ఏపీఎఫ్‌డీసీ ద్వారా టికెట్లు విక్రయించుకోండి

Andhra Pradesh High Court says Sell tickets through APFDC - Sakshi

ఆ ప్రక్రియ ఎలా సాగుతుందో చూసి.. స్పందిస్తాం

హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు

సొంతంగా టికెట్ల విక్రయానికి అనుమతివ్వాలన్న మల్టీప్లెక్స్‌ థియేటర్లు

ప్రస్తుతం అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమన్న ధర్మాసనం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సినిమా టికెట్లను ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎఫ్‌డీసీ) ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయించుకునే ప్రక్రియ కొనసాగించుకోవచ్చని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. కొంతకాలం తరువాత ఈ ప్రక్రియ ఎలా కొనసాగుతుందో చూసి తగిన విధంగా స్పందిస్తామని తెలిపింది. ఇదే సమయంలో తమ సొంత పోర్టల్‌ ద్వారా టికెట్లను విక్రయించుకునేందుకు అనుమతించాలన్న మల్టీప్లెక్స్‌ థియేటర్ల అభ్యర్థనకు హైకోర్టు నో చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.

ఏపీఎఫ్‌డీసీ ద్వారా టికెట్ల విక్రయం నిమిత్తం ప్రభుత్వం గత డిసెంబర్‌ 17న జారీచేసిన జీవో 142ను సవాలు చేస్తూ మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై గురువారం సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది సుమిత్‌ నీమా వాదనలు వినిపిస్తూ.. ఏపీఎఫ్‌డీసీ ద్వారా మాత్రమే టికెట్లను విక్రయించాలని ప్రభుత్వం చెబుతోందన్నారు. తాము తమ సొంత పోర్టల్‌ ద్వారా టికెట్లు విక్రయిస్తున్నామని, సమాంతరంగా రెండు వ్యవస్థలు ఉండటం వల్ల ఇబ్బందేమీ ఉండదని చెప్పారు. దీనిపై ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వివరణ కోరింది.

ఏపీఎఫ్‌డీసీ ద్వారా వాళ్లూ టికెట్లు అమ్ముకోవచ్చు
ఏజీ వాదనలు వినిపిస్తూ.. ఏపీఎఫ్‌డీసీ ద్వారా టికెట్లను విక్రయించేందుకు బుక్‌మై షో, పేటీఎం వంటి సంస్థలు అంగీకరించాయని, అయితే మల్టీప్లెక్స్‌ థియేటర్లు మాత్రం ముందుకు రావడంలేదని చెప్పారు. టికెట్‌ విక్రయ కార్యకలాపాలను ఏపీఎఫ్‌డీసీలో విలీనంచేస్తే తమకు అభ్యంతరం లేదని తెలిపారు. చట్ట నిబంధనలకు అనుగుణంగానే ఆన్‌లైన్‌ టికెట్‌ విక్రయాల జీవో ఇచ్చామన్నారు. ఏపీఎఫ్‌డీసీ ద్వారా టికెట్ల విక్రయాన్ని కొనసాగించనివ్వాలని, దీనివల్ల పిటిషనర్‌ హక్కులకు భంగం వాటిల్లుతుంటే అప్పుడు జోక్యం చేసుకోవచ్చునని చెప్పారు. టికెట్ల విక్రయాల నుంచి తామెవరినీ తప్పించడం లేదని, ఏపీఎఫ్‌డీసీ ద్వారా విక్రయించాలని చెబుతున్నామని తెలిపారు. ఒక్కో టికెట్‌ విక్రయించినందుకు ప్రభుత్వానికి రూ.1.97 సర్వీసు చార్జీ కింద వస్తుందని చెప్పారు.

ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఇబ్బంది ఏముందని మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ న్యాయవాదిని ప్రశ్నించింది. తమకు తమ సొంత వ్యవస్థలు, విధానం ఉన్నాయని సుమిత్‌ నీమా చెప్పారు. తిరిగి ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ప్రభుత్వం ఆన్‌లైన్‌ టికెట్ల విధానాన్ని ఆషామాషీగా తీసుకురాలేదని, చట్టం ద్వారా ఆ విధానాన్ని తీసుకొచ్చిందని పేర్కొంది. అందువల్ల ఏపీఎఫ్‌డీసీ ద్వారా ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయాన్ని కొనసాగనివ్వాలంటూ ఉత్తర్వులిచ్చింది. తమ సొంత విధానంలో కూడా టికెట్ల విక్రయానికి అనుమతినివ్వాలన్న మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ అభ్యర్థనను తోసిపుచ్చింది. తదుపరి విచారణను జూలై 12కి వాయిదా వేసింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top