరితే సైబర్‌ మోసాలు, నకిలీ దస్తావేజుల సృష్టికి అవకాశం ఏర్పడుతుంది.  

స్తంభించిన క్రయవిక్రయాలు 
రోజుకు సుమారు ఐదువేల వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో రాష్ట్రంలో భూలావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. ముందే అడ్వాన్సులు ఇచ్చి రిజిస్ట్రేషన్‌ తేదీలు ఖరారు చేసుకున్నవారు ఆందోళనలో ఉన్నారు. పిల్లల పెళ్లిళ్లు, చదువులు, వైద్య ఖర్చులు, అప్పులు తీర్చేందుకు భూములు అమ్ముకోవాలనుకున్న రైతులు డబ్బు చేతికి అందక అల్లాడుతున్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాసి నిరాశతో వెనుదిరుగుతున్నారు. రిజిస్ట్రేషన్ల రూపంలో రోజూ రావాల్సిన స్టాంప్‌ డ్యూటీ ఆదాయం కూడా ఆగిపోయి ఖజానాకు భారీనష్టం వాటిల్లుతోంది. మ్యుటేషన్లు, వారసత్వ బదిలీలు కూడా ఆగిపోయాయి.  

వైఎస్‌ జగన్‌ హయాంలో దేశానికే ఆదర్శం  
గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వందేళ్ల తర్వాత రాష్ట్రంలో సమగ్ర భూ రీసర్వేకి శ్రీకారం చుట్టింది. డ్రోన్లు, కార్స్‌ నెట్‌వర్క్‌ వంటి ఆధునిక సాంకేతికతతో ప్రతి భూకమతాన్ని కొలిచి, ప్రతి పార్సిల్‌కు ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించింది. రైతులకు శాశ్వత భూహక్కులు కల్పించి, సరిహద్దు వివాదాలకు ముగింపు పలకాలన్నది లక్ష్యం. వేలాది గ్రామాల్లో రీసర్వే పూర్తిచేసి కొత్త రికార్డులు రూపొందించింది. ఇక్కడ రీసర్వే జరుగుతున్న ఈ విధానాన్ని చూసి ఇతర రాష్ట్రాలు, కేంద్రప్రభుత్వ సంస్థలు కూడా అధ్యయనం చేశాయి. భూరికార్డుల ఆధునికీకరణలో ఏపీ దేశానికే మోడల్‌గా నిలిచింది. రీసర్వేని సక్రమంగా చేయలేకపోతున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం వెబ్‌ల్యాండ్‌ వ్యవస్థను కూడా సమర్థంగా నిర్వహించలేక కుప్పకూల్చింది. వైఎస్‌ జగన్‌ హయాంలో దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం.. చంద్రబాబు పాలనలో భూరికార్డులు హ్యాక్‌ అయిన రాష్ట్రంగా అప్రతిష్ట మూటగట్టుకుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement