
సాక్షి, అమరావతి: నిందితుడు ఘటనా స్థలంలో లేనంత మాత్రాన అతడు నేర బాధ్యత నుంచి తప్పించుకోజాలడని హైకోర్టు స్పష్టం చేసింది. ఘటనా స్థలంలో లేరన్న కారణంతో బెయిల్ మంజూరు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఎర్ర చందనం అక్రమ రవాణా తీవ్రమైన నేరమని, దర్యాప్తు కొనసాగుతున్నందున నిందితునికి బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్ ఇటీవల తీర్పు వెలువరించారు.
కేసు పూర్వాపరాలివీ..
శ్రీసిటీ ప్రాంతంలో ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఓ ట్రాక్టర్ నుంచి ఎర్ర చందనం దుంగల్ని దిగుమతి చేస్తున్న ఆరుగురు వ్యక్తులు పోలీసుల్ని చూసి వాళ్లపై రాళ్లు విసురుతూ పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు మధ్యవర్తుల సమక్షంలో పోలీసులు ఎర్ర చందనం దుంగల్ని జప్తు చేసి వారిని కస్టడీలోకి తీసుకుని విచారించారు.
ఎర్ర చందనం దుంగలు చిత్తూరు జిల్లా మతేరిమిట్ట గ్రామానికి చెందిన కె.శిబి చక్రవర్తికి చెందినవని, తాము ట్రాక్టర్‌లో వాటిని తెస్తుంటే శిబి చక్రవర్తి మోటార్ బైక్‌పై వెళుతూ వాటిని దించాల్సిన చోటు చూపించాడని చెప్పారు. ఎక్కడ దించాలో చూపి శిబి చక్రవర్తి వెళ్లిపోయారని వివరించారు. దీంతో పోలీసులు శిబి చక్రవర్తిని ప్రధాన నిందితుడిగా చేర్చారు.
ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ శిబి చక్రవర్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అతడు ఘటనా స్థలంలో లేడని, మిగిలిన నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే పిటిషనర్‌ను నిందితునిగా చేర్చారన్నారు. పోలీసులు కావాలనే ఈ కేసులో అతడిని ఇరికించారన్నారు.
ఈ వాదనల్ని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తోసిపుచ్చారు. ఎర్ర చందనం దుంగలు రవాణా చేస్తున్న ట్రాక్టర్ పిటిషనర్‌దేనని తెలిపారు. ఎర్ర చందనం అక్రమ రవాణాలో అతడే ప్రధాన వ్యక్తి అని, ఘటనా స్థలంలో లేడన్న కారణంతో బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని, ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని కోర్టుకు వివరించారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి జస్టిస్ రాయ్ నిందితుడికి బెయిల్ నిరాకరించారు.